Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి | Sakshi
Sakshi News home page

Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి

Published Wed, Jul 27 2022 12:00 AM

Mittal Gohil Gujarat Desai Foundation Professional Training - Sakshi

ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు... వంటి కట్టుబాట్లు ఉన్న గ్రామంలో పుట్టిన మిత్తల్‌ గోహిల్‌ ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ చదువుకుని, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడమేగాక, ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళలను చక్కగా తీర్చి దిద్దడంతోపాటు, తన సొంత గ్రామంలో ఎంతోమంది బాలికలకు ప్రేరణగా నిలుస్తోంది. 

గుజరాత్‌లోని మారుమూల గ్రామం అంకోట్‌. ఈ గ్రామంలోని రాజ్‌పుత్‌ కుటుంబంలో పుట్టింది మిత్తల్‌ గోహిల్‌. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వ్యవసాయం చేసేవారు. వెయ్యిమంది ఉన్న గ్రామంలో మూఢాచారాలు ఎక్కువ. అమ్మాయిల్ని చదవనివ్వరు. చిన్నవయసులోనే పెళ్లి చేసి పంపిస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పెరుగుతున్నప్పటికీ మిత్తల్‌ మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదగాలని  కలలు కనేది.

కానీ గ్రామంలో అందరికీ విరుద్ధంగా తనని ఒక్కదాన్నే చదువుకోవడానికి పంపిస్తారా? అని కంగారు పడేది. కానీ మిత్తల్‌ తండ్రి ప్రోత్సహించడంతో పాఠశాల విద్య వరకు నవోదయ స్కూల్‌లో హాస్టల్‌ లో ఉండి చదువుకుంది. మిత్తల్‌ హాస్టల్‌ లో ఉండి చదవడాన్ని కూడా గ్రామస్థులు వ్యతిరేకించారు. కానీ మిత్తల్‌ ఇంగ్లిష్‌ మాట్లాడాలని పట్టుబట్టి మరీ ఆమె తండ్రి చదివించడంతో.. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తిచేసి, తరువాత సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ కూడా చేసింది.

ముగ్గురి నుంచి వందలమంది...
కాలేజీ రోజుల్లో నవలలు చదివే అలవాటు ఉన్న మిత్తల్‌ నవలల్లోని రచనల ద్వారా భారతదేశంలో మహిళల పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఆదివాసీలకోసం పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ ఇంట్లోవాళ్లు పంపించకపోవడంతో తన గ్రామానికి దగ్గర్లో ఉన్న భారుచ్‌లో మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టులో ఏరియా మేనేజర్‌గా చేరింది. ఇక్కడ మూడున్నరేళ్లు పనిచేసిన అనుభవంతో 2017లో ‘దేశాయ్‌ ఫౌండేషన్‌’లో చేరింది.

ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్న ఈ ఫౌండేషన్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే తన పనితీరుతో దాదాపు ఐదు వందలమంది పనిచేసే అతిపెద్ద సంస్థగా తీర్చిదిద్దింది. దీంతో ఫౌండేషన్‌లో చేరిన రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయ్యింది. ఫౌండేషన్‌ టీమ్‌తో కలిసి యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ముప్పై లక్షలమంది మహిళలు, బాలికల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా  పనిచేస్తోంది.

ప్లెజర్‌ పిరియడ్‌...
దేశాయ్‌ ఫౌండేషన్‌ ద్వారా.. మహిళాభివృద్ధి, సమాజంలో ఉన్నతంగా బతికేందుకు కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిలో భాగంగా ‘ప్లెజర్‌ పిరియడ్‌’ పేరిట పిరియడ్స్, మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలబడేలా వృత్తిపరమైన శిక్షణలు, కంప్యూటర్‌ ట్రైనింగ్, బ్యూటీ కోర్సులో శిక్షణ, పచ్చళ్లు, అప్పడాల తయారీ, క్యాండిల్స్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ, బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడం దగ్గర నుంచి స్టార్టప్‌ పెట్టడానికి కావాల్సిన రుణసదుపాయం కల్పించడం వరకు అన్ని రకాలుగా సాయపడుతూ మహిళా అభ్యున్నతికి పాటుపడుతోంది. మిత్తల్‌ తన నైపుణ్యంతో ఫౌండేషన్‌తోపాటు తన సొంత గ్రామంలో మార్పు తీసుకురావడం విశేషం.


‘‘అక్కలా చదవాలి...’’
నాన్న చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరుకునేవారు. తొలిసారి 2018లో అమెరికా వెళ్లినప్పుడు నాలుగు వందలమంది ముందు ఎంతో ధైర్యంగా ఇంగ్లిష్‌ మాట్లాడాను. నాన్న నా ఇంగ్లిష్‌ ప్రసంగాలను మెచ్చుకున్నారు. దేశాయ్‌ ఫౌండేషన్‌లో పనిచేస్తూ ఎంతోమంది బాలికలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం. మా గ్రామంలో ఎంతోమంది చిన్నారులకు నేను ప్రేరణగా నిలుస్తున్నాను.

గ్రామంలోని చాలా మంది తల్లిదండ్రులు మిత్తల్‌ అక్కలా, ఆ మేడంలా చదవాలి అని తమ కూతుళ్లకు చెబుతున్నారు. నా స్ఫూర్తితో గ్రామంలో ముప్పైమందికి పైగా అమ్మాయిలు డిగ్రీ పూర్తి చేశారు. ఏడుగురు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఎప్పుడూ ముసుగులు వేసుకుని సిగ్గుపడుతూ వచ్చే మహిళలు ఇప్పుడు ముసుగు తీసి ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వారి మాటతీరు, కట్టుబొట్టు అంతా మారిపోయింది. ఇంతమంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉంది’’.
– మిత్తల్‌ గోహిల్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement