మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్‌

Researchers Found That Corona Can be Controlled by Mouthwash - Sakshi

శరీరంలోకి వైరస్‌ ఎక్కువ వెళ్లకుండా అడ్డుకుంటుంది

పరిశోధన సక్సెస్‌.. జర్మన్‌ పరిశోధకుల అధ్యయనం 

సాక్షి, హైదరాబాద్‌: మౌత్‌వాష్‌లు కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తాయట. ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఔననే అంటున్నారు కొందరు పరిశోధకులు. కరోనాను తగ్గించే మందుతోపాటు అసలు వైరస్‌ సోకకుండా నిరోధించే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో కొందరు పరిశోధకులు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. జర్మనీకి చెందిన రూర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు మౌత్‌వాష్‌లపై పరిశోధనలు జరిపారు. కోవిడ్‌ వైరస్‌పై అవి ఎలా పనిచేస్తాయో కల్చర్‌ టెస్ట్‌ ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత ఆ వైరస్‌ మానవ కణాలపై ఎలా ప్రభావం చూపుతుందో కూడా పరిశోధించారు. 

వైరస్‌ను విస్తరించకుండా నిరోధిస్తాయి..
229ఇ అనే మానవ కరోనా వైరస్‌పై మౌత్‌వాష్‌ను ప్రయోగించారు. 30 సెకన్ల పాటు ద్రావణాలతో కలిపి ఉంచాక, ఆ వైరస్‌ క్రియారహితం అయిందని గుర్తించారు. కోవిడ్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే ముందు కొన్ని గంటలపాటు గొంతు పైభాగంలోని సైనస్‌ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. నిత్యం మౌత్‌వాష్‌తో గార్గ్‌లింగ్‌ చేస్తే గొంతు వద్దే వైరస్‌ను నియంత్రించొచ్చని, పూర్తిగా నిరోధించలేక పోయినా.. దాన్ని బాగా తగ్గించొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, ఇది వైరస్‌ నిరోధానికి సరైన పద్ధతిగా మాత్రం భావించొద్దని పేర్కొంటుండటం విశేషం. ఇది కేవలం ల్యాబ్‌లో చేసిన ప్రయోగమే తప్ప మనుషులపై చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌ కాదని వారు చెబుతున్నారు. ‘మౌత్‌వాష్‌లో ఉండే క్లోర్‌ఎక్స్‌డిన్‌ రసాయనానికి వైరస్‌ను క్రియారహితం చేసే శక్తి ఉంటుంది. వైరస్‌ నిరోధానికి తీసుకునే చర్యల్లో ఇది కూడా ఓ అంశమని గుర్తించాలి తప్ప.. దీన్ని వైద్యంగా భావించొద్దు’ అని నగరానికి చెందిన మైక్రోబయోలజిస్టు దుర్గా సునీల్‌ పేర్కొన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top