Haleem Recipe In Telugu: రంజాన్‌ స్పెషల్‌.. ఎవరైనా సింపుల్‌గా చేసుకోగలిగే మటన్ హలీమ్

Ramzan special:Hyderabadi Mutton Haleem Recipe In Telugu - Sakshi

రంజాన్‌ మాసంలో రోజా ఉన్నవారంతా ఉపవాస దీక్ష ముగించాక, బలవర్థక ఆహారం తీసుకుంటారు. ఇలా తీసుకునే ఆహారంలో హలీమ్‌ ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను రోజా ఉన్నవారే గాక, ఇతరులు కూడా ఇష్టంగా తింటారు. మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే హలీమ్‌ను ఇంట్లో ఎలా వండుకోవచ్చో చూద్దాం. 

కావలసినవి: మటన్‌ ఖీమా – ముప్పావు కేజీ, పచ్చిమిర్చి – ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూను, పసుపు – అర టేబుల్‌ స్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, లవంగాలు – నాలుగు, యాలకులు – మూడు, సోంపు – టేబుల్‌ స్పూను,

► మిరియాలు – టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, గోధుమ రవ్వ – అరకప్పు, మినప్పప్పు – టేబుల్‌ స్పూను, కందిపప్పు – టేబుల్‌ స్పూను, పచ్చిశనగ పప్పు – టేబుల్‌ స్పూను, పెసరపప్పు – టేబుల్‌ స్పూను, బియ్యం – టేబుల్‌స్పూను. ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు,

►ఉల్లిపాయలు – నాలుగు( సన్నగా తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు – పావుకప్పు, పుదీనా తరుగు – పావు కప్పు,  పచ్చిమిర్చి చీలికలు – రెండు, మిరియాలపొడి – అర టేబుల్‌ స్పూను, పసుపు – పావు టీస్పూను, పెరుగు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – ఆరు టేబుల్‌ స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌  గార్నిష్‌కు సరిపడా.  

తయారీ: ∙కుకర్‌ గిన్నెలో మటన్‌ ఖీమాను శుభ్రంగా కడిగి వేయాలి.

►దీనిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి కలిపి, సన్నని మంటమీద ఐదారు విజిల్స్‌ రానివ్వాలి.

►మరో కుకర్‌ గిన్నెతీసుకుని గోధుమ రవ్వ, పప్పులు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లుపోసి నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.

►ఉడికిన మటన్‌ ఖీమాను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన పప్పులను కూడా మెత్తగా రుబ్బుకోవాలి

►సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించాలి

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి వేయాలి.

►ఇవన్నీ వేగాక మిరియాలపొడి, పసుపు, పెరుగు ఖీమా పేస్టు, పప్పుల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించి, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top