'పర్సు'నాలిటీ డెవలప్‌మెంట్‌ | Parenting Tips: How To Teach Your Child The Value Of Money | Sakshi
Sakshi News home page

మనీ మేనేజ్‌మెంట్‌: 'పర్సు'నాలిటీ డెవలప్‌మెంట్‌

Apr 15 2026 5:29 PM | Updated on Apr 15 2026 6:07 PM

Parenting Tips: How To Teach Your Child The Value Of Money

పిల్లలకు అక్షర జ్ఞానాన్నే కాదు. ఈ రోజుల్లో ఆర్థిక అక్షరాస్యతను అందించడమూ అవసరమే! చాలా మంది డబ్బు సంపాదించడంపైన దృష్టి పెడతారు.  కొందరు మాత్రం ఆ డబ్బును సరిగ్గా వినియోగించి, ఆర్థిక సమస్యలు లేకుండా కూల్‌గా ఉంటారు. ‘డబ్బు ప్రాముఖ్యత, ఖర్చుల నిర్వహణ, పొదుపు.. అలవాట్లు పెంపొందితే పెద్దయ్యాక ఆర్థిక భారాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది’ అంటున్నారు నిపుణులు. వేసవి సెలవుల్లో పిల్లలకు తీరికగా, అర్థమయ్యేలా చెప్పే  మనీమేనేజ్‌మెంట్‌ గురించి మరింత వివరంగా!

పిల్లలకు పెద్దలు ఇచ్చే కానుకలలో జీవితకాలం గుర్తుండి΄ోయేది డబ్బును ఎలా నిర్వహించాలో తెలిసే జ్ఞానం కూడా. ఆ ఆలోచన అమలు భవిష్యత్తులో పిల్లలు ఆర్థిక విషయాల్లో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది.  

అవసరాలకు.. కోరికల మధ్య తేడా! 
పిల్లలకు స్టేషనరీ అవసరం ఉండి షాపింగ్‌కు తీసుకెళుతుంటారు పెద్దవాళ్లు. అక్కడ పిల్లలను ఆకట్టుకునే చాక్లెట్లు, బొమ్మలు ముందుంటాయి. ఇలాంటప్పుడు పిల్లల మనసు బొమ్మలు, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. ముందుగా అవే ఎంచుకుంటారు. అవసరమైనవి కొనడానికి వాయిదా వేయడం లేదా పెద్దలను మరికొంత డబ్బు ఇవ్వమని అడగడం సహజంగా జరుగుతుంటుంది. ‘ఏది అవసరం, ఏది కోరుకోవడం..’ అనే ఎంపిక ముందు ఇంటి వద్దే ఇవ్వడం మొదలుపెట్టాలి.

తప్పిదాల నుంచి పాఠాలు
ఈ రోజుల్లో చాలావరకు తల్లీతండ్రీ ఇద్దరూ సంపాదనపరులై ఉంటున్నారు. కోరింది ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో ఖర్చు శాతమూ పెరిగింది. తాము చేస్తున్న ఆర్థిక తప్పిదాలు ముందు పెద్దలు అర్థం చేసుకోవాలి. విద్య, వైద్యం, కుటుంబంలో వచ్చే అత్యవసర ఖర్చుల గురించి పిల్లలతో చర్చించడం వల్ల వారిలో ‘ఖర్చు’ పట్ల అవగాహన పెరుగుతుంది.

సొంత డబ్బు...
స్కూల్‌ లేదా ఏదైనా ΄ోటీల్లో పాల్గొనప్పుడు సంపాదించుకున్న ప్రైజ్‌ మనీని, అమ్మమ్మ, తాతయ్య, బంధువులు.. ఇచ్చిన మొత్తాన్ని, కిడ్డీ బ్యాంక్‌లో డబ్బు దాచుకోవడానికి ప్రోత్సహించాలి. పొదుపు మొత్తాలకు వడ్డీ రూపేణా వచ్చే వీలున్న పోస్టాఫీసు, బ్యాంకులు పిల్లల కోసం ఇస్తున్న అవకాశాల గురించీ తెలియజేయాలి. వారు ఆదా చేసిన డబ్బు మొత్తాల నుంచి కొనుగోళ్లు కూడా చేయించాలి. దీనివల్ల ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాలపట్ల అవగాహన పెంచుకుంటారు.  

పంచుకోవడమూ అవసరమే! 
ఖర్చు, పొదుపు, డొనేషన్‌ .. ఇలా మూడు బాక్స్‌లను చేయించి, వాటిని నిర్వహించమని చెప్పాలి. ఏ బాక్స్‌లోని డబ్బు ఎలా ఖర్చు అవుతోందో గమనించమనాలి. డబ్బు కేవలం మనకోసం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేయాలి.  

ఆటగా... అభ్యాసం...
పిల్లలకు రకరకాల నోట్లు, నాణేలు, కార్డులను చూపించాలి. వాటిని వరుసక్రమంలో అమర్చుతూ, వాటి పేర్లు, ఆకారాలు, పరిమాణాలు, రంగులు, విలువ, చిహ్నాల గురించి మాట్లాడాలి. షాపింగ్‌కు తీసుకెళ్లినప్పుడు బిల్లు కౌంటర్‌ వద్ద పిల్లలకే డబ్బు ఇచ్చి, చెల్లింపులు చేయించాలి. 

ఈ రోజుల్లో తప్పనిసరిగా మారిన డిజిటల్‌ పేమెంట్స్‌ నిర్వహణ గురించి తెలియజేయాలి.కార్డు ద్వారా బిల్‌ చెల్లించాల్సి వస్తే, కౌంటర్‌ వద్ద కార్డును ట్యాప్‌ చేయించడం, తిరిగి తీసుకోవడం గురించి చెప్పాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ వాలెట్‌ బ్యాలెన్స్‌ను పిల్లలకు చూపించి,  కొనుగోలు పూర్తయ్యాక, బ్యాలెన్స్‌ ఎలా మారుతుందో చెప్పవచ్చు.

కొనుగోలు రసీదులను చూపించి, వస్తువులు, వాటి విలువ, మొత్తం లెక్కించమని చెప్పవచ్చు. ఎఐ అప్లికేషన్‌ను ఉపయోగించి ఫ్యామిలీ, ట్రావెల్‌ బడ్జెట్‌ను రూపొందించమని సూచించవచ్చు. పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్‌ నేర్పడం అనేది ఒక్కరోజులో పూర్తి కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. తల్లిదండ్రులు ఎగ్జాంపుల్‌గా ఉండి, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే, వారు భవిష్యత్తులో ఆర్థికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. 
 

నేరుగా తెలుసుకునేలా చేస్తాను...
మా ఇద్దరి పిల్లలు ఐదు, ఏడు తరగతుల్లో ఉన్నారు. ఇద్దరూ పోటీల్లో పాల్గొన్నప్పుడు వచ్చిన క్యాష్‌ ప్రైజ్‌ మనీని ఎలా పొదుపు చేసుకోవాలో చెబుతుంటాం. విడిగా బ్యాంక్‌ అకౌంట్‌ తీశాం. కిడ్డీ బ్యాంక్‌ నిండిపోయినప్పుడు ఆ అకౌంట్‌లో వేస్తుంటారు. 

వారికి అవసరమైనవి, కావాలనుకున్నవి ఆ మొత్తం నుంచి కొనుగోలు చేయమని కూడా చెబుతుంటాం. తమ దగ్గర పొదుపు మొత్తం పెరుగుతున్నప్పడు వాటిని ఎందులో పెట్టుబడిగా పెడితే బాగుంటుంది అనే విషయాల గురించి అడుగుతుంటారు.  హెల్త్‌ ఇన్సూరెన్స్, ప్రీమియమ్‌ గురించి కూడా చెబుతుంటాం. బయట కొనుగోలు చేసే వస్తువులు ఇంట్లో సొంతంగా తయారు చేయవచ్చా అనేది ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుందనే విషయాలు వారికి అర్థమవుతుంటాయి. 
– శకుంతల కస్తూరి, గృహిణి, బీహెæచ్‌ఇఎల్, హైదరాబాద్‌ 

నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement
 
Advertisement
Advertisement