
వ్యాపారం, ఆవిష్కరణలకు సంబంధించి అందరిలా ఆలోచిస్తే... పెద్దగా పోయేదేమీ ఉండదు...వచ్చేది కూడా అంతగా ఉండదు!‘ కాస్త కొత్తగా ఆలోచిద్దాం’ అనుకుంటే మాత్రం వచ్చేది తప్ప పోయేదేమీ ఉండదు.రెండో కోవకు చెందిన ఈ మహిళలు ఇన్నోవేటివ్ స్టార్టప్‌లతో స్టార్‌లుగా మెరిసిపోయారు. వ్యాపార నైపుణ్య దీక్షాదక్షతలతో ‘సక్సెస్’కు సరిౖయెన నిర్వచనం అనిపించుకున్నారు. తాజాగా...హురున్ ఇండియా–2025 (అండర్ 30) జాబితాలో చోటు సాధించారు.
అంత ‘స్క్రీన్’ లేదు! కథలు వినడం నుంచి ΄పొదుపు కథలకు సమాధానం చెప్పడం వరకు పిల్లలకు ‘స్క్రీన్’ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందేనా? ‘అవసరం లేదు’ అంటూ మార్కెట్‌లోకి వచ్చిన ‘స్కిల్‌మెటిక్స్’ పిల్లల ప్రపంచానికి చేరువయింది. ఈ విజయానికి చిరునామా... దేవాన్షీ (Devanshi Kejriwal). ఇన్నోవేటివ్ స్టార్టప్‌గా పేరు తెచ్చుకున్న ‘స్కిల్‌మెటిక్స్’కు దేవాన్షీ కేజ్రీవాల్ కో–ఫౌండర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్. ముంబైలో ప్రారంభమైన ‘స్కిల్‌మెటిక్స్’ ఎకో–ఫ్రెండ్లీ, స్క్రీన్–ఫ్రీ ఎడ్యుకేషనల్ గేమ్స్‌ను క్రియేట్ చేస్తోంది. పిల్లలు పాఠాలు నేర్చుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. స్పెల్లింగ్ గేమ్స్‌తో మొదలైన ‘స్కిల్‌మెటిక్స్’ స్క్రీన్ అవసరం లేకుండానే పిల్లలకు నచ్చే, వారి ఆలోచనలకు పదును పెట్టే క్రియేటివ్ పజిల్స్‌ను డిజైన్ చేసింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది కంపెనీ.
అనుభవాలే అద్భుత పాఠాలై... : చిన్న వయసులోనే ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసి ‘భేష్’ అనిపించుకుంది దేవిక గోలప్. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకుంది. హురున్ ఇండియా జాబితాలోని పిన్న వయస్కులలో 28 సంవత్సరాల దేవిక గోలప్ ఒకరు. డిజిటల్ పాథాలజీకి సంబంధించిన ‘వోప్‌ట్రాస్కాన్’ కంపెనీలో పనిచేస్తున్న దేవికకు వైద్యపరికరాల తయారీ రంగంలో అయిదు సంవత్సరాల అనుభవం ఉంది. ‘వోప్‌ట్రాస్కాన్’ కార్పోరెట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా కంపెనీ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాలలో కీలకపాత్ర పోషిస్తోంది. ‘వోప్‌ట్రాస్కాన్’కు ముందు ‘కెటాలిస్ట్ హెల్త్ వెంచర్’లో హెల్త్‌కేర్ ఇన్వెస్ట్‌మెంట్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. ‘బెకాన్ డిస్కిన్‌సన్’లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. అంతకుముందు ‘మెడ్రోనిక్’లో సీనియర్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. ఎన్నో కంపెనీలలో పని చేసిన దేవిక ఎన్నో అనుభవాలను పాఠాలుగా మార్చుకుంది..
అమ్మ ఇచ్చిన ధైర్యమే... విజయానికి దారి
తనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ‘జీరో రిగ్రేట్స్’ అనే మాట వృషాలి ప్రసాదే నోట వినిపిస్తుంటుంది. ‘రిస్క్– టేకింగ్’ స్వభావం వృషాలిలో చిన్న వయసు నుంచే ఉంది. బిట్స్ గోవాలో చేరిన రోజుల్లో తన క్లాస్‌మేట్స్ శుభమ్ మిశ్రా, హరి వాలియత్‌తో కలిసి సృజనాత్మక ఆలోచనలు చేసేది. ‘కొత్తగా ఆలోచించడమే విజయానికి దగ్గరి దారి’ అంటున్న వృషాలి ఏఐ–పవర్డ్ ప్లాట్‌ఫామ్ ‘పిక్సిస్’ కు కో–ఫాండర్, సీటీవో. ఆటోమేట్ మార్కెటింగ్ డెసిషన్‌లతో వివిధ బ్రాండ్‌లకు ఉపయోగపడే ప్లాట్‌ఫామ్ ఇది. ‘నా విజయానికి ప్రధాన కారణం అమ్మ. నేను రిస్కీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడలేదు. నువ్వు బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వస్తావు. సందేహించాల్సిన అవసరం లేదు అని ప్రొత్సహించేది’ అంటుంది వృషాలి ప్రసాదే.

సుమధుర విజయగీతం: సింగర్, సాంగ్ రైటర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనదైన శైలిలో దూసుకు΄ోతుంది ఘనమైన వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న అనన్యశ్రీ బిర్లా (Ananyashree Birla). కళారంగంలో చిన్న వయసు నుంచే ప్రతిభ చూపుతున్న అనన్య పదిహేడు సంవత్సరాల వయసులో ‘స్వతంత్ర మైక్రోఫిన్’తో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. గ్రామీణ మహిళలకు సూక్ష్మరుణాలు అందించే సంస్థ ఇది.‘అనన్య బిర్లా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలైన అనన్య శ్రీ బిర్లా తల్లితో కలిసి మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘మైపవర్’ స్థాపించింది
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ టు ఎంటర్‌ప్రెన్యూర్ : ఒకప్పటి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన రోమితా మజుందార్ డైరెక్ట్–టు–కస్టమర్ స్కిన్‌కేర్ బ్రాండ్ ‘ఫాక్స్‌టేల్’ తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగులు మొదలుపెట్టి విజయం సాధించింది. జార్ఖండ్‌లోని రాంచీలో పుట్టి పెరిగిన రోమిత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ చేసింది. ‘ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఊగిసలాడే ధోరణి వద్దు’ అంటుంది రోమిత మజుందార్.
కుటుంబం నేర్పిన పాఠాలు : రకరకాల సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే రాధిక అంబానీ(Radhika Ambani) ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’ సీయివో వీరెన్ మార్చెంట్ కూతురు. పారిశ్రామిక దిగ్గజం అనంత్ అంబానీ భార్య. ఫామిలీ హెల్త్‌కేర్ బిజినెస్ ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’ నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ‘ఇన్నోవేషన్’ ‘రిసెర్చ్’ ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’ కు ప్రాణనాడిలాంటివి. కుటుంబం నమ్మిన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంతో పాటు, న్యూయార్క్ యూనివర్శిటీ చదువు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాధిక అంబానీకి బలమైన పునాదిని ఏర్పర్చింది. భరతనాట్యంలో రాధిక అంబానీ మంచి పేరు తెచ్చుకుంది.