కథ: నేనూ నాగరాజు... సమాధి పక్కనే పడుకుని వస్తాను.. ‘మీకిదేం పాడు బుద్ధి?.. పర్లేదు!

Sakshi Funday: Nenu Nagaraju Story By Former MP DVG Shankar Rao

క్రైమ్‌స్టోరీ

ఆ రోజు సాయంత్రం... పదేళ్ల తర్వాత ఊర్లోకి అడుగుపెట్టాను. నేనొచ్చినట్టు నా శత్రువు నాగరాజుకి తెలిసే అవకాశం లేదు. వాడితో శత్రుత్వానికి నేపథ్యాలు ఇక్కడ చెప్పడం అనవసరమే గానీ తీవ్రత చెప్పడం అవసరమే. ఎదురుపడితే ఎవరో ఒకరమే ప్రాణాలతో మిగులుతాం. రెండోవాడు హంతకుడు కావాల్సిందే.. వాడైనా..నేనైనా. ఒకరు శవం.. ఇంకొకరు ముద్దాయి. అంతే. వేరే మార్గం లేదు.

అయిదేళ్ల కిందట.. ఒకసారి నేనే మధ్యవర్తుల ద్వారా రాజీ సూత్రం ప్రతిపాదించాను.. ‘అయ్యిందేదో అయ్యింది.. జీవితాలు పాడవుతున్నాయి గతం మరిచిపోదాం’ అంటూ.
ససేమిరా అన్నాడు. అదే చివరిసారి. వాడికి సొసైటీలో పలుకుబడి ఎక్కువే. అందుకనే దూరంగా బతుకుతున్నాను. ఒకరి ఉనికి ఒకరికి తెలియనంతగా. ఊళ్ళో ఎవరితోనూ టచ్‌లో లేను. ఆరోజు మాత్రం రావాల్సివచ్చింది.. ఒంటరిగా.

రాత్రయ్యింది.. ఇంట్లో భోజనం చేసి నిద్రకుపక్రమించాను. ముందు జాగ్రత్తగా తలగడ కింద ఒకవైపు కత్తి.. మరోవైపున బెడ్‌ కింద, చేతికందేంత దూరంలో ఇనుపరాడ్‌ ఉంచుకున్నాను. ఉదయాన్నే వెనక్కి వెళ్లిపోవాలి. నేను ప్రస్తుతం ఉంటున్న పట్టణంలో ఎవరూ నేనిలా ఆయుధాలతో పడుకునే పరిస్థితిలో ఉంటానని చచ్చినా నమ్మరు. ఇక్కడే ఈ స్థితి.

ఇక తెల్లవారుతుందనగా గదిలో అలికిడి. కళ్ళు తెరిచేలోగా నన్ను సమీపించిన చప్పుడు. కచ్చితంగా బలమైన మనిషి అడుగులే. తలగడ కింద కత్తిని అందుకోబోయాను. అప్పటికే ఆలస్యమైంది. నా ఛాతీ మీద బరువు. ఆగంతకుడు నా మీద కూర్చుని, చేతుల్ని కదలనివ్వడం లేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. వీడు కచ్చితంగా నాగరాజే. వాడు జైలుకి, నేను పైలోకానికి పోవడం ఖాయం.

పెనుగులాడుతున్నాను. ప్రయత్నం వదలలేదు. చివరకు పట్టు వీడింది. ఒక్కసారిగా బలంగా విదిలించి లేచాను. వాడు మెరుపులా చీకట్లో కలిసిపోయాడు. వాడి వేగానికి ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు వాడి చూపులో ‘ఈసారికి బతికిపోయావులే’ అన్న భావం కదలాడింది.

నా గుండె వేగం ఇంకా తగ్గలేదు. మృత్యువు అంచులదాకా వెళ్ళొచ్చాను కదా! నా ప్రతికదలికా వీడికెలా తెలుస్తోంది? కనబడగానే చంపెయ్యాలన్నంత కసి పెరుగుతూ పోతోంది కానీ ఏమాత్రం తగ్గలేదు. గ్లాసు నీళ్లు తాగాను. అందులో సగం కిందనే ఒలికాయి చేతుల వణుకుతో.

ఇంకో అనుమానం ‘నిద్రపోతున్న నన్ను ఒక్క వేటుతో ఫినిష్‌ చెయ్యగలడు కదా! మరెందుకు తడబడ్డాడు? నా ప్రతిఘటనతో బాలెన్స్‌ తప్పాడా? అయితే ఎందుకు పరిగెత్తిపోయాడు? వాడి బలిష్టమైన శరీరం ముందు సన్నగా ఉన్న నేను ఏమాత్రం? లేదా నన్నిలా బెదిరించి, రెండోదఫాలో సఫా చేద్దామని అనుకున్నాడా?’

ఎన్నో సందేహాలు. ఏమైనా మరి ఉపేక్షించడానికి లేదు. అటో, ఇటో తేల్చుకోవాలి. ఉదయాన్నే పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. ఫిర్యాదు చేశాను. అనుమానంగా చూస్తూ ఇన్‌స్పెక్టర్‌ అడిగాడు ‘ఎవరో ఆగంతకుడా? లేదా నాగరాజే హత్యాయత్నం చేశాడా?’ అని. 

‘స్పష్టంగా చూశాను సార్‌. నాగరాజే. వాడిమీదే ఫిర్యాదు’ అన్నాన్నేను.  ‘సర్లెండి. వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి క్రైమ్‌సీన్‌ చూస్తారు’ అని చెప్పాడు.  ఆయన మొహంలో కొంచెం నిర్లక్ష్యం. బహుశా నాగరాజు పట్ల సానుకూల భావం. అసలే పలుకుబడి ఉన్న వ్యక్తి.
∙∙∙ 
నాగరాజు ఇంటికి, పోలీసు స్టేషన్‌ నుండే సరాసరి బయల్దేరాను. పట్టపగలు అందరూ చూస్తుండగా ఎటూ నన్ను చంపలేడు. ఆ ప్రయత్నం చేసినా నేను ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక ఈ శత్రుత్వానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేద్దామని డైరెక్ట్‌గా చెప్పేస్తాను. గతంలో మధ్యవర్తుల ద్వారా కదా చెప్పింది.. ఈ సారి నేనే ఫైనల్‌గా చెప్పేస్తే అతడి జవాబు బట్టీ నిర్ణయించుకోవచ్చు.

వాళ్ళబ్బాయి మంచినీళ్లిచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. వీడికి తండ్రి పోలికలు వచ్చినట్టు లేవు.. సన్నగా ఆధునికంగా ఉన్నాడు. ‘అంకుల్, అమ్మకి చెప్తానుండండి’అంటూ లోపలికి వెళ్ళాడు. అమ్మకి చెప్పడమేమిటి, నాగరాజు ఇంటికి ఇంకా రాలేదా అనుకుంటూ లోపలికి చూశాను.

షాక్‌తో మాట రాలేదు. గోడకి పూలదండతో వేలాడుతున్న నాగరాజు ఫొటో. ఆవిడ వస్తూ నమస్కరించి ‘అంతా కలలోలా అయిపోయిందండి. ఆక్సిడెంట్‌కి ముందే నాతో మాట్లాడారు. గంటలో వస్తున్నట్లు. ఈలోగా లారీ గుద్దేసింది. స్పాట్‌లో ప్రాణాలు పోయాయి. ఎప్పుడూ మీ గురించే తలుస్తుండే వారు’ కళ్లు తుడుచుకుంది.

ఇంకా షాక్‌లోనే ఉన్న నేను ఫొటో పై డేట్‌ ఆఫ్‌ డెత్‌ చూశాను. సరిగ్గా నెల అయ్యింది. ఎటూ పరామర్శకి వచ్చాననుకుంటున్నారు కదా అలానే మాట్లాడేసి సెలవు తీసుకున్నాను. అయితే రాత్రి వచ్చిందెవరు?

స్పష్టంగా చూశానే! ఆ ఒడ్డు పొడవు ఇంకెవరికీ లేవే! ఒకవేళ ఉన్నా శత్రుత్వం లేదే! అంతా కన్ఫ్యూజన్‌. బహుశా అందుకనే ఇన్‌స్పెక్టర్‌ అలా చూసి ఉంటాడు.. నెల కిందట పోయినవాడు నిందితుడేమిటాని.
∙∙∙
‘ఇలా జరిగిందోయ్‌. నాకు టెన్షన్‌ తగ్గడం లేదు’ భార్యకు ఫోన్‌ చేశాను. ‘అయితే దయ్యం అయి ఉంటుందా? త్వరగా ఇంటికి వచ్చెయ్యండి. అసలే తీరని కోరికలున్న వాళ్ళు దయ్యాలవుతారట.’

‘నాకు ఈ దయ్యాలు, పిశాచాల మీద నమ్మకం లేదు. ఈరోజు కూడా ఇక్కడే ఉండి వస్తాను. రాత్రికి శ్మశానానికి వెళ్లి నాగరాజు సమాధి పక్కనే పడుకుని వస్తాను.’ ‘మీకిదేం పాడు బుద్ధి? ఏదో తగలడండి. ఎటూ మీకు నచ్చిందే చేస్తారు. నాకు మాత్రం భయమేస్తోంది. మా ఫ్రెండ్‌ని తోడు పిలుచుకుంటాను.’

‘రేపొస్తాను’ అని ఫోన్‌ పెట్టేశాను.. నాగరాజు బతకనిస్తే అని మనసులో అనుకుంటూ. అనుకున్నట్టుగానే ఆ రాత్రి శ్మశానంలో పడుకున్నాను. భయంలేదు గానీ ఏదో తెలియని టెన్షన్‌. దాదాపు నిద్ర పట్టలేదు. కొంచెం పట్టేసరికి ఎవరో కదిలెళ్లినట్టనిపించింది. లేచి చూస్తే ఏమీ లేదు.
∙∙∙
ఇంట్లో నాకోసమే వెయిట్‌ చేస్తున్నట్లున్నారు. మా ఆవిడకు అసలే దయ్యాల భయం ఎక్కువ. రాత్రి నిజంగానే తోడు తెచ్చుకున్నట్టుంది. తన ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇంతకు ముందెప్పుడూ మేం కలుసుకోలేదు. దయ్యాలు, పారా సైకాలజీ అంటూ ఏదేదో చెప్తోంది. చూడ్డానికి మోడర్న్‌గానే ఉంది.

‘ఒక వేళ నాగరాజు దయ్యం నామీద పగబడితే రాత్రి అక్కడే ఉన్నాను కదా. రాలేదేం?’ ‘దయ్యాలు మీ ప్లాన్‌ బట్టీ రావు. వాటి ప్లాన్‌ బట్టి వస్తాయి’ నవ్వుతూ అంది. ‘అయితే మళ్లీ వచ్చే అవకాశం ఉందా?’

‘అది మీ మీద ఆధారపడి ఉంటుంది.అయితే కచ్చితంగా మీకు హాని చెయ్యదు. గ్యారెంటీ.’ ‘అలా ఎలా చెప్పగలరు?’ ‘ఎందుకంటే మీ కథ పూర్తిగా విన్నాక తెలిసింది.. మీకు లేవంగానే వచ్చినవి హిప్నోపాంపస్‌ హాల్యూసినేషన్స్‌. ఆ టైమ్‌లోనే వస్తాయవి. ఎవరో వచ్చినట్టు భ్రమ. పీడకలల్లాంటివి అన్న మాట.’

‘మరి ఛాతిపై బరువు, నేను కదల్లేకపోవడం?’ ‘దాన్ని స్లీప్‌ పెరాలసిస్‌ అంటారు. రెండూ కలిసి రావడాన్ని ఇంక్యుబస్‌ ఫెనామినా అంటారు.’ ‘మానసిక అనారోగ్యమా?’
‘కాదు. ఆరోగ్యవంతుల్లో కూడా అలా అప్పుడప్పుడు వస్తుంది.

నిద్రలేమి, అలసట, టెన్షన్‌ కారణాలు కావొచ్చు. కాబట్టి హ్యాపీగా రిలాక్స్‌ అవ్వండి’ అంటూ సెలవు తీసుకుంది. తర్వాత మా ఆవిడ చెప్పింది. ఆవిడ తనకు తెలిసిన సైకియాట్రిస్ట్‌ అట. ఫోన్లో నేను చెప్పిన విషయమూ, విధానమూ చూసి తనను సంప్రదించిందట. ఆవిడ మా ఆవిడ నుండీ, నా నుండీ పూర్తి వివరాలు సేకరించి ఇలా వ్యాధి నిర్ధారణ చేసిందన్న మాట.

‘మరి ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా!’ ‘బాబూ, మీరు మరీ తప్పదంటే భూత వైద్యులనైనా నమ్ముతారు కానీ సైకియాట్రిస్టు అంటే మాట్లాడతారా! అదేదో పిచ్చిలా నామోషీ ఫీల్‌ అయిపోరా?’ హాయిగా నవ్వేశాను. నాగరాజు మరి కనబడడేమో?!
  -డా. డి.వి.జి.శంకర రావు మాజీ ఎంపీ, పార్వతీపురం.
చదవండి: పరాయి జీవితాలు: పెళ్ళయిన ఏడాదిన్నర నుంచి ఆమెకి ఇదే అనుమానం.. ఆ క్షణం కూడా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top