టైమ్స్‌ జాబితాలో ఇండో అమెరికన్ !

Manjusha P Kulkarni Time 100 Most Influential People Of 2021 - Sakshi

మంజుషా పి కులకర్ణి

వివిధ రంగాల్లో తమదైన ముద్రవేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచే వందమంది జాబితాను టైమ్స్‌ మ్యాగజీన్‌  ఇటీవల విడుదల చేసింది. ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2021’లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ , ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌లతోపాటు మన దేశానికి చెందిన నలుగురు ప్రముఖులు చోటుదక్కించుకున్నారు. వీరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ సీఈవో అడర్‌ పూనావాల, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఏ3పీసీఓఎన్‌  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మంజుషా పి కులకర్ణిలు ఉన్నారు.

మంజుషా ఏషియన్‌  పసిఫిక్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌(ఏ3పీసీఓఎన్‌)కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ లక్షలమంది జాత్యహంకారానికి గురైన బాధితులకు సాయం చేస్తున్నారు. నలభైకి పైగా కమ్యూనిటీ సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పదిహేను లక్షలమంది ఆసియన్‌  అమెరికన్స్‌, పసిఫిక్‌ ఐలాండ్‌ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాక కోవిడ్‌–19 తర్వాత జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు స్టాప్‌ ఏఏపీఐ(ఏషియన్‌  అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌–ఏఏపీఐ) స్థాపించి దాని ద్వారా పోరాడుతున్నారు.

మంజుషా ఇండియాలో పుట్టింది. కొన్నాళ్లల్లోనే తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లడంతో ఆమె బాల్యం అంతా అక్కడే గడిచింది. అలబామాలోని మోంట్‌గోమెరీలో ఇండియన్‌  కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో వాళ్లతో కలిసి పెరుగుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ పెరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో తను కూడా ముందుగా డాక్టర్‌ అవ్వాలనుకుంది. కానీ తనకు లా అంటే అమితాసక్తి ఉండడంతో మెడిసిన్‌  కాకుండా లా చదువుతానని తల్లిదండ్రులకు చెప్పింది.

వాళ్లు వద్దని వారించినప్పటికీ తనే నిర్ణయం తీసుకుని లా చదివింది. లా తోపాటు పౌరుల హక్కుల గురించి విపులంగా తెలుసుకున్న మంజుషా అవి సక్రమంగా అమలు కావాలని కోరుకునేది. స్కూల్లో చదివేప్పటి నుంచి తన తోటి విద్యార్థులు శరీర రంగు కారణంగా వివక్షకు గురికావడం, తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు జాత్యహంకారంతో చిన్నచూపు చూసిన సందర్భాలు అనేకం ఎదుర్కొంది. ఇవి నచ్చని మంజుషా వాటికి వ్యతిరేకంగా పోరాడాలనుకునేది.

లా అయ్యాక..
బోస్టన్‌  యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరీస్‌ డాక్టర్‌ లా డిగ్రీ అయ్యాక సదరన్‌  పావర్టీ లా సెంటర్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసింది. ఈ సమయంలో పౌరుల హక్కుల గురించి మరింత అధ్యయనం చేసింది. జాత్యహంకారానికి గురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరమైన హక్కులు ఏమి ఉన్నాయో మరింత లోతుగా తెలుసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్‌ హెల్త్‌ లా ప్రోగ్రామ్‌(ఎన్‌హెచ్‌ఈఎల్‌పీ)లో చేరి.. శాసన, పరిపాలన, న్యాయపరమైన శిక్షణా కార్యక్రమాలు, సాంకేతిక సహాయం, నిరుపేదలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేది.

తరువాత ఎన్‌హెచ్‌ఈఎల్‌పీ నుంచి తప్పుకుని సౌత్‌ ఏషియన్‌  నెట్‌వర్క్‌(సాన్‌)కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలను చేపట్టి మరికొంతమంది పౌరులకు ఆరోగ్య, పౌరుల హక్కుల గురించి పనిచేసింది. ఇదే క్రమంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్ణ వివక్షపై పోరాడుతూ ఉండేది. తరువాత మరో ఇద్దరితో కలిసి ఏషియన్‌  పసిఫిక్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌ (ఏ3పీసీఓఎన్‌) ను స్థాపించి దానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ జాత్యహంకార దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలబడి పోరాడుతోంది.

ఏఏపీఐ..
గతేడాది కోవిడ్‌–19 ప్రపంచం మీద విరుచుకు పడడంతో..కోవిడ్‌ వైరస్‌ చైనాలో పుట్టిందని, చైనా వైరస్, వూహాన్‌  వైరస్‌ అని దూషిస్తూ అమెరికాలో ఉన్న చైనీయులపై దాడులు చేయడం, జాత్యహంకార దాడులు పెరగడం, అప్పటి అధ్యక్షుడు ఏషియన్‌  దేశాలకు వ్యతిరేక విధానాలు అమలు చేయడంతో.. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో... ఏషియన్‌  అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ (ఏఏపీఐ)ను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలబడి, కావాల్సిన సాయం చేస్తోంది.

అంతేగాక గత రెండు దశాబ్దాలుగా జాతి సమానత్వం కోసం పోరాడుతుండడంతో ఆమెను టైమ్స్‌ మ్యాగజీన్‌  2021 గాను వందమంది అత్యంత ప్రభావవంతమైన జాబితాలో చేర్చింది. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో వైట్‌ హౌస్‌ నుంచి ‘చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డును అందుకుంది. ఒకపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క సమాజ సేవచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నందున మంజుషా కులకర్ణికి టైమ్స్‌ వందమంది ప్రభావవంతుల జాబితాలో చోటు లభించింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top