అతనే.. భామ | Sakshi Interview With Indian classical dancer Sanjay Vadapalli | Sakshi
Sakshi News home page

అతనే.. భామ

Apr 3 2026 12:23 AM | Updated on Apr 3 2026 12:23 AM

Sakshi Interview With Indian classical dancer Sanjay Vadapalli

ఆమె నృత్యం చేస్తున్నంతసేపూ అపురూప అందాల రాశి అనుకుంటూ కనురెప్పలు కొట్టడమే మానేసి కళ్ళప్పగించి చూస్తాం! ప్రదర్శన పూర్తయ్యాక కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఆమె కాదు, అతను... పేరు సంజయ్‌ వడపల్లి అని వ్యాఖ్యాత ప్రకటించగానే హాలు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది! అవును అతను సంజయ్‌ వడపల్లి! ఆంధ్రనాట్యంలో అద్భుత నర్తకిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 

భరత కళాప్రపూర్ణ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, అభినవ సత్యభామ డాక్టర్‌ కళాçకృష్ణ ఆయన గురువులు. ప్రస్తుతం  హెచ్‌.ఎస్‌.బి.సి హాంగ్‌ కాంగ్‌ బ్రాంచ్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం హైదరాబాద్‌ తెలుగు విశ్వ విద్యాలయంలో ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

తన 8వ ఏట డాక్టర్‌ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య, తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్‌ కళాçకృష్ణ దగ్గర ప్రబంధ సాంప్రదాయ నవ జనార్ధన పారిజాతం నేర్చుకున్నారు. తొలిసారి సత్యభామ వేషం ధరించి నాట్యం చేసినప్పుడు లభించిన ప్రశంసలతో నాట్య రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్‌ తెలిపారు. 

తాను సత్యభామగా నర్తించినప్పుడు వేదికపై చూసిన వారు, ఆ తరువాత మేకప్‌ తొలగించుకుని పలకరిస్తే ఆశ్చర్య పోయేవారని, తానే సత్యభామ అంటే నమ్మే వారు కాదంటూ తొలినాటి ప్రదర్శనల అనుభూతులను గుర్తు చేసుకున్నారు. సంజయ్‌ వడపల్లి సత్యభామగా నవ జనార్దన పారిజాతంతో1985 నుంచి దేశంలోని వివిధ నృత్యోత్సవాల్లో, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. యునెస్కో, హాంగ్‌ కాంగ్‌ ఇన్‌–క్రెడిబుల్‌ ఫెస్టివల్, అమెరికాలో జరిగిన నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సంజయ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

డాక్టర్‌ నటరాజ రామకృష్ణ నృత్య రత్న పురస్కారం
ఆంధ్రనాట్యం, పేరిణి నాట్య సృష్టికర్త డాక్టర్‌ నటరాజ రామకృష్ణ పేరిట తమ డ్యాన్సింగ్‌ బెల్స్‌ సంస్థ నుంచి జాతీయస్థాయిలో నృత్య రత్న అవార్డును ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల్లో విశేష కృషి చేస్తూ విశ్వవ్యాప్తం చేసే గురువులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కింద 20 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ప్రతి యేటా గురువులను సత్కరిస్తామని, యువ నర్తకులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు సంజయ్‌ తెలిపారు. 

ఆంధ్రనాట్య సోలో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంజయ్‌ ప్రతిష్టాత్మక సత్రాజితి అవార్డుతో పాటు ఇంటర్నేషనల్‌ ట్రెడిషనల్‌ డ్యాన్స్ కాంగ్రెస్‌ అవార్డు, ఆంధ్రనాట్య కళాశౌర్య అవార్డు, సింగిడి తెలంగాణ పురస్కారం, నృత్యకౌముది, ముంబయి వారి జాతీయ సమైక్యతా నృత్య పురస్కారం లాంటి పలు అవార్డులు అందుకున్నారు. 

బాలనటుడైన సంజయ్‌ వడపల్లి కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన శృతి లయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్ధన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతోపాటు నాట్యాచార్య డాక్టర్‌ నటరాజ రామకృష్ణ, డాక్టర్‌ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావి తరాలకు అందించే ప్రయత్నమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ‘అభినవ అంతర్జాతీయ సత్యభామ’ సంజయ్‌ వడపల్లి తెలిపారు. ఈనెల 4న నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే తన ప్రదర్శనకు ఉచిత ప్రవేశం అని, కళాప్రియులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.  

– పురుమాండ్ల నరసింహారెడ్డి, 
సాక్షి, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement