నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఆఫ్రికన్ రచయితలు– పంచపాండవుల్లా– అయిదుగురే! ఇవాళ మనం ఎవరి గురించి చర్చించుకోబోతున్నామో ఆ పెద్దమనిషి కూడా వారిలో ఒకరు. అతని తండ్రి తరఫు పూర్వికులు, నాలుగైదు వందల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాకు తరలి వెళ్ళిపోయిన డచ్ (నెదర్లండ్స్) జాతీయులు. తల్లి తరఫు వాళ్ళు డచ్–జెర్మన్–పోలిష్ జాతీయులు. 1940లో పుట్టిన ఈ బహుళజాతి రచయిత బాల్య కౌమార ప్రథమ యవ్వన దశలు గడిపింది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో. ఇరవైరెండో యేట బ్రిటన్ చేరి, ఐబీఎం సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా జీవనం మొదలుపెట్టాడు. అతని పేరు జాన్ మ్యాక్స్‌వెల్ కూట్సీ. 2003లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న విశిష్ట రచయిత!
కూట్సీ సిద్ధాంత పత్రానికి 1963లో కేప్ టౌన్ యూనివర్సిటీ మాస్టర్స్ పట్టా ప్రసాదించింది. మరో ఆరేళ్ళకు, శామ్యూయెల్ బెకెట్ వచనంలో వాక్యనిర్మాణరీతి– పదప్రయోగ శైలి– ధ్వని తదితర విశేషాల గురించి కూట్సీ సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాక్టరేట్ ప్రసాదించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పెద్దమనిషి సృజనాత్మక సాహిత్యాన్నీ, భాషా సాహిత్యాలపై పరిశోధనను రెండు చక్రాలుగా చేసుకుని బండి నడిపిస్తూనే వున్నాడు! అలాంటి మనిషికి ఇంగ్లిష్, ఆఫ్రికాన్స్, డచ్, నామా, మలయ్ తదితర భాషలు తెలిసివుండడంలో వింతేముంది?
సామాన్య శకం 450 సంవత్సరం నుంచి 1150 వరకూ వాడుకలో వుండి అంతరించిన ‘ఓల్డ్ ఇంగ్లిష్‘ అనే యాంగ్లో శాక్సన్ భాషలో కూడా నిష్ణాతుడు కావడం కూట్సీ సాధించిన ఘనవిజయాల్లో ఒకటి! టూకీగా చెప్పుకుంటేనే కూట్సీ కథ ఇంతవచ్చింది!కూట్సీ పుట్టి పెరిగిన దేశం దక్షిణాఫ్రికాలో 1994 వరకూ, రంగువెలి (అపార్థీడ్) అనే జాతి వివక్ష విధానం అమల్లో వుంది. గాంధీజీ ఆ దేశంలో అవమానాల పాలబడిన కథ చిన్నప్పుడు చదువుకున్నాంగా. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు నిర్బంధం అనుభవించాల్సి రావడానికి ఇదే విధానం కారణం. కూట్సీ మొదటి నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూనే రావడం నిజంగానే విశేషం! పాతికేళ్ళకు ముందే యూరపియన్– అమెరికన్ దేశాల్లో విస్తృతంగా తిరిగే అవకాశం కూట్సీకి దక్కడం వల్లే, ఈ విశాల దృష్టి ఏర్పడి వుంటుంది.
అలా జాతిపరమైన అస్తిత్వ రేఖలను చెరిపేసుకుని, అక్షరాలా అంతర్జాతీయ స్వభావం సంతరించుకున్న రచయితల్లో కూట్సీ మొదటివాడూ కాడు– బహుశా చివరివాడు కూడా కాడేమో! ‘ఇంట గెలిచి, రచ్చ గెలవ’మనే నానుడి కూట్సీ మాతృభాష ఆఫ్రికాన్‌లో కూడా వున్నట్లుంది! అందుకే, అతగాడు 1977లో దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక పురస్కారం సీఎన్‌ఏ (సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) సాహిత్య పురస్కారంతోనే తన విజయ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇదే పురస్కారాన్ని 1980లో మరోసారి, ’84లో ఇంకోసారి కూడా గెల్చుకున్నాడు కూట్సీ. బుకర్ ప్రైజును రెండుసార్లు గెల్చుకున్న రచయిత తొలిరచయిత కూడా కూట్సీయే!‘ఇన్ ద హార్ట్ ఆఫ్ ద కంట్రీ’ నవలలో అధ్యాయాల విభజన లాంటిది కనిపించదు.
రచయిత దీన్ని 266 పేరాగ్రాఫులుగా విభజించారు. సినిమా స్క్రిప్టులో కనిపించే సీన్ పేపర్ల కట్టలా వుంటుంది ఈ నవల. 1985లో మేరియన్ హ్యాన్సల్ ఈ దృశ్యమాన నవలను ‘డస్ట్’ అనే సినిమాగా తీశాడంటే తీయడూ మరి? ఈ నవల వెలువడ్డానికి మూడేళ్ళు ముందే, కూట్సీ రెండు నవలికలను కలిపి ‘డస్క్ ల్యాండ్స్’ అనే ఒకే నవలగా రాశాడు. వియెత్నాంలో మనోవైజ్ఞానిక యుద్ధానికి వ్యూహ రచన చేసిన యూజిన్ డాన్ క్రమంగా ఉన్మాదంలోకి దిగజారి కన్నకొడుకునే పొడిచి చంపేసిన కథనే ‘ద వియెత్నాం ప్రాజెక్ట్’ అనే నవలిక రాశాడు కూట్సీ. ‘ద నెరేటివ్ ఆఫ్ జాకబస్ కూట్సీ’ అనే మలి నవలిక, వాస్తవానికి కాలక్రమంలో ముందు రావాలి. వలసవాదులూ, సామ్రాజ్యవాదుల మానసికతలో అంతర్నిహితంగా వుండే హింసాత్మకత ఇతివృత్తంగా రాసిన నవలికలివి. ఆ రెండింటికీ అదే సామాన్య గుణం! ఇది కూడా గొప్పగా విజయవంతమైన ప్రయోగం. కాగా, నిత్యాధునికవాదం అనే పోస్ట్ మాడర్నిస్టు నవలా రచనకు ఇదే ఆదిగ్రంథమంటారు విమర్శకులు.
1999లో, కూట్సీకి రెండోసారి బుకర్ ప్రైజ్ సంపాదించిపెట్టిన నవల ‘డిస్‌గ్రేస్.’ దక్షిణాఫ్రికాలో ఒకప్పుడు తెల్లదొరలు పాటించిన వివక్ష విధానాలు తర్వాతి రోజుల్లో ఎలాంటి విషఫలితాలు ఏర్పడడానికి దారితీశాయో చూపించిన రచన ఇది. ల్యూరీ అనే కీచకోపాధ్యాయుడు అప్రతిష్ఠాకరమైన జీవనం తర్వాతి కాలంలో పెత్తనం చెలాయించిన ‘నల్లదొరలు’ అనుకరిస్తే ఏమవుతుందనేదే ఈ నవలకు ఇతివృత్తం. 2019లో బీబీసీ ఎంపిక చేసిన ‘నూరు స్ఫూర్తిదాయకమైన నవలల జాబితా’లో స్థానం సంపాదించుకున్న నవల ఇది!డేనియల్ డీఫో సుప్రసిద్ధ రచన– ఇంగ్లిష్ భాషలో తొలి నవల– ‘రాబిన్సన్ క్రూసో’ సామాన్యశకం 1719లో తొలిముద్రణగా వెలువడింది.
1986లో, ఈ కథను దేశకాలమాన పరిస్థితులకు తగిన రీతిలో పునరూహ చేస్తూ, పునః రచించాడు కూట్సీ. దానికి ఆయన పెట్టిన పేరు ‘ఫో.’ నాలుగేళ్ళ తర్వాత, కూట్సీ తిరిగి దక్షిణాఫ్రికా ఇతివృత్తం వైపు దృష్టి మళ్ళించి, ‘ద ఐరన్ ఏజ్’ అనే నవల రాశారు. కూట్సీ రచనలన్నింట్లోనూ, ‘ఆశ్చర్యకరమైన రీతిలో పరాయివ్యక్తి జోక్యం జరుగుతూ ఉంటుంద’ని నోబెల్ పురస్కార ఎంపిక సంఘం పేర్కొంది. ఈ సామాన్య గుణంతో కూడివుండే కూట్సీ రచనలన్నింటికీ కలిపి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2003లో అందించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారం పొందిన రచయితల్లో, ఈ ఆఫ్రికన్–ఆస్ట్రేలియన్ రచయితతో పోల్చదగిన వ్యక్తి మరొక్కరు కూడా కనిపించరని కూట్సీ అభిమానుల అభిప్రాయం!
-మందలపర్తి కిషోర్


