రామ చరిత మానసం | Ramcharitmanas teaches us duty and the ideal conduct of human life | Sakshi
Sakshi News home page

రామ చరిత మానసం

Apr 20 2026 4:33 AM | Updated on Apr 20 2026 4:33 AM

Ramcharitmanas teaches us duty and the ideal conduct of human life

కథానీతి

బంగారు వ్యాపారం చేసే ఒక యువకుడు తన భార్యా బిడ్డలతో కలిసి  అయోధ్య వెళ్ళదలిచాడు. మూడు నెలల ముందే రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణించే రోజు రానే వచ్చింది. భార్యా పిల్లలతో పాటు లగేజీ తీసుకుని రైల్వే స్టేషన్‌ చేరాడు. వారు ఎక్కాల్సిన రైలు వచ్చి ప్లాట్‌ మీద ఆగింది. వెంటనే పిల్లల్ని ఎక్కించి తను ఎక్కాడు.

భార్య ప్లాట్‌ ఫాం మీద నిలబడి ఒక్కొక్క లగేజీ అందిస్తోంది. అతడు  అందుకుంటున్నాడు. ఇంతలో రైలు కదిలింది. భార్య ప్లాట్‌ ఫాం మీదనే ఉంది. అమ్మకోసం పిల్లలు ఏడవటం ప్రారంభించారు. అతడిలో గాబరా మొదలయ్యింది. రైలు మరింత  వేగం పుంజుకుంది. ఏం చేయాలో తెలియలేదు అతడికి. చైనులాగి  రైలు ఆపమని తోటి ప్రయాణీకులు కొందరు సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు.

రైలు ఆగింది. భార్య పరుగులు తీస్తూ వచ్చి రైలు పెట్టెలోకి వచ్చి చేరింది. వారి పక్క సీటులోనే ఒక వృద్ధ జంట కూర్చుని ఉంది. వృద్ధుడు సుందరకాండ  చదువుతూ ఉన్నాడు. వృద్ధురాలు– ‘మన పక్క సీటు ఆమె, రైలు ఎక్క లేకపోవడం, ఆమె భర్త  చైను లాగడం లాంటి హడావుడి జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైల్వే సిబ్బంది కూడా వచ్చి వెళ్ళారు’ అని నిష్టూర పోయింది. ఆ వృద్ధుడు చిన్న  నవ్వు నవ్వి ‘అంతా గమనించాను. 

ఈ యువకుడు భక్తి భావంతో అయోధ్యకు బయలుదేరాడు కానీ, రామ చరిత మానసం చదివినట్లు లేడు’ అన్నాడు. పక్కనే  ఉన్న ఆ యువకుడు ‘అలా అంటున్నారేమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. యువకుడి కళ్ళలోకి చూస్తూ ఆ వృద్ధుడు ‘అరణ్య వాసం వెళ్ళేటప్పుడు గంగానది దాటే  సమయంలో పడవలోకి మొదటగా సీతను, తర్వాత లక్ష్మణుడినీ ఎక్కించి ఆ తర్వాత రాముడు ఎక్కుతాడు.

 మనం రామాయణం చదివితే ఇలాంటి మంచి మంచి  సూక్ష్మ విషయాలెన్నో తెలుసుకోవచ్చు. వాటిని మన నిత్యజీవితంలోకి అన్వయించుకుని సుఖమైన జీవితాన్ని 
అనుభవించవచ్చు’ అన్నాడు. ‘నిజమే... ఎప్పుడూ రైలు ప్రయాణాల్లో ఆడవారిని మొదటగా ఎక్కించి మగవారు ఆ తర్వాత ఎక్కాలి. చీరలు కట్టుకునే స్త్రీలు రైలు వెనుక పరుగులు తీసి వాహనాన్ని అందుకోలేరు కదా’ అని వృద్ధురాలు హితవు మాటలు చెప్పింది.

అప్పుడు గుర్తుకొచ్చింది ఆ యువకుడికి– చాలా నెలల క్రితం గోస్వామి తులసీదాస్‌ రచించిన రామ చరిత మానసం తెలుగు అనువాదం ఇంట్లో తెచ్చి పెట్టుకున్న విషయం. ప్రయాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చదివి తీరాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. అందరూ రామ నామ స్మరణలు చేస్తూ అయోధ్య ప్రయాణం కొనసాగించారు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Advertisement
 
Advertisement
Advertisement