అత్యున్నత స్థానాలు.. అందరూ మహిళలే

Menna Rawlings is appointed to UK first female ambassador - Sakshi

ఫ్రాన్స్‌కు తాజాగా మెన్నా రాలింగ్స్‌ అనే మహిళ... దౌత్యవేత్త కావడంతో బ్రిటన్‌ చరిత్రలోనే తొలిసారి అన్ని సీనియర్‌ డిప్లొమాటిక్‌ పోస్టులలో మహిళలే కనిపిస్తున్న సందర్భం విశేష ప్రాధాన్యాన్ని, చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే బీజింగ్, వాషింగ్టన్, బెర్లిన్, మాస్కో, టోక్యో, రోమ్‌లలో అందరూ మహిళలే సీనియర్‌ స్థాయిలో దౌత్య అధికారులుగా ఉన్నారు. ఇదొక అపూర్వ ఘట్టం.

బ్రిటన్‌ ప్రభుత్వంలో ‘సర్‌’లు, ‘లార్డ్‌’లు ఉన్నట్లే మహిళల్ని అతి కీలకమైన విదేశాంగ పదవుల్లోకి రానివ్వని ధోరణీ ఉంటుంది. ఆ దేశాన్ని ఎప్పుడూ రెండు పార్టీలు మారి, మారి పాలిస్తూ ఉంటాయి. కన్జర్వేటివ్‌ పార్టీ, లేబర్‌ పార్టీ. ఇప్పుడున్నది కన్జర్వేటివ్‌ పార్టీ. 187 ఏళ్ల క్రితం పుట్టింది. ఇంతవరకు ఆ పార్టీ తరఫున ఒక్క మహిళా విదేశాంగ కార్యదర్శిగా లేరు! ఉంటే అదొక విడ్డూరం. ఆడవాళ్లేంటి! దేశాలు దాటిపోవడం ఏంటి! అని. అందుకే కావచ్చు 2006లో లేబర్‌ పార్టీ మార్గరెట్‌ బెకెట్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించినప్పుడు మార్గరెట్‌ తనకు తనే నమ్మలేకపోయారు. లేబర్‌ పార్టీ పుట్టింది 121 ఏళ్ల క్రితం. ఆ పార్టీ చరిత్రలో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి మార్గరెటే. పార్టీలంటే సరే. ఏవో పురుషాధిక్యాలు, ‘మహిళలు చేయలేరు’ అనే చాదస్తాలు ఉంటాయి.

మెన్నా రాలింగ్స్‌ (ఫ్రాన్స్‌) , కరోలిన్‌ విల్సన్‌ (బీజింగ్‌), డేమ్‌ కరేన్‌ (వాషింగ్టన్‌)
మరి సీనియర్‌ దౌత్య అధికారులుగా వారిని నియమించడానికేమైంది? నమ్మకం లేక! ఆ నమ్మకం లేకపో వడం ఏళ్లుగా సాగుతూ వస్తోంది. అందరు పురుషులు ఒకేలా ఉండరు కదా. ‘అవకాశం ఇచ్చి చూస్తే కదా మహిళలలా చేయగలరో తెలుస్తుంది’ అని యు.కె. విదేశాంగ కార్యదర్శులు ఇద్దరు సర్‌ సైమన్‌ ఫ్రేజర్, లార్డ్‌ మెక్‌డోనాల్డ్‌ పట్టుపడితే అప్పుడు ఒకళ్లిద్దరితో మొదలైన  ఉన్నతస్థాయి మహిళా నియామకాలు ఒకటీ అరగా పెరుగుతూ వచ్చాయి. గత పదేళ్లలో 22 నుంచి 60 మంది మహిళలు విదేశాంగ శాఖలో పెద్ద పోస్టుల్లోకి రాగలిగారు. తాజాగా ఇప్పుడు ‘తొలి మహిళ’ నియామకం ఒకటి జరిగింది! ఫ్రాన్స్‌కి ఇంతవరకు బ్రిటన్‌ నుంచి మహిళా రాయబారి లేరు. ఇప్పటివరకు ఉన్న 43 మంది రాయబారులూ పురుషులే. తొలిసారి మెన్నా రాలింగ్స్‌ (53) అనే మహిళ మొన్న ఏప్రిల్‌ 29న ఫ్రాన్స్‌ రాయబారిగా నియమితులయ్యారు. బ్రిటన్‌ నుంచి ఒక మహిళ తనకు రాయబారిగా రావడం అన్నది పారిస్‌కు పూర్తిగా కొత్త. దీంతో ‘ఫస్ట్‌ ఉమన్‌ ఇన్‌ ది రోల్‌’గా రాలింగ్స్‌ చరిత్ర సృష్టించారు. చరిత్ర మాత్రమే కాదు. ఇదొక చరిత్రాత్మక సందర్భం కూడా!

జిల్‌ గల్లార్డ్‌ (బెర్లిన్‌) , డెబోరా బ్రానెర్ట్‌ (మాస్కో),  జూలియా లాంగ్‌బటన్‌ (టోక్యో)

∙∙
రాలింగ్స్‌ ఫ్రాన్స్‌ రాయబారిగా పారిస్‌ వెళ్లడంతో ప్రపంచంలో బ్రిటన్‌కు అత్యంత ప్రధానమైన అన్ని దేశాలలో మహిళలే అత్యున్నతస్థాయి దౌత్య అధికారులుగా ఉన్నట్లయింది! బ్రిటన్‌ చరిత్రలో ఇలాంటి సందర్భం ఇదే ప్రథమం. బీజింగ్‌లో కరోలిన్‌ విల్సన్, వాషింగ్టన్‌లో డేమ్‌ కరేన్‌ పియర్స్, బెర్లిన్‌లో జిల్‌ గల్లార్డ్, మాస్కోలో డెబోరా బ్రానెర్ట్, టోక్యోలో జూలియా లాంVŠ బటన్, రోమ్‌లో జిల్‌ మోరిస్‌.. అంతా మహిళలే. ప్రతిభ ఉన్నవారిని పెద్ద స్థానాలకు వెళ్లనివ్వకుండా పక్కన పెడితే పెద్ద స్థానాలే ప్రతిభను వెతుక్కుంటూ వస్తాయనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ. మహిళల శక్తి సామర్థ్యాలను,  నైపుణ్యాలను పురుషాధిక్య సమాజం ఎన్నాళ్లో, ఎన్నేళ్లో అడ్డుకుని ఆపి ఉంచలేదనడానికి ఇదొక నిదర్శనం కూడా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top