పుడమి 'సాక్షి'గా ప్రతిజ్ఞ పూనుదాం..

Pudami Sakshiga Special Programme For Environment

భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. 
ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్‌ కదులుతోంది. 

తన వంతు బాధ్యతగా ఓ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 
ప్రకృతి అనంతమైనది. అత్యద్భుతమైనది. 
ప్రకృతి వనరులే ఏ జీవికైనా ప్రాణప్రదాలు.
భూగోళం అంటే మట్టి మాత్రమే కాదు. 
శతకోటి జీవరాశులకు.. జీవవైవిధ్యానికి పుట్టిల్లు. 
మనుషులకు మాత్రమే కాదు.. మొక్కలు, జంతువులు, చేపలు, పక్షులు, వానపాములు, పురుగులు, సూక్ష్మజీవులు.. ఇంకా ఎన్నెన్నో జీవజాతులకు ఇదే ఆవాసం. మానవ జాతి సంతతి పెరుగుతున్న కొద్దీ.. ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ప్రకృతి వనరుల వినియోగం విచక్షణారహితంగా పెరిగిపోతోంది. ఈ లోటును ఏ యేటి కాఏడు తిరిగి పూడ్చుకునే శక్తిని సైతం భూగోళం కోల్పోయింది. 1970 నుంచి గాడి తప్పింది. ప్రకృతి వనరులపై మనుషుల వత్తిడి 1970–2014 మధ్యకాలంలో రెట్టింపైంది. ఎండలు, తుపానులు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాల సంఖ్య, తీవ్రత ఏటేటా పెరిగిపోతున్నాయి.  

జీవవైవిధ్యం గతమెన్నడూ లేనంత వేగంగా నశిస్తోంది. పక్షులు, చేపలు, ఉభయచరాలు తదితర జీవుల సంతతి ఇప్పటికే 68%కి పైగా ఈ కాలంలో నశించిందని ఒక అంచనా. ఇప్పటి మాదిరిగా ప్రకృతి వనరుల వాడకం తాకిడిని తట్టుకోవటానికి ఒక్క భూగోళం చాలదు, 1.6 భూగోళాలు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మూలుగను పీల్చేయటం ఇదే రీతిలో కొనసాగితే 2050 నాటికి మనకు మూడు భూగోళాలు అవసరం అవుతాయి. కానీ, ఉన్నది ఒక్కటే! అందుకే, పెను ప్రమాదంలో పడిన పుడమిని రక్షించుకోవాలి. భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్‌ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ‘పుడమి సాక్షిగా..’ పేరిట చిరు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 

ముచ్చటా మూడు లక్ష్యాలు.. 
1. భూతాపం పెరగటం వల్ల కలుగుతున్న దుష్ఫలితాల గురించి తెలియజేయటం.  
2. పర్యావరణ  సంబంధమైన ముప్పు నుంచి బయటపడటానికి ఎవరి వారు చేయదగిన పనులను సూచించడం, సాధించగల లక్ష్యాలతో పనిచేయడానికి ప్రజలను ప్రేరేపించటం.
3. చేపట్టిన పనుల్లో పురోగతిని గురించి అందరం నిరంతరం అనుభవాలను పంచుకుంటూ, పరస్పరం ప్రోత్సహించుకునేందుకు దోహదపడటం. 
ఈ కృషిలో భాగమే మీ చేతుల్లో ఉన్న ప్రత్యేక ‘ఫన్‌డే’ సంచిక. పుడమిని ప్రభావితం చేసే వివిధ ఆలోచనలను, ప్రకృతికి అనుకూలమైన కొన్ని పనుల గురించి ఇందులో చర్చిస్తున్నాం. 
‘సాక్షి’ టీవీలో ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్‌ కార్యక్రమం ఈ నెల 26న రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ప్రసారం అవుతుంది. భూగోళం క్షేమం కోసం పాటుపడే ఎందరో ఎర్త్‌ లీడర్స్, నిపుణులు, ప్రముఖులు, ప్రకృతి ప్రేమికులు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకుంటారు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా దీక్షతో కొనసాగించాలని ‘సాక్షి’ కంకణం కట్టుకుంది. www.pudamisakshiga.com వెబ్‌సైట్‌ ప్రారంభమైంది.. మీరూ పాలుపంచుకోండి..  రండి.. ‘పుడమి సాక్షిగా..’ ప్రణామం చేద్దాం.. మన  కోసం మారుదాం.. కలసి కట్టుగా కదులుదాం..

భూతాపం పెచ్చుమీరటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించుకోవటానికి ఉన్నంతలో పూనికతో పనిచేయాలని ప్రపంచ దేశాలు ప్రతిన బూని ‘పారిస్‌ ఒడంబడిక’ చేసుకొని ఐదేళ్లు గడచిపోయాయి. ఆ లక్ష్యాలు కూడా అరకొరే. అవి కూడా అమలవుతున్నది అంతంత మాత్రమే. తత్ఫలితంగా 2019 వరకు గడచిన ఐదేళ్లూ ఏటేటా భూతాపం అత్యధిక స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కరోనా వచ్చి మనల్ని నెలలకొద్దీ ఇళ్లకే పరిమితం చేసింది కాబట్టి, 2020లో భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు అంతకుముందు ఏడాది కన్నా 7% తగ్గాయి. అయితే, ఇది తాత్కాలికమే. ఈ గండం గడిస్తే, భూతాపోన్నతి కథ మళ్లీ మామూలేనా? వ్యక్తులు, ప్రభుత్వాల ప్రవర్తనలో ఏమైనా గుణాత్మకమైన మార్పు వచ్చే వీలుందా?? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ.

పారిస్‌ ఒడంబడికకు మించి..
పారిశ్రామిక విప్లవ యుగానికి ముందు అంటే.. 1880ల నుంచి ఇప్పటికి 1.2 డిగ్రీల సెల్షియస్‌ మేరకు భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగింది. పారిస్‌ ఒడంబడికలో కుదిరిన అంగీకారం మేరకు ప్రపంచ దేశాలు ప్రకృతి వనరుల వాడకం తగ్గించుకుంటే ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు మించదని భావించారు. అయితే, వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను బట్టి చూస్తే 2100 నాటికి 2.6 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరుగవచ్చంటున్నారు. అయితే, ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాల్లో విప్లవాత్మక మార్పు తేకుండా ఇలాగే కొనసాగితే వచ్చే 80 ఏళ్లలో భూతలంపై ఉష్ణోగ్రత 3.2% (2.9–3.9%) వరకు పెరిగే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఎవరి పాపం ఎంతెంత? 
2020లో వెలువడిన ఉద్గారాలు కొంచెం తక్కువైనా.. ఇప్పటికే వాతావరణంలో పోగు పడి ఉన్న హరిత గృహ వాయువులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్లనే, గడచిన ఏడాది కూడా అడవులు తగలబడటం, కరువులు, తుపానులు, మంచుకొండలు కరిగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగిందే గానీ తగ్గలేదు. అడవుల నరికివేత వంటి భూమి వినియోగ పద్ధతి మార్చటం వల్ల వెలువడిన ఉద్గారాలను ఇందులో కలపనే లేదు.  ఎంత ‘అభివృద్ధి’ చెందిన వారమైతే ప్రకృతికి అంత ఎక్కువగా చేటు చేస్తున్నాం. ప్రపంచ జనాభాలో 50% ఉన్న పేదల మూలంగా వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల కన్నా.. జనాభాలో 1% ఉన్న అతి సంపన్నులు చేస్తున్న ప్రకృతి వ్యతిరేక పనుల వల్ల వెలువడే ఉద్గారాలే ఎక్కువ అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (యుఎన్‌ఇపి) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్‌ గ్యాప్‌ నివేదిక చెబుతోంది.  

2019 ఉద్గారాలు 59 బిలియన్‌ టన్నులు
యుఎన్‌ఈపి ఎమిషన్స్‌ గ్యాప్‌ నివేదిక 2020 ప్రకారం..  2019లో భూగోళం ఉపరితల వాతావరణంలోకి చేరిన (బొగ్గు పులుసు వాయువుతో సమానమైన) కర్బన ఉద్గారాలు 59.1 గిగా టన్నులు. 59.1 గిగా టన్నులంటే 59.1 బిలియన్‌ టన్నులు (ఇంకా విడమర్చి చెప్పాలంటే.. 5,910 కోట్ల టన్నులు). 2019లో ప్రపంచ ఉద్గారాలలో మన దేశం వాటా 7%. గత పదేళ్లలో విడుదలైన ఉద్గారాలలో 55% మన దేశంతోపాటు చైనా, అమెరికా, యూరోపియన్‌ యూనియన్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ దేశాలే కారణమని యుఎన్‌ఇపి నివేదిక తెలిపింది.

2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్‌ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. కరోనా నేర్పిన గుణపాఠంతోనైనా ఇది సాధ్యమవుతుందా? ప్రకృతికి హాని కలిగించే నాలుగు పనుల్లో కనీసం ఒక్కదాన్నయినా మానుకోగలుగుతామా అని పర్యావరణ శాస్త్రవేత్తలు మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2050 నాటికి ఉద్గారాలను భూగోళానికి, మన జీవనానికి ప్రమాదం లేని స్థాయికి తగ్గించుకోవటానికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని 51% ఉద్గారాలను వదులుతున్న 127 దేశాలు చెబుతున్నాయి. అయితే, ఈ మాటలు ఆయా దేశాల పారిశ్రామిక, ఇంధన, వ్యవసాయ తదితర తక్షణం అమల్లోకి తేగల విధానాల్లోకి ఎంతవరకు ప్రతిఫలిస్తాయో చూడాలి.

ఏం చెయ్యగలం? 
ఆశ ఇప్పటికీ బతికే ఉంది. భారత్‌ సహా కాలుష్య కారక దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో పెనుమార్పులు చేసుకొని ఇప్పటికైనా ఏటా 7.2% మేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలి. 2030 నాటికల్లా వార్షిక ఉద్గారాలు 25% తగ్గించుకోవాలి. తద్వారా వచ్చే పదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతను 3.2 డిగ్రీల నుంచి 2 డిగ్రీలకు పరిమితం చేసుకోగలిగే అవకాశాలు 66% మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జరగాలంటే.. ప్రపంచ దేశాలు విద్యుత్తు వాడకంలో నైపుణ్యం పెంచుకోవాలి. సౌర, పవన విద్యుత్తుల వినియోగం వైపు మళ్లాలి. పరిశ్రమలు పునరుత్పాదక ఇంధనాల వాడకం దిశగా కదలాలి. మీథేన్‌ విడుదల తగ్గించాలి. వాహన కాలుష్యం తగ్గించడానికి రవాణా రంగంలో విద్యుత్తు, సౌర విద్యుత్తుతో నడిచే వాహనాల సంఖ్య పెంచాలి. వ్యవసాయ, నిల్వ పద్ధతులు ప్రకృతికి అనుగుణంగా మారాలి. ఆహార వృథాను తగ్గించాలి. మాంసాహారం తగ్గించి శాకాహారంపై ఎక్కువ ఆధారపడటం నేర్చుకోవాలి. అడవుల నరికివేత ఆపి, అడవుల విస్తీర్ణం పెంచాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించుకొని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి. ప్రతి టెర్రస్‌పైనా సేంద్రియ ఇంటిపంటల సాగు విస్తరించాలి.. ఇలా చేస్తే నగరాల్లో గాలి నాణ్యత, నీటి లభ్యత పెరుగుతాయి. జీవవైవిధ్యం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతాయి.  

ఏతావాతా చెప్పేదేమంటే.. ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగా ప్రతి ఒక్కరి ఆలోచన, జీవనశైలి ప్రకృతికి అనుకూలంగా మారాలి. మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవికమైన ఉద్గారాల తగ్గింపు చర్యలను తక్షణం అమల్లోకి తేగలగాలి. అప్పుడే మనతోపాటు భూగోళంపై సమస జీవుల మనుగడ మరీ అధ్వాన్నమైపోకుండా మిగులుతుంది. ఇందుకోసం ‘పుడమి సాక్షిగా’ ప్రతిన బూని, పూనికతో కదులుదాం.  
- పంతంగి రాంబాబు

భూతాపోన్నతి అంటే? 
మనం చేసే పనుల వల్ల పంచభూతాలు కలుషితం అయిపోతున్నాయి. బొగ్గు, పెట్రోలు, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాలను మండించటం వల్ల కలుషిత వాయువులు (కర్బన ఉద్గారాలు) వాతావరణంలో విడుదలై భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలోకి చేరిన ఉద్గారాలకు ప్రతి ఏటా మరికొన్ని ఉద్గారాలు తోడవుతున్నాయి. వాటి పరిమాణం అంతకుముందు ఏడాది కన్నా ఎక్కువగానే ఉంటున్నది. వాతావరణంలోకి చేరిన ఈ హరిత గృహ వాయువులు భూతాపానికి కారణమవుతున్నాయి. భూమి పై నుంచి వేడిని అనంత విశ్వంలోకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటూ ఉన్నాయి. అందువల్ల భూగోళం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఉష్ణోగ్రత అసహజంగా పెరిగిపోతోంది. దీన్నే భూతాపోన్నతి (క్లైమెట్‌ ఛేంజ్‌) అంటున్నాం. మనుషులందరూ భూతాపం పెరుగుదల నిదానించేలా చేయగలిగితేనే భవిష్యత్తులో మనతోపాటు సకల జీవరాశి మనుగడా బాగుంటుంది. ప్రకృతికి హాని కలిగిస్తున్న పనులేవో గుర్తించి, వాటిని తగ్గించుకోవటం ఒక్కటే మార్గం. 

కాలుష్య ప్రతాపం కనీసం 300 ఏళ్లు 
మనిషి సగటు జీవిత కాలం మహా అయితే వందేళ్లు. కానీ, మనిషి వల్ల భూమ్మీద ఏర్పడుతున్న కలుషిత వాయువుల జీవిత కాలం అంతకు 3 నుంచి 10 రెట్లు ఎక్కువ. ఏ ఏడాది భూతల వాతావరణంలోకి చేరే కర్బన ఉద్గారాలు ఆ యేడాదే అంతమైపోవు. కనీసం 300 నుంచి 1,000 ఏళ్ల పాటు వాతావరణంలోనే తిష్ట వేసి భవిష్యత్తు తరాలకు చుక్కలు చూపిస్తాయి. పారిశ్రామిక యుగం (క్రీ.శ.1750) ప్రారంభమైనప్పటి నుంచి కర్బన ఉద్గారాల విడుదల మొదలైంది. తొలి పారిశ్రామిక దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌. కాలుష్య కారక తొలి దేశం కూడా ఇదే. క్రీ.శ. 1751లో మొదటి ఏడాది వాతావరణంలోకి యు.కె. వెలువరించిన కర్బన ఉద్గారాలు దాదాపు కోటి టన్నులు. ప్రపంచ దేశాలన్నిటి ఇప్పటి ఉద్గారాల కన్నా 3,600 రెట్లు తక్కువ. అప్పటి నుంచీ పారిశ్రామికీకరణ అన్ని దేశాలకూ విస్తరించింది. జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలూ పెరుగుతున్నాయి.. ఏటేటా అంతకు ముందెన్నడూ లేనంతగా కర్బన ఉద్గారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

పాతిక శాతం కాలుష్య పాపం అమెరికాదే!
యు.కె.తో ఉద్గారాల జాతర మొదలైనా ఆ తర్వాత కాలంలో పారిశ్రామికీకరణలో అమెరికా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అతి ఎక్కువగా కాలుష్య కారక వాయువులను విడుదల చేస్తూ వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ క్రీ.శ. 1751 నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకూ విడుదల చేసిన (క్యుములేటివ్‌ ఎమిషన్స్‌) ఉద్గారాల్లో 25% బాధ్యత అమెరికాదే. ఈ 269 ఏళ్లలో అమెరికా అత్యధికంగా దాదాపు 400 బిలియన్‌ టన్నుల ఉద్గారాలను వాతావరణంలోకి వదిలింది. అమెరికా ఉద్గారాల్లో సగం మేరకు వదిలిన చైనా రెండో స్థానంలో ఉంది. 22%తో 28 ఐరోపా దేశాల కూటమి మూడో స్థానంలో ఉంది. 

కాలుష్య పాపం చారిత్రకంగా చాలా తక్కువే అయినప్పటికీ, ఇవ్వాళ ఎక్కువగా ఉద్గారాలు వదులుతున్న దేశాల జాబితాలోకి భారత్, బ్రెజిల్‌ కూడా చేరుకున్నాయి. చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌లోని 28 దేశాల తర్వాత మన దేశమే అత్యధికంగా ఉద్గారాలను వెలువరిస్తోంది. గత దశాబ్ద కాలంలో వెలువడిన ఉద్గారాల్లో 55% ఈ 31 దేశాల నుంచి వెలువడినవే. అప్పుడు, ఇప్పుడూ కూడా అతి తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న ఖండమేదైనా ఉందీ అంటే అది ఆఫ్రికా మాత్రమే.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top