
ఆరోగ్య రక్షణలో గానుగ నూనెల ప్రాధాన్యాన్ని ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ధర ఎక్కువైనప్పటికీ ఆరోగ్యాభిలాషులు గానుగ నూనెల కొనుగోలుకు వెనుకాడటం లేదు. మన దేశంలో గానుగ నూనెల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. దీని వార్షిక వ్యాపారం (సిఎజిఆర్) 2024–2032 మధ్యకాలంలో సుమారు 6% పెరుగుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. ప్రజల్లో ముఖ్యంగా నగర, పట్టణవాసుల్లో గానుగ నూనెల పట్ల మక్కువ పెరగటంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటంతో గానుగ నూనెల వ్యాపారానికి భవిష్యత్తులో విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.
ఎద్దును కట్టి గానుగ తిప్పి నూనె వెలికి తీసే సంస్థలతోపాటు విద్యుత్తుతో కట్టె గానుగలు నడుపుతూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఎవరి ఇంట్లో వాళ్లు పెట్టుకొని నడుపుకోగలిగిన చిన్నవి, ఇంకో చోటికి సులభంగా తీసుకెళ్ల గలిగిన చిన్నపాటి గానుగ యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటి ధర, నాణ్యతలో ప్రామాణికత లోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాన్పూర్ ఐఐటి ఒక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పోర్టబుల్ యంత్రాన్ని తక్కువ ధరలో రూపొందించింది. ఐఐటి కాన్పూర్‌లోని రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ (రుటాగ్)లో ఇంక్యుబేషన్ సేవలు అందుకున్న డి–ఐవి ఎంటర్‌ప్రైజెస్ అనే స్టార్టప్ ఈ యంత్రాలను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి తెచ్చింది.

ఈ యంత్రంలో మూడు భాగాలు ఉంటాయి. ఛాంబర్, ప్లంగర్ రాడ్, స్టెయిన్‌లెస్ సిలెండర్. అడుగున ఒక గిన్నెలో ఛాంబర్‌ను ఉంచి, అందులో నూనె గింజలు పోసి, పైన ఉన్న హేండిల్‌ను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటే ప్లంగర్ రాడ్ కిందికి దిగుతూ గింజల్ని వత్తుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ సిలెండర్‌కు ఉన్న రంథ్రాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. తక్కువ విద్యుత్ ఖర్చుతో అధిక నాణ్యత గల నూనెను ఈ విధంగా వెలికితీయవచ్చని ఐఐటి చెబుతోంది. దీన్ని నడపడానికి విద్యుత్తు అవసరం లేదు. ఒక వ్యక్తి పెద్ద శ్రమ లేకుండానే దీనితో నూనెను వెలికితీయవచ్చు. వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, సోయా తదితర నూనె గింజల నుంచి దీనితో నూనె తీయవచ్చు. సంవత్సరం క్రితం మార్కెట్‌లోకి వచ్చిన ఈ యంత్రం ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్లింది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగలిగే ఈ యంత్రం ధర రూ. 10,980 మాత్రమే. ఇతర యంత్రాలతో పోల్చితే దీని ఖరీదు చాలా తక్కువని ఐఐటి కాన్పూర్ రుటాగ్ అధిపతి డాక్టర్ అమన్‌దీప్ సింగ్ చెప్పారు.
యంత్రం వీడియో లింక్: https://www.youtube.com/watch?v=0ZMNaZMMC5o
యంత్రం తయారీదారు మెయిల్‌ఐడి: divakmse@gmail.com