పట్టువదలని విక్రమార్కుడు.. రుజువుకాని నేరం

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా.. నువు ఏ నీతి, నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదుగాని, ఈ లోకంలో నీతి జయిస్తుందనీ, అవినీతికి శిక్ష ఉంటుందనీ చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను శ్రమతెలియకుండా విను’అంటూ ఇలా చెప్పసాగాడు.. 

చాలాకాలం కిందట హరిప్రసాద్‌ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నిటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడూ, జమీందారుకు విశ్వాసపాత్రుడూనూ. అతని ప్రతి సలహానూ జమీందారు మారుమాటాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్లు పెరిగాయి. వాటితోబాటు నమస్కారాలు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకేరకం సహాయం ఇద్దరు, ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్లబుట్టలు పట్టుకురాసాగారు.

గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్లబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్లబుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడచివస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడిపూజారి ఉద్యోగమే గానీ బడిపంతులు ఉద్యోగమేగానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రానురాను గిరిధరుడి భార్య మెడనిండా మోయలేనంత బంగారమూ, ఇంటి నిండా అంతులేని వస్తుసామాగ్రీ ఏర్పడ్డాయి.

దీని ఫలితంగా హరిప్రసాదు జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలుగల బీదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు. వారాలు చేసి చదువుకుని ఎంతో తెలివితేటలు గలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు. కాని ఒక్క పళ్లబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. తన నమస్కారబాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి, శేషగిరికి ఒళ్లు మండుకొచ్చింది.

అతను జమీందారు వద్దకు వెళ్లి ‘మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు. లంచం పెట్టితే చాలు ఎలాటి పనికిమాలిన వాడికైనా పని దొరుకుతున్నది. చదువూ, తెలివీ ఉన్న పేదలు నీరుకారిపోతున్నారు’ అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి, తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు ‘నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను’ అని చెప్పి అతణ్ణి పంపేశాడు. 

తరవాత జమీందారు యాయవారం బ్రాహ్మణ్ణి ఒకణ్ణి పట్టుకుని ‘ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు. ఈ నూరు రూపాయల సంచీ తీసుకుని ఆ ఊళ్లో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని చెప్పి పంపించేశాడు. పూజలు చేయించటంలో చాలాకాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి ‘నువు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని అతణ్ణి కూడా పంపేశాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్లారు. యాయవారపు బ్రాహ్మడు రూపాయల సంచీ పట్టుకు కూర్చున్నాడు.

అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటంవల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతను వచ్చిన పని తెలుసుకుని ‘ఈ గుడి మన జమీందారుగారు కట్టించినదే. నీ వంటి అనుభవంగలవాణ్ణి పూజారిగా నియమించటానికి జమీందారుగారు ఎందుకు అభ్యంతరం చెబుతారు?’ అన్నాడు. యాయవారపు బ్రాహ్మడు కూడా అదే పనికోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ‘ఏమీరాని నీకు పూజారి పని ఏమిటి? వెళ్లవోయ్‌’ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడిపూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట, జమీందారు శేషగిరికి కబురుపెట్టి ‘నేను గిరిధరుడికి పరీక్ష పెట్టిచూశాను. అతను లంచగొండి అని రుజువుకాలేదు’ అని చెప్పాడు.

శేషగిరి కొంచెం చిరాకుపడి ‘అతను లంచగొండి అనటానికి వేరే పరీక్షకావాలాండీ? అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి! సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి! మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారమూ, అన్ని సామాన్లూ కొనలేడని మీకే తెలుస్తుంది’ అన్నాడు. జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పాపెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి ‘మా ఊళ్లో మంచిపొలం అమ్మకానికి వచ్చింది. కొందామంటే నా వద్ద డబ్బులేదు.

నువ్వయినా కొనుక్కో! చాలా మంచి బేరం’ అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికి ఇచ్చి ‘ఈ నగలు తాకట్టుపెట్టి పొలం కొనుక్కో. తరవాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్టు విడిపించుకోవచ్చు’ అన్నాడు. అదేసమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది. వాళ్ల అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు. 

అలాటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారుపడుతూ ‘అయ్యో కూర్చోవటానికి సరి అయిన కుర్చీ కూడా లేదు’ అని ఒక జంపఖానా పరచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీటవేశాడు. గిరిధరుడి భార్య ‘ఒక వెండి గ్లాసయినా లేదు’ అనుకుంటూ బాగా తోమిన కంచులోటాలో పాలుపోసి పళ్లెంలో కొన్ని పళ్లుతెచ్చి జమీందారుకు ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపుతాడు తప్పలేదు. చేతులు బోసిగా ఉన్నాయి. ఇల్లంతా బావురుమంటున్నది. 

‘నా గురించి ఏమీ హైరానా పడవద్దు. గ్రామంలో పని ఉండి వచ్చి, పలకరించి పోదామని తొంగి చూశాను’ అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ ‘పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపొయ్యారా? మీరు రావలసిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలయింది’ అని డబ్బు సంచీ తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపుస్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటంచేత జమీందారు ‘ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో. లెక్కలు తరవాత తీరికగా చూసుకోవచ్చు’ అని డబ్బు సంచీ తీసుకోకుండా తిరిగి వెళ్లిపోయాడు.

తరవాత ఆయన శేషగిరిని పిలిపించి ‘నువు చెప్పినది ఒకటీ రుజువుకాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది. అతని భార్య మెడలో పుస్తెలకు పసుపుతాడు తప్పలేదు. అతని మీద ఇలాటి అభాండాలు నాతో ఎందుకు చెప్పావో తెలీదు. నువ్విక వెళ్లవచ్చు’ అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు. కానీ గిరిధరుడికి అలాటి పరిస్థితి ఎందుకు ఏర్పడినదీ శేషగిరి ఊహకు అందలేదు. ‘అతణ్ణి దేవుడే కాపాడుతూ ఉండాలి. లేకపోతే అతనిలాటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను’ అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. 

బేతాళుడు ఈ కథ చెప్పి ‘రాజా.. దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? అలాంటివాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసీ చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది’అన్నాడు. 
దానికి విక్రమార్కుడు ‘ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదనటంలో సందేహం లేదు. అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాటివారి అవినీతికి శిక్ష.. సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందార్ల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పుకాదు.

అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదనీ, అతనికి కానుకలు ఇచ్చినవారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారనీ స్పష్టంగా తెలుస్తోంది. స్వతహాగా అతను చాలా మంచివాడు. ఇతరులకు సహాయపడేవాడు. అంతేగానీ ఇతరులను పీడించేవాడు కాడు. డబ్బుల్లేని బావమరిదికి పొలం కొనుక్కునేందుకు తన భార్య ఒంటి మీది నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువిచ్చాడు.

స్వతహాగా అతను స్వార్థపరుడూ, శిక్షార్హుడూ కాడు. పోతే జమీందారు కూడా అవివేకి ఎంతమాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారెయ్యక రెండు పరీక్షలకు అతణ్ణి గురిచేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతణ్ణి శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు. అదేమిటంటే గిరిధరుడు ఎవరికిగానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నమాట. అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి’ అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
(బేతాళ కథలు.. చందమామ, 1980, జనవరి సంచిక నుంచి)
సేకరణ: అనిల్‌ బత్తుల 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top