ప్లాస్టిక్‌ ఫ్రీ.. ప్రత్యామ్నాయ విధానాల అమలుకు కృషి

Organizations Working To Implement Plastic Free Society - Sakshi

మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగమనేది విడదీయలేని భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడేవి కావడంతో వాటిపై పూర్తిగా ఆధారపడడం బాగా పెరిగిపోయింది. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వివిధ రూపాలు, రకాల్లో ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిపోవడంతో పలుచోట్ల కొత్త చిక్కులు మొదలయ్యాయి. దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12 లక్షల ప్లాస్టిక్‌ బ్యాగులు ఉపయోగిస్తుండగా, కరోనా కాలంలో వీటి వినియోగం మరింతగా పెరిగింది. కోవిడ్‌ వ్యాప్తి భయాలు ప్రజల్లో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్‌ కట్లరీ, కప్స్, కంటైనర్లు, లో–మైక్రాన్‌ కౌంట్‌ క్యారీ బ్యాగ్‌లు, గార్బేజ్‌ బ్యాగ్‌లు, మినరల్‌ వాటర్‌ బాటిళ్లు, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్న వస్తువుల ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటికే యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లు, వస్తువుల వినియోగంపై నిషేధం అమలుతో పాటు దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం లేదా ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్స్‌ నియంత్రణకు కొంచెం నెమ్మదిగానైనా చర్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వస్తువుల నియంత్రణ లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించుకునే దిశలో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే పద్ధతులు, విధానాల వ్యాప్తికి సామాజిక కార్యకర్తలు,సంస్థలు కృషిచేస్తున్నాయి. వారి అనుభవాలు, ప్లాస్టిక్‌ వినియోగం కట్టడికి వారు చేస్తున్న కృషి వివరాలు...

ప్లాస్టిక్‌ నియంత్రణే ఆశయం
మానసిక వికాసం సరిగా లేని ‘స్పెషల్‌ కిడ్స్‌’ కోసం హైదరాబాద్‌లోని మౌలాలిలో ఏర్పాటు చేసిన ‘ఆశయం’ స్కూల్‌ ద్వారా పర్యావరణ హితంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రత్నామ్నాయంగా కొన్ని పర్యావరణహిత వస్తువుల తయారీకి ‘ఆశయం’ సంస్థాపకురాలు లక్ష్మి కృషి చేస్తున్నారు. న్యూస్‌పేపర్, బ్రౌన్‌పేపర్‌ ఉపయోగించి పేపర్‌ బాగ్స్‌ తయారు చేస్తున్నారు. ఆయా సంస్థలు, వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లకు ప్రత్యామ్నాయంగా వివిధ సైజుల్లో బ్యాగులు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నారు. ఇక్కడి పిల్లలతోనే వీటిని తయారు చేయడం, బయటి నుంచి తీసుకొచ్చిన మట్టి దివ్వెలపై కలర్స్, పెయింటింగ్స్‌ వేయించడం, డెకరేట్‌ చేయించడం వంటివి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు బట్టల స్టోర్లు, ఫుట్‌వేర్‌ షాపులు, కూరగాయలు, కిరాణా దుకాణాల వారు వీరి నుంచి పేపర్‌ బ్యాగ్‌లు కొనుగోలు చేస్తూ తమ వంతు చేయూతను ఇస్తున్నారు.

అలవాట్లలో మార్పులతోనే అరికట్టగలం రోజువారీ మన అలవాట్లలో చిన్న చిన్న మార్చులు చేసుకోగలిగితే తప్పకుండా ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. గతం నుంచి మనది పర్యావరణహిత సమాజం. జీవనశైలిని మార్చుకుంటే చాలు గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చు. పాత రోజుల్లోలాగా బయటికి వెళ్లేపుడు చేతిసంచి వెంట తీసుకెళ్లడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. మేము నిర్వహించే చేనేత సంతల్లో పాత న్యూస్‌పేపర్లను రీసైకిల్‌ చేసి తయారు చేసిన పేపర్‌బ్యాగ్‌లనే వాడుతున్నాం. దాదాపు పదేళ్ల నుంచి టూత్‌పేస్ట్‌ మానేసి పళ్లపొడి ఉపయోగిస్తున్నాం. బయటికి వెళ్లేపుడు స్టీల్‌ వాటర్‌బాటిళ్లు తీసుకెళతాం. ప్లాస్టిక్‌ టూత్‌బ్రష్‌ బదులు ‘బాంబూ బ్రష్‌’ వాడుతున్నాము. ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ మానేయడం ఆరోగ్యానికి కూడా మంచిది. పెళ్ళిళ్లు ఫంక్షన్లు, ఒకసారి ఉపయోగించి పడవేసే వస్తువుల వినియోగానికి సంబంధించి అరటిబెరడుతో తయారు చేసిన ఆకుప్లేట్లు, విస్తరాకుల వాడకాన్ని అలవాటు చేయొచ్చు. – సరస్వతి కవుల, సామాజిక కార్యకర్త

పర్యావరణహిత మార్గంలో...
ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన స్వర్గం భరత్‌ కుమార్‌ మంచి ప్యాకేజీతో వచ్చిన ఐటీ, ఇతర ఉద్యోగాలను కాదనుకుని 2018 నుంచి ‘ఎకో మేట్‌’– డెస్టినేషన్‌ ఫర్‌ ఎసెన్షియల్‌ అల్టర్నేటివ్స్‌–డీల్‌– పేరిట ‘ఎకో ఫ్రెండ్లీ గ్రీన్‌ బిజినెస్‌ స్టార్టప్‌’ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందసంస్థలో పనిచేసిన అనుభవంతో ప్లాస్టిక్స్‌ ప్రత్యామ్నాయాలపై విస్తృత అధ్యయనంతో పర్యావరణహిత వస్తువుల తయారీపై ఇష్టం పెంచుకున్నారు. ప్లాస్టిక్‌ రహిత వస్తువులు, ప్రకృతి సహజమైన పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, సుస్థిర జీవనశైలి విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించారు. పేపర్‌తో, చెక్కతో తయారు చేసిన పెన్సిళ్లు, పెన్స్, స్టేషనరీ ఐటెమ్స్, బాంబూ టూత్‌బ్రష్‌లు, గిన్నెలు తోమేందుకు కొబ్బరి పీచు స్క్రబ్బర్లు , బాడీ స్క్రబ్బర్లు, గుళ్లల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసిన అగరువత్తులు, క్లాత్‌ బ్యాగ్‌లు, జూట్‌ బ్యాగ్‌లు, ఆకుప్లేట్లు ఇలా ప్రతిదానికీ ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ఇతరత్రా రూపాల్లో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెరుగుతోందని భరత్‌ చెబుతున్నారు. కార్పొరేట్, ఐటీ సెక్టర్‌ ఉద్యోగుల్లో కొంత అవగాహన ఏర్పడినా, మిగతా వర్గాల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని అంటున్నారు. వారి వారి సర్కిళ్లు, వాట్సాప్‌గ్రూప్‌ల ద్వారా ప్రచారంతో కొంతవరకు మార్పు వస్తోందని చెప్పారు. ఎకోఫ్రెండ్లీ లైఫ్‌స్టయిల్, సస్టయినబుల్‌ లివింగ్‌లో బెంగళూరు, పుణె నగరాలు దేశంలోనే ముందువరసలో ఉన్నాయన్నారు.

ప్రకృతిసహజ వస్తువుల వ్యాప్తికి కృషి రోజువారీ ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాల వినియోగం తగ్గింపు విషయంలో ప్రజల్లో మార్పు చాలా నెమ్మదిగా వస్తోంది. ప్లాస్టిక్‌ రహితం చేయడం లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించడమనేది క్షేత్రస్థాయి నుంచే మొదలు కావాలి. గత రెండేళ్లలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా దీపావళి సందర్భంగా లక్ష దాకా మట్టిదివ్వెలను అమ్మగలిగాను. గణేష్‌చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను తయారు చేశాం. కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విద్యార్థులతో టూర్ల సందర్భంగా మార్పు కోసం ప్రయత్నించాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మేమే స్వయంగా స్వచ్ఛమైన దేశీ ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, భోగిదండలు, పిడకలు, నవధాన్యాలు, సేంద్రియ పసుపు, కుంకుమ, రంగోలీ రంగులు, సేంద్రియ నువ్వులు, బెల్లం లడ్డూలు వంటివి సరసమైన ధరలకే అందుబాటులోకి తెస్తున్నాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ప్లాస్టిక్, రసాయనాలతో కూడిన వస్తువులు ఉపయోగించకూడదని భావించాను. పళ్లు తోముకునే బ్రష్, పేస్ట్‌ స్థానంలో పళ్లపొడితో మొదలుపెట్టి సున్నిపిండి, ఇతర సహజ సేంద్రియ వస్తువులతో తయారుచేసిన సబ్బులు, పూజగదిలో రసాయనాలు లేని కుంకుమ, పసుపు, అగరవత్తులు వినియోగంలోకి తెచ్చాను. ఆర్గానిక్‌ పంటలు సొంతంగా పండించి వాటినే తింటున్నాం. గత ఐదేళ్లుగా గోరక్షకు ‘మురళీధర గోధామం గోశాల’ ఏర్పాటు చేసి ఆవులను కాపాడే ప్రయత్నంతో గో ఆధారిత వస్తువుల వినియోగం వ్యాప్తికి కృషి చేస్తున్నాం.

– డా.సీహేచ్‌ పద్మ వనిత కాలేజీ అసోసియేట్‌ ప్రొఫెసర్,

– కె.రాహుల్‌మురళీధర అనుసంథాన గో విజ్ఞానకేంద్రం 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top