సాధికారతే సౌందర్యం

Mamata Trivedi starts on Society for Empowering Women - Sakshi

మహిళలు... మౌనం వీడాలి... గొంతు విప్పాలి. చెప్పాలనుకున్నది... చెప్పగలగాలి. వాళ్లకు... ఓ ఆలంబన కావాలి. వినడానికి ఒకరున్నారనే భరోసానివ్వాలి.
సాధికార సాధనలో ఒకరిది తొలి అడుగైతే మరొకరిది వందో అడుగు... అంతే. గమ్యం వేల అడుగుల దూరాన ఉంది. ఆ లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది మమత‘సేవ’

‘సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి. తనకు గౌరవప్రదమైన స్థానాన్నిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలి’... ఇదీ ఆమె ఫిలాసఫీ. మరి ఆ తిరిగి ఇవ్వడంలో ‘మీ ప్రాధాన్యం మహిళలకే... ఎందుకలా?’ అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘తరతరాల వివక్షకు తలొగ్గి మగ్గిపోయింది మహిళ.

సమానత్వ పోరాటంలో అనుక్షణం అలసి పోతోంది. ఇంటి నాలుగ్గోడలు ఆమెను అర్థం చేసుకుంటాయి. కానీ ఆమె మనసులో ఆవేదనను బయటకు తెలియనివ్వకుండా అడ్డుకుంటాయి కూడా. మహిళ గొంతు విప్పడానికి సాహసం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉంది నేటికీ. ఆమె ఎదగడానికి నిచ్చెన వేసే వాళ్లు ఉండరు. సాధికారత సాధనలో భాగంగా చెమటోడ్చి ఒక్కో సోపానాన్ని తనకు తానే నిర్మించుకుంటోంది.

నా మాటలను నమ్మలేకపోతే నేను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చూడండి. ఆడపిల్ల పరిస్థితి అర్థమవుతుంది. ఒక్క పూట అయినా అన్నం దొరుకుతుందని బడికి వచ్చే అభాగ్యులు కనిపిస్తారు. చేనేత కుటుంబాల్లో ఆడవాళ్లను చూడండి, రంగులద్ది అద్ది అరచేతులు రంగుమారిపోయి ఉంటాయి.

ఇక వేలాది రూపాయలు పెట్టి ఆ చీరలను ధరించగలిగిన సంపన్న వర్గాల మహిళలను కదిలించి చూడండి, జానెడు పొట్ట ఆకలి తీర్చడానికి పట్టెడన్నం ఎప్పుడు తినాలో తెలియని ఎదురు చూపులే ఉంటాయి. ఇంట్లో మగవాళ్లందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆడవాళ్లు భోజనం చేయాలనే నియమాన్ని పాటిస్తున్న కుటుంబాలు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయంటే నమ్ముతారా?’’ అన్నారామె ఆవేదనగా.

మహిళలంతా విజేతలే
మమతా త్రివేది పూర్వీకులు వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎం.ఎ సైకాలజీ చేసిన మమత... తన మామగారు ఆర్‌.పి. త్రివేది స్థాపించిన పబ్లికేషన్‌ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. భర్త, కొడుకు చార్టెడ్‌ అకౌంటెంట్‌లు.

కూతురు యూఎస్‌లో స్థిరపడింది. ఎంప్టీనెస్‌ అనేటంతటి పెద్ద పదం కాదు కానీ, కుటుంబ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఏర్పడే ఒకలాంటి శూన్యత చాలామందికి ఎదురవుతుంది.

కొద్ది సంవత్సరాలుగా ఒకే మూసలో సాగుతున్న డైలీ రొటీన్‌ కొంతమందిలో బోర్‌కు దారి తీస్తుంది.ఆ స్థితిలోనే జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పుకోగలగాలి. అదే చేశారు మమత. ‘‘మా అమ్మాయి ప్రోత్సాహంతో నలభై ఏడేళ్ల వయసులో మిసెస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మేకప్, హై హీల్స్‌ ధరించడం కొత్తగా అనిపించింది.

‘బ్యూటీ’ అనే పదానికి అసలైన అర్థం అప్పుడే తెలిసింది. మేని ఛాయ, ఎత్తు, లావు... ఇవేవీ కాదు. పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోగలిగిన నేర్పు, మార్పును స్వీకరించగలిగిన వైనం వంటి అనేక అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.

సాధికారతను మించిన సౌందర్యం మరొకటి ఉండదు. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్‌ స్థాయి పోటీల్లో నాకు ‘మిసెస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ (2017)’ కిరీటం దక్కింది. కానీ ఆ పోటీలకు ముప్పైకిపైగా దేశాల నుంచి వచ్చిన మహిళల్లో ప్రతి ఒక్కరూ విజేతలే అని చెప్పాలి.

ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంది. నిజానికి నేను అసలైన ప్రపంచాన్ని చూసింది అప్పటి నుంచే. ప్రతి మహిళకూ జీవితంలో పోరాటం ఉంటుంది. జీవితంతో పోరాడి నిలబడడమే గొప్ప విజయం. అప్పటి వరకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా లేదు. ఇల్లు, పబ్లికేషన్‌ వ్యాపారం, పిల్లలు... ఇదే లోకంగా జీవించాను. ఈ పోటీల్లో టాస్కుల్లో భాగంగా నా గురించి రాసి ఎఫ్‌బీలో పోస్ట్‌ చేయాల్సి వచ్చింది. నా సోషల్‌ మీడియా జర్నీ అలా మొదలైంది.

మిసెస్‌ ఏసియా ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ విజేత మమతా త్రివేది

అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ!
బ్యూటీ విత్‌ హార్ట్‌... కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆత్మహత్యల నివారణ కోసం పని చేస్తున్నాను. ‘సేవ (ఎస్‌ఈడబ్లు్యఏ, సొసైటీ ఫర్‌ ఎంపవరింగ్‌ ఉమెన్‌)’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళల సాధికారత కోసం పని చేస్తున్నాను.

హైదరాబాద్‌ సమీపంలోని షాద్‌నగర్‌ దగ్గర బాలానగర్‌ ప్రభుత్వ పాఠశాల, హైదరాబాద్, బర్కత్‌పురాలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించండి. అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. ఆడపిల్లలను చదివిస్తున్నారని సంబర పడితే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు.

మగపిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తూ ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నారు. పైగా వాళ్లను టెన్త్‌ తర్వాత చదివించరు. ఎనిమిదో తరగతి నుంచే డ్రాపవుట్లు మొదలవుతుంటాయి. పెళ్లి చేసేయడం అన్నింటికీ పరిష్కారం అన్నట్లు ఉంటాయి పేరెంట్స్‌ ఆలోచనలు.

ఆ ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటారంటే... క్షణాల్లో చక్కగా బొమ్మలు వేసే వాళ్లున్నారు. వాళ్లకు చాక్లెట్‌ తయారీ, పెయింటింగ్, ప్రింటింగ్‌ వంటి మాకు తెలిసిన స్కిల్స్‌ నేర్పిస్తున్నాం. ఎనభై శాతం మార్కులతో పాసైన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఎడ్యుకేషనల్‌ అడాప్షన్‌ చేస్తున్నాం. వీవర్స్‌ కుటుంబం నుంచి కూడా విద్యాదత్తత చేసుకున్నాం.  
 
తొలి అడ్డంకి గడప లోపలే

ఎవరైనా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలంటే కుటుంబం ప్రోత్సాహం తప్పనిసరి. చాలామంది ఆడవాళ్లకు ఇంట్లో సాటి ఆడవాళ్ల నుంచే మద్దతు కరవవుతోంది. తొలి అడ్డంకి ఇంట్లోనే ఎదురవుతోంది. ఈ విషయంలో మహిళలు ఇంట్లో వాళ్లతో పోరాడడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంట్లో వాళ్లను కన్విన్స్‌ చేసుకోవడమే కరెక్ట్‌.

ఆ తొలి మెట్టులో విజయం సాధించగలిగితే ఇక ఆమె ప్రస్థానంలో ఎదురీతలు పెద్దగా ఉండవు. అందుకు నేనే ఉదాహరణ’’ అన్నారు మమతా త్రివేది. ఆమె చేస్తున్న సేవలో తొలి ప్రయోజకులుగా మహిళలు కనిపిస్తున్నప్పటికీ ఆ ఫలితం కుటుంబానికి ఉపయోగపడుతుందంటారామె. అందుకే సమాజానికి తాను తిరిగి ఇస్తున్న ప్రయోజనాలకు వారధులుగా మహిళలనే ఎంచుకున్నానన్నారు.  

తరాల కలనేత
పోచంపల్లికి వెళ్లి చేనేతకారుల కుటుంబాలను చూస్తే కన్నీరు వస్తుంది. భార్యాభర్త నెలంతా కష్టపడితే వాళ్లకు వచ్చేది పదిహేను వేల రూపాయలే. వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్‌లో ఏ ధరకు అమ్ముడవుతాయో కూడా వాళ్లకు సరైన అంచనా లేదు. వాళ్లకు తగినంత పని కల్పించడానికి, మంచి రాబడినివ్వడానికి గాను... నేను నిర్వహిస్తున్న బ్యూటీ కాంటెస్ట్‌లలో తప్పనిసరిగా ట్రెడిషనల్‌ వేర్‌ ఉండేటట్లు చూస్తున్నాను.

ఇటీవల ర్యాంప్‌ వాక్‌ కూడా అక్కడే ఏర్పాటు చేశాను. ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా మరో కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. నాకు స్వతహాగా కూడా చేనేత చీరలంటే చాలా ఇష్టం. నేను కట్టుకున్న ఈ చీరను చూడండి. అరవై ఏళ్ల నాటిది. మా అత్తగారి చీర. ఇప్పటికీ అదే మెరుపు. అందుకే ఈ కళను బతికించుకోవాలి.
– మమతా త్రివేది,   ఫౌండర్, సొసైటీ ఫర్‌ ఎంపవరింగ్‌ ఉమెన్‌
రీజనల్‌ డైరెక్టర్, మిసెస్‌ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top