శాంతి కోసం స్త్రీ శక్తి

India to deploy platoon of women peacekeepers to UN Mission in Sudan - Sakshi

ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్‌ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్‌ సింగిల్‌ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్‌ ఉమెన్‌ పీస్‌కీపర్స్‌...

సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్‌. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్‌’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి.

సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అక్కడ భవిష్యత్‌ అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్‌ చేపడుతున్న పీస్‌కీపింగ్‌ మిషన్‌లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది.

పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్‌ పీస్‌కీపింగ్‌ మిషన్‌ కోసం మన దేశం 2007లో ‘ఆల్‌–ఉమెన్‌ టీమ్‌’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్‌.
 మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు.

గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది.  2007లోనే ‘ఆల్‌ ఉమెన్‌’ టీమ్‌ ఏర్పాటు  చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్‌. ‘ఛాంపియన్‌ ఆఫ్‌ జెండర్‌ మెయిన్‌స్ట్రీమింగ్‌’గా గుర్తింపు పొందింది.

ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు.
తాజాగా ‘అభేయ్‌’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్‌ సింగిల్‌ యూనిట్‌’గా ఇండియన్‌ ఉమెన్‌ పీస్‌కీపర్స్‌ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్‌లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు.
కాస్త వెనక్కి వెళితే... కిరణ్‌ బేడీ, మేజర్‌ సుమన్‌ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top