
ప్రపంచయూత్ ఛాంపియన్‌షిప్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణిగా సత్తా చాటింది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత....
చికిత హైస్కూల్‌లో చదువుతున్న రోజుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఆమె స్ఫూర్తితో కూతురిని క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తండ్రి శ్రీనివాసరావు చికితకు మొదట కరాటే నేర్పించాడు. అందులో బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఒకసారి కరీంనగర్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు జరుగుతుండగా చూసిన చికితకు ఆసక్తి కలిగింది.
‘ఆర్చరీ నేర్చుకుంటాను’ అని తండ్రికి చెప్పింది. తమ పొలంలోని గడ్డివాములనే లక్ష్యంగా ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టింది. సీనియర్ ప్లేయర్ శ్రీనివాస్ దగ్గర ఆర్చరీలో మెలకువలు నేర్చుకుంది. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో, 2022లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పతకం సాధించి నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా (న్ ఏఏఐ) దృష్టిలో పడింది.
ఆర్చరీ అకాడమీలో చోటు లభించడంతో వరుస విజయాలు నమోదు చేస్తూ ΄ోయింది. ఈ ఏడాదిలో చైనాలోని షాంఘైలో జరిగిన టోర్నిలో టీమ్ విభాగంలో రజత పతకం, ఆసియా గ్రాండ్‌ప్రి టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. తాజాగా కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంఫియన్‌షిప్ కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సత్తా చాటింది.
– శ్రీనివాస్ గుడ్ల, సాక్షి. పెద్దపల్లి
(చదవండి: Saurabh Pandey: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ)