
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్‌తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్‌గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.
పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్‌లతో ఎరుపు రంగు, బీట్‌రూట్‌తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు.
మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.
పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్‌గా మారిపోతుంది.
ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.
మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చు
గోధుమరంగు
గోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.
నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు.
అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది.
ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు.
వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.
కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది.
గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు.
కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.
గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు.
బీట్ రూట్‌ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment