
నాకు గత కొంత కాలంగా విపరీతమైన నడుము నొప్పి వస్తుండటంతో ఒక సర్జన్ వద్దకు వెళ్ళాను. ఆయన సర్జరీ చేస్తే తగ్గుతుంది అని చెప్పి, నమ్మించి సర్జరీ చేశారు. కానీ నొప్పి పోలేదు. ఇప్పుడేమో నడుము కింది భాగంలో ఒక డిస్క్ సర్జరీ చేయాలని అంటున్నారు. ముందే ఎందుకు చెప్పలేదు అంటే, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు అంటున్నారు. గూగుల్‌లో చూస్తే మొదట చేసిన సర్జరీ అంత ఫలితాలు ఇవ్వదు, అసలు చేసింది కూడా దండగే అని ఉంది. ఆ సర్జన్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డబ్బు కోసమే చేశాడు అనుకుంటున్నాను. ఎలాంటి కేసులు వేయాలి?
– విక్రమ్, తిరుపతి
ఏంటండీ విక్రమ్ గారూ.. చాలా అక్రమంగా ఉన్నారే! ఒక అర్హత కల్గిన డాక్టరు అనుభవాన్ని, నిర్ణయాన్ని గూగుల్‌లో ఏదో చదివి తప్పు అని తేల్చేస్తారా? పోనీ అదే గూగుల్, యూట్యూబ్‌లో చూసి మీ సర్జరీ మీరే చేసుకోకపోయారా? ఒక క్వాలిఫైడ్ (అర్హులైన) డాక్టరు ఇచ్చే సలహాపై మీకేదైనా సందేహం ఉంటే మరొక డాక్టరు వద్ద అభిప్రాయం తీసుకోవాలి. అంతేగానీ గూగుల్ చెప్పింది అని కేసులు వేస్తాననుకోవటం సబబేనా? మీ సమస్యకి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని చెప్పే నైపుణ్యం మీకుందా?
ఏది ఏమైనా, మీరు అడిగారు కనుక చట్టం మాత్రమే చెబుతాను. అలా చేయమని సలహా మాత్రం ఇవ్వను.1) భారత వినియోగదారుల సంరక్షణ చట్టం 2019 ప్రకారం, వైద్యసేవలు కూడా ‘సేవలు’ కిందికి వస్తాయి. ఒక వైద్యుని నిర్లక్ష్యం వల్ల మీరు శారీరక నష్టం అనుభవించి ఉంటే, మీరు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (కన్స్యూమర్ కోర్టు)లో కేసు వేయవచ్చు. అక్కడ మీరు నష్టపరిహారం, వైద్య ఖర్చులు, భవిష్యత్తు చికిత్సల ఖర్చులు సైతం కోరవచ్చు) 2) భారత న్యాయ స్మృతి కోడ్ (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం, డాక్టర్ నిర్లక్ష్యం క్రిమినల్ బాధ్యతకు దారి తీయవచ్చు.
ప్రస్తుత చట్టం ప్రకారం, సెక్షన్ 106 (డాక్టరు నిర్లక్ష్యం వలన ప్రాణ నష్టం) – సెక్షన్ 125 (నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితి కల్పించటం) వంటి సెక్షన్ల కింద కేసు వేసే అవకాశం ఉంది. కానీ, దీనికి తగినంత పటిష్టమైన మెడికల్ ఆధారాలు ఉండాలి. కేవలం అనుమానాల ఆధారంగా క్రిమినల్ కేసులు వేయటం , అవి నిలబడటం కష్టం.
ప్రతి వైద్యలోపం లేదా ప్రతికూల ఫలితాన్ని వైద్యుడి నిర్లక్ష్యంగా పరిగణించలేము. చికిత్సలు కొన్ని రిస్క్‌లతో ఉంటాయి. కాపాడాలని ప్రయత్నించే వైద్యులు కూడా ఎప్పుడో అపరాధులుగా/నిందితులుగా మారిపోతే, మన వైద్య వ్యవస్థ స్తంభించిపోతుంది.అమెరికా వంటి దేశాల్లో, వైద్యులు కేసుల ఉచ్చులో పడిపోతారనే భయంతో అవసరమైన చికిత్సలు ఇవ్వకుండా డిఫెన్సివ్ మెడిసిన్స్ పాటిస్తున్నారు. అంటే రోగికి కావాల్సింది కాకుండా, చట్టపరమైన సమస్యలు రాకుండా చికిత్స అందిస్తున్నారు! మన దేశం కూడా అదే దిశగా పోతే, ప్రజలే నష్టపోతారు.
మీకు నిజంగా అన్యాయం జరిగిందని మీరు భావిస్తే... మొదట వైద్య నిపుణుల సలహా తీసుకోండి (ఇంకొక నిపుణుడి లిఖిత పూర్వక మెడికల్ అభిప్రాయం). అనంతరం ఒక న్యాయవాది ద్వారా సరిగా మీ కేసు గమనించి, ఏ మార్గం మీకు సరైందో నిర్ణయించండి.నిర్దిష్టమైన ఆధారాలతో మాత్రమే ముందుకెళ్లండి. ఎందుకంటే ఒక వైద్యుని ప్రొఫెషనల్ జీవితాన్ని కేవలం అనుమానాలతో లేక ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేస్తే, అందుకు తగిన చర్యలు సదరు వైద్యులు కూడా తీసుకోవచ్చని మరువకండి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )