అమ్మ హెల్త్‌ అందరికీ హెల్త్‌! | Mothers day: Importance of Mothers Health for the Family and Society | Sakshi
Sakshi News home page

అమ్మ హెల్త్‌ అందరికీ హెల్త్‌!

May 10 2026 12:24 PM | Updated on May 10 2026 12:24 PM

Mothers day: Importance of Mothers Health for the Family and Society

అమ్మదనం గురించీ, అమ్మదనపు మంచితనం గురించి కవులూ, రచయితలూ ఎంతో చెప్పారు. అంతకంటే అపురూపంగా అద్భుతంగా చెప్పడమిక దాదాపు అసాధ్యం. కానీ వైద్యపరంగా మాత్రం ఎంతోకొంత చెప్పవచ్చు. అందుకే మాతృ దినోత్సవపు ఈ అమృత సమయాన వివిధ వయసుల్లోని మాతృమూర్తుల కోసం వాళ్ల పిల్లలూ, తల్లిగా మారిన, మారబోతున్న తమ భార్యల కోసం భర్తలూ... కాబోయే మాతృమూర్తుల తల్లిదండ్రులూ... ఇలా ఎవరి పరిధుల్లో వారు నెరవేర్చగలిగే కొన్ని బాధ్యతలూ, సూచనలు, చేయించాల్సిన వైద్యపరీక్షలూ... చికిత్సలూ... ఇవిగో... ఇవి మీకోసం.

ఇక్కడ పేర్కొన్నవి మాత్రమే కాకుండా... మరికొన్ని స్పెషలైజ్‌డ్‌ పరీక్షలూ ఆయా మహిళల అవసరాల కోసం చేయించాల్సి రావచ్చు. కొన్ని ప్రామాణికమైన బేసిక్‌ పరీక్షలు...

సీబీపీ రక్త పరీక్ష : మనదేశపు మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 65 శాతం నుంచి 70 శాతం మహిళల్లో అనీమియా సమస్య ఉంటుందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  ఓ ఆడపిల్ల యువతిగా మారే క్రమంలో మొదలైన రుతుస్రావంలో నెలనెలా రక్తస్రావం జరుగుతుంటుంది. అందుకే మహిళల్లో ఇది సాధారణమైన సమస్య. యువతి ఆరోగ్యం బాగుండాలన్నా, భవిష్యత్తులో తల్లికాబోయే ముందరైనా రక్తహీనత లేకుండా తగినంత హీమోగ్లోబిన్‌ ఉండటం అవసరం. 

అందుకే తల్లిదండ్రులు యుక్తవయసులోని తమ పిల్లల్లోని హీమోగ్లోబిన్‌తో పాటు రక్తంలోని మిగతా అంశాలైన తెల్లరక్తకణాలూ... అందులోని బేసోఫిల్స్, ఈసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్‌ వంటి వాటితో పాటు రక్తం గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ వంటి వివరాలు తెలుసుకుని అవి నార్మల్‌గా ఉన్నాయా లేదంటే అందుకు తగినట్లుగా సిరప్, టాబ్లెట్లు వాడటానికి కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ) అనే రక్తపరీక్ష మేలు చేస్తుంది. 

మూత్ర పరీక్ష : పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు  ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్లను తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. కిడ్నీ  వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కాలేయ సమస్యలు, డయాబెటిస్‌ తీవ్రత వంటివి  తెలుసుకునేందుకు కూడా మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. 

బోన్‌డెన్సిటీ పరీక్ష : యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళ ఎముకల్లో క్రమంగా క్యాల్షియమ్‌ తగ్గుతూపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. ముఖ్యంగా మెనో΄ాజ్‌ దాటాక ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గుతూపోతుండటంతో ఇంచుమించు మహిళలందరిలోనూ కనిపించే సమస్య ఇది. 60 ఏళ్లు దాటిన 50%  మంది మహిళల్లో 80 ఏళ్లు దాటినవారిలో 90 శాతం మందిలో కనిపిస్తుంది. బోన్‌డెన్సిటో మీటర్‌ (డెక్సా స్కాన్‌) ద్వారా బోన్‌డెన్సిటీనీ తద్వారా  ఆస్టియోపోరోసిస్‌ను కనుక్కోవడం చాలా సులభం. దీని నివారణకు వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం. 

పాప్‌ స్మియర్‌...  మధ్యవయసుకు వస్తున్న వయసులోని మహిళలకు అంటే 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వారిలో సర్వికల్‌ క్యాన్సర్‌ను  తెలుసుకోడానికి ఉపకరించే పరీక్ష. ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌కు ప్రీ–క్యాన్సర్‌ దశ సుదీర్ఘకాలం ఉంటుంది. పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష ఇది.  

మామోగ్రామ్‌ : మహిళల్లో అత్యధికంగా కనిపించే బ్రెస్ట్‌క్యాన్సర్‌ను తెలుసుకునేందుకు చేయించే పరీక్ష ఇది. తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించవచ్చు. నలభై ఏళ్ల తర్వాత చేయించాల్సిన ఈ పరీక్షను రొమ్ములో నొప్పి, సలపరం ఉంటే తప్పక చేయించాలి. 

టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్ష: థైరాయిడ్‌ సమస్యను కనుగొనడం కోసం చేసే ఒక రకం రక్తపరీక్ష ఇది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు అంతగా లేని హైపోథైరాయిడిజమ్‌నూ, ఆ గ్రంథి అత్యంత చురుగ్గా పనిచేస్తున్న హైపర్‌థైరాయిడిమ్‌ అనే సమస్యలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.  థైరాయిడ్‌ సంబంధిత సమస్యలను తెలుసుకోవడం కోసం టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్ష చాలా ముఖ్యం.

క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్స్‌: సర్విక్స్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం చేసే పాప్‌ స్మియర్, రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ కోసం చేసే మామోగ్రామ్‌ పరీక్షలు కాకుండా... ఇతర రకాల క్యాన్సర్ల కోసం మరికొన్ని రక్తపరీక్షలూ అవసరం. ఉదాహరణకు సెర్విక్స్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తెలుసుకునే పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) పరీక్షలు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పును తెలుసుకునే లో–డోస్‌ హెలికల్‌ కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ పరీక్షలు; పెద్దపేగు, మలద్వారం వద్ద క్యాన్సర్‌ రిస్క్‌ తెలుసుకోడానికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్‌ అక్కల్ట్‌ బ్లడ్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఓబీటీ) వంటివి చేయించవచ్చు. 

షుగర్‌ పరీక్ష : చక్కెర వ్యాధిని గుర్తించడానికి పరగడుపున ఫాస్టింగ్‌ షుగర్‌ టెస్ట్, ఏదైనా తిన్న గంటన్నర తర్వాత పోస్ట్‌ ఫుడ్‌ షుగర్‌ టెస్ట్‌ వంటివి మాత్రమే కాకుండా... డాక్టర్‌ సూచనల మేరకు గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (జీటీటీ), మూడు నెలల సగటు షుగర్‌ తెలుసుకోడానికి హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలు అవసరం. మధ్య వయసు దాటాక ఈ చక్కెర పరీక్షలు చేయించడం చాలా అవసరం. ఇవే కాకుండా బీపీ రీడింగ్‌ మొదలుకొని... ఆయా మహిళల ఆరోగ్య అవసరాల మేరకు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించడం మంచిది. ఇందుకోసం ఆ తల్లుల బిడ్డలూ, భర్తలూ, పేరెంట్స్‌ ఇలా అందరూ పూనుకోవడం వల్ల మహిళ ఆరోగ్యం బాగుంటుంది. దాంతో సమాజంలో అందరి ఆరోగ్యమూ బాగుంటుంది.

డాక్టర్‌ లక్ష్మీదేవి అప్పసాని,సీనియర్‌ కన్సల్టెంట్‌ అబ్‌స్ట్రెటీషియన్‌ – గైనకాలజిస్ట్‌

డాక్టర్‌ చల్మేడ నివేదిత, సీనియర్‌ ఫిజీషియన్‌ 

నిర్వహణ:  యాసీన్‌

(చదవండి: పీఛే చల్‌! ఇలా నడిచి చూశారా?)
 

Advertisement
 
Advertisement
Advertisement