Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే..

This Seven Home Remedies May Stop Dry Throat - Sakshi

ఇమ్యునిటీ బలహీనంగా ఉంటే సీజనల్‌ వ్యాధులు ఎ‍ప్పుడూ పొంచి ఉంటాయి. ఇక జలుబు, దగ్గు వంటి వ్యాధులైతే దాడి చేస్తూనే ఉంటాయి. గొంతు పొడిబారటం, పొడి దగ్గు రావటం వీటి ప్రధాన లక్షణాలు. సాధారణంగా కఫం ఉత్పత్తికాకపోతే దగ్గు వస్తుంది. ఒక్కోసారి అయితే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీల వల్ల కూడ దగ్గు వస్తుంది. ఇది ఎ‍క్కువకాలం కొనసాగితే ఆహారం నమలడం, మింగడంలో సమస్యలు తలెత్తుతాయి.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలు. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అయితే ఇంటిలో సులభంగా తయారు చేసుకునే రెమిడీలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చు! నిపుణులు సూచించిన ఈ చిట్కాల ద్వారా పొడిగొంతు సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చో తెలుసుకుందాం..

తులసి, తేనెలతో టీ
పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు కలిపిన పాలు
పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. పసుపును ఆహారంలో భాగంగా తీసు​కున్నట్టయితే వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నెయ్యితో మిరియాల పొడి
యాంటీ బ్యాక్టీరియల్‌ (సూక్ష్మజీవుల వినాశక), యాంటీ ఫంగల్‌ (తాపనివారక) లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. ఒక టేబుల్‌ స్ఫూన్‌ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ములేథి లేదా లికోరైస్‌ మూలిక చూర్ణం
లికోరైస్‌ అనేది ఒక​ ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తియ్యగా ఉండటం వల్ల దీనిని అతిమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి, నోట్లో వేసుకుని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు.

ఉప్పునీరు
పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటి పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం.

హెర్బల్‌ టీ
కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్‌ టీ. వీటివల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది.

మెంతుల డికాషన్‌
వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్‌ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top