
ఇవాళ ‘మెడికల్ టూరిజం’ (వైద్య పర్యాటకం) వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్లు వివిధ వ్యాధులకు అత్యున్నత చికిత్స పొందడానికీ వాహకంగా నిలుస్తోంది. ఈ రంగంలో భారత్ పైపైకి దూసు కుపోతుండటం మనందరికీ గర్వకారణం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్’ (టీటీడీఐ)– 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 119 దేశాల్లో మన భారతదేశం 39వ స్థానంలో ఉంది. అదే 2001లో మనం54వ స్థానంలో ఉన్నాం. కీలకమైన అంశాల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. ఉదాహరణకు మిగతావారి కంటే మంచి ధరకువైద్య సేవలు అందించడంలో 18వ స్థానం, విమాన రవాణా సామర్థ్యంలో 26వ స్థానం, అలాగే ఉపరితల రవాణాతో పాటు నౌకారవాణాలో 25వ స్థానంలో ఉంది. అందుకే ఈ ఏడాది నాటికి మెడికల్ టూరిజమ్‌లో భారత్‌లో మరో 12% పెరుగుదల నమోదవు తుందని అంచనా. ఈ రంగంలో ప్రస్తుతం ఫ్రాన్స్ అగ్రస్థానంలోఉంది.
పేషెంట్స్‌కు ఇవాళ చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వాళ్లు ఏదైనా మెడికల్ టూరిజమ్ తాలూకు గమ్యాన్నిఎంపిక చేసుకోవాలంటే... అక్కడున్న ఆరోగ్య మౌలిక సదుపా యాలు, తేలిగ్గా చేరేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యాలు, తమ ప్రాంతానికీ, అక్కడికీ సాంస్కృతికంగా ఉన్న పోలికలూ, అక్కడ దొరికే వైద్యసదుపాయాల నాణ్యత, అక్కడి వైద్యుల విద్యార్హతలూ – నైపుణ్యాలూ, అంతర్జాతీయ థర్డ్ పార్టీ ద్వారా వాళ్లకు లభించిన ప్రశంసలూ కితాబులూ (అక్రెడిటేషన్స్), తాము వాళ్లతో ఎంత తేలిగ్గా సంభాషించడం సాధ్యమవుతుంది వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
2020-2021 మధ్యకాలంలో అంతర్జాతీయంగా/ప్రపంచవ్యాప్తంగా 46 ప్రాంతాలు అత్యద్భుతమైన మెడికల్ టూరిజమ్ గమ్యస్థానాలుగా ప్రఖ్యాతి పొందాయి. అనేక అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్‌లు ఇవ్వడం జరిగింది. మన భారతదేశం... ఆసియా ఖండంలోనే అత్యుత్తమమైన మెడికల్ టూరిజమ్ డెస్టినేషన్స్‌లో ఒకటిగా ప్రశస్తి పొందింది. మనం ఆరో స్థానంలో నిలిచాం. సౌకర్యాల నాణ్యతలోనే కాదు... విభిన్నమైన అనేక సేవలూ అందించగల మనే ప్రఖ్యాతి పొందాం. మన మెడికల్ వీసా విధానం ఎంత అత్యుత్తమైనదంటే... ఓ పేషెంట్‌తో పాటు అతడి సహాయకులూ (అటెండెంట్స్) దాదాపు 60 రోజులకు పైబడి ఇక్కడ అత్యంత సౌకర్యవంతంగా ఉండిపోయి సేవలందుకునేంత ఉత్తమమైన గమ్యస్థానంగా పేరొందడమన్నది అంతర్జాతీయంగా అన్ని దేశాల పేషెంట్స్‌నూ ఆకర్షిస్తోంది. ‘గ్లోబల్ హెల్త్‌కేర్ అక్రెడిటేషన్ (జీహెచ్‌ఏ) వంటివి... భారతదేశాన్ని పేషెంట్ల పాలిట ఓ సురక్షిత మైన, నాణ్యమైన, సాంస్కృతికంగా ఉత్తమమైన సేవలందించే, భాషాపరంగా కూడా ఇబ్బందులు లేని మెడికల్ టూరిజమ్ గమ్య స్థానంగా సిఫార్సు చేస్తున్నాయి.
భారతదేశంలో అనేక ఆస్పత్రులు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలందిస్తున్నాయి. అనేక మంది సందర్శించే నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. మనం అనేక రకాల వైద్యసేవలందించేలా సుశిక్షితులమై ఉన్నాం. ఉదాహరణకు జబ్బుపడకముందే నివారించగల సేవలు (ప్రివెంటివ్ మెడిసిన్) వంటివాటినీ అంది స్తున్నాం. ఎన్నో వ్యాధులకు చికిత్స నివ్వగల నిపుణులమంటూ గర్వంగా ప్రకటించుకో గలిగేంత పటిష్ఠమైన స్థానంలో ఉన్నాం. వైద్య సేవల కోసం నేడు అనేక ఆఫ్రికన్ దేశాలూ, పశ్చిమ ఆసియా, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)తో పాటు... యూరప్‌లోని పలు దేశాలు, ఉత్తర అమెరికా నుంచి కూడా ఇవాళ భారత్‌ను... మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ను పలువురు పేషెంట్లు సందర్శిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు, సంతాన సాఫల్య చికిత్సలు, క్యాన్సర్ థెరపీలు, సౌందర్యసాధనాల ఉత్పా దనల రవాణా వంటివి మెడికల్ టూరిజమ్ రంగాన్ని మరింతముందుకు నడిపే అంశాలు. దాంతోపాటు గణనీయమైన ప్రైవేటు పెట్టుబడులు, అలాగే అనుకూలమైన ప్రభుత్వ విధానాల వంటి వాటితో ఇంకాస్త మెరుగుదల సాధ్యమవుతుంది. దీన్ని సుసాధ్యం చేసేలా బడ్జెట్‌లో ఈ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు చేయాలి. వీసా విధానాలను సులభతరం చేయాలి. తద్వారా మన ‘హీల్ ఇన్
ఇండియా’ నినాదానికి ఓ ఉద్యమరూపం కల్పించవచ్చు.
మన హైదరాబాద్ విషయానికి వస్తే... ఇప్పటికే ఈ నగరం వైద్య పర్యాటక రంగంలో ప్రపంచవ్యాప్త గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. కానీ అంతర్జాతీయంగా వైద్య సేవలను కోరుకుంటున్న కొన్ని దేశాలతో నేరుగా విమానయాన సర్వీసులు లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అయ్యింది. వైద్యసేవలు ఇక్కడ చాలా చవగ్గా దొరుకుతుండటమూ, ఇంగ్లిష్‌లో సంభాషించగలిగినవారు ఉండ టమూ, కాస్మోపాలిటన్ సంస్కృతి, సురక్షితమైన భద్రత వంటివి ఇక్కడి సానుకూల అంశాల్లో కొన్ని. అయితే ఈ పరిశ్రమలో రిఫరల్ ఫీజుల వంటి అనేక అనైతిక అంశాల వల్ల, అలాగే ఈ రంగంలోని మధ్యవర్తుల కారణంగా కొన్ని నిందలూ, అపవాదులు వినాల్సి రావడం ఓ దురదృష్టకరమైన అంశం. ఇక్కడికి వచ్చే విదేశీయుల్లో కొందరికి ఇంగ్లిష్ రాకపోవడం వల్ల ఇక్కడి మధ్యవర్తులు (దుబాసీలు) దోపిడీ చేస్తుండటమూ గర్హనీయమైన మరో అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఓ మంచి హెల్త్ టూరిజమ్ డెస్టినే షన్‌గా వృద్ధి చెందాలంటే... విదేశీ పేషెంట్స్‌కు అవసరమైన అనువాదకులను ఏర్పాటు చేయడం, వారు ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా చూసే ప్రత్యేక రక్షణ వ్యవస్థను సృష్టించడం, వారి సంస్కృతికి తగ్గట్లుగా ఆహారాలు, పానీయాలు అందేలా చేయడం, వారి మత ఆచారాలూ, విధానాలకు తగ్గట్లుగా ప్రార్థనా సౌకర్యాలు కల్పించడం, వారు ఖర్చు చేసే ప్రతి పైసాకూ తగిన ప్రతిఫలం అందేలా చూడటం అవసరం.
గత నాలుగు దశాబ్దాల కాలంలో ఓ మంచి వైద్యుడిగా,వైద్య సేవలు అదించే బృందాలకు నేతృత్వం వహిస్తున్నవాడిగా, ఇక్కడా, అలాగే అమెరికాలో కూడా సంపాదించిన అనుభవంతో చెప్పొచ్చేదేమిటంటే... మెడికల్ టూరిజమ్ రంగంలో మనం ప్రపంచంలోనే అందరూ కోరుకునే ఆదర్శ వనరులతో ఓ అద్భుతమైన గమ్యంగా ఉన్నాం. ఈ వేల కోట్ల డాలర్ల పరిశ్రమలో హైదరా బాద్‌నూ, మన రాష్ట్రాలనూ అగ్రస్థానంలో ఉంచడానికి కృషి చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.
డా. గురుఎన్‌రెడ్డి
వ్యాసకర్త కాంటినెంటల్ హాస్పిటల్స్ స్థాపకుడు–చైర్మన్