Anamika Haksar: ఆమె చూపిన అధోజగత్తు..

ghode ko jalebi khilane le ja riya hoon director Anamika Haksar Interview - Sakshi

‘ఘోడే కో జలేబి ఖిలానే లేజా రియా హూ’ సినిమా జూన్‌ 10న రిలీజైంది.
దీని అర్థం ‘గుర్రానికి జిలేబీ తినిపించడానికి తీసుకెళుతున్నా’.
పాత ఢిల్లీ అధోజగత్‌ జీవులపై తీసిన ఈ సినిమా అంతర్జాతీయ ఖ్యాతి పొంది
‘సండాన్స్‌ ఫెస్టివల్‌’లో ఏకైక భారతీయ ఎంట్రీగా ఎంపికైంది.
వందల కోట్లు ఖర్చు పెట్టి అధివాస్తవిక కథలను తీస్తున్న ఈ రోజుల్లో
అతి తక్కువ ఖర్చుతో తీసిన గొప్ప వాస్తవ సినిమాగా
దీనిని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు.
దర్శకురాలు అనామిక హక్సర్‌ ఏడేళ్ల పాటు
పరిశోధన చేసి ఈ సినిమా ఎందుకు తీసింది?
అంత గొప్ప దర్శకురాలిగా ఎలా మారింది? 

‘మురికివాడల జనులు’, ‘అధోజగత్‌ జీవులు’ మళ్లీ భారతీయ సినిమా మీద కనిపిస్తున్నారు. కథలో పాత్రలు అవుతున్నారు. ఇటీవలే నాగపూర్‌ మురికివాడల మీద ‘ఝుండ్‌’ సినిమా వచ్చింది. ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ నటించాడు. దానికి ముందు ‘గల్లీబాయ్‌’లో రణ్‌వీర్‌ సింగ్‌ నటించాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ అందరికీ తెలిసిందే. దీనంతటిని మొదట మీరా నాయర్‌ ‘సలాం బాంబే’తో మొదలుపెట్టింది. ఆమె ఆ సినిమా తీసేంత వరకూ మురికివాడలనేవి ఎంత ఘోరంగా ఉంటాయో వాటిలోని మనుషుల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రేక్షకులకు తెలియదు.

నిజానికి ఆ కథలు, గాథలు అనంతం. కాని కమర్షియల్‌ సినిమాకు అది ‘లాభసాటి’ బేరం కాదు. అందుకని గొప్ప గొప్ప దర్శకులు కూడా ఆ వైపు చూడరు. కాని ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు వారి జీవితాల్లో కెమెరాను పెడదామనుకుంటారు. వారి ఆక్రందనల ఎదుట మైక్రోఫోన్‌ను ఉంచుదామనుకుంటారు. అప్పుడు ఆ చేదు వాస్తవానికి ప్రపంచం ఉలిక్కి పడుతుంది. ఒక పెద్ద ప్రపంచం తమకు సంబంధం లేకుండా బతుకుతుందని తెలుసుకుంటుంది. తాజాగా అనామిక హక్సర్‌ ఈ పని చేసింది.
ఘోడే కో జలేబి ఖిలానే లేజారియా హూ...
గుర్రానికి గడ్డి పెడతారు ఎవరైనా. జిలేబీ పెడతారా? ఇప్పుడు పాత ఢిల్లీగా అందరూ పిలుస్తున్న నగరం పేరు ‘షాజహానాబాద్‌’. ఎప్పుడో షాజహాన్‌ ఈ నగరాన్ని నాలుగు గోడల మధ్య నిర్మించాడు. కాని ఇప్పుడు ఇక్కడ అన్ని మతాల వాళ్లు, అన్ని వర్గాల వాళ్లూ జీవిస్తుంటారు. అందరూ నిరుపేదలు. కూలీలు. చిల్లర బేరగాళ్లు. బిచ్చగాళ్లు. పిక్‌పాకెటర్లు. మురికివాడల జనులు. దర్శకురాలు అనామిక హక్సర్‌ది కూడా పాత ఢిల్లీయే. వాళ్ల ఇంటి దగ్గర ఒక జట్కా ఉండేది.

ఆ జట్కావాడు ఆదరాబాదరా గుర్రాన్ని తీసుకుపోతుంటే అనామిక హక్సర్‌ ‘ఏంటి అంత కొంపలు మునిగేంతగా గుర్రాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నావు?’ అనడిగితే ఆ జట్కావాడు వ్యంగ్యంగా ‘జలేబీ తినిపించడానికి’ అని సమాధానం ఇచ్చాడు. తాత్పర్యం ఏమింటంటే ‘పిర్ర గీరుకోవడానికి టైము లేదు. పరిగెత్తి పోయి పనులు చేయకపోతే కడుపెలా నిండుతుంది’ అని. నేటికీ పాత ఢిల్లీలో ఎవరికీ తల గీరుకోవడానికి కూడా టైమ్‌ ఉండదు. ఉదయం లేస్తే బతుకుబాదరబందీ కోసం పరుగులెట్టాల్సిందే. కష్టపడో, మోసం చేసో బతకాల్సిందే. అందుకే అదే టైటిల్‌ పెట్టి సినిమా తీసింది అనామిక హక్సర్‌.
నాలుగు పాత్రల కథ
ఈ సినిమాలో నాలుగు పాత్రలు ఉంటాయి. ఒకడు పిక్‌పాకెటర్‌. ఒకడు టూరిస్ట్‌ గైడ్‌. ఒకడు కచోరీవాలా (కచోరీలు అమ్మేవాడు). ఒకడు హమాలీ. ఈ నలుగురి జీవితాలు, వీరి చుట్టూ ఉండే అనేకానేకమంది జీవితాలు... వారి కోరికలు, కలలు, ఆరాటలు, దిగుళ్లు, సాహసాలు, వ్యంగ్యం, హాస్యం... వీటన్నింటిని రక్తమాంసాలతో పట్టుకోవాలని నిశ్చయించుకుంది అనామిక హక్సర్‌. అందుకే మూడు నాలుగేళ్ల పాటు మనుషుల్ని స్టడీ చేయడమే పనిగా పెట్టుకుంది.

కథ జరిగేది పాత ఢిల్లీ కాబట్టి అక్కడ ఎక్కువగా ఉర్దూ మాట్లాడతారు కాబట్టి సినిమా అంతా ఉర్దూ సంభాషణలు ఉంటాయి. కథనం నేరుగా సినిమా కథనంలాగా ఉండదు. సన్నివేశాలు, మధ్యలో డాక్యుమెంటరీల్లా ఇంటర్వ్యూలు, సింబాలిజం, సర్రియలిజం... ఇవన్నీ ఉంటాయి. ఒక విధంగా ఇది ‘మేజిక్‌ రియలిజం’లో చెప్పిన సినిమా. ప్రేక్షకులు రకరకాల మీడియమ్స్‌ ద్వారా కథను అర్థం చేసుకుంటారు. ఇంత సంక్లిష్టమైన నేరేషన్‌తో సినిమాను చెప్పినా గొప్ప సహానుభూతిని సాధించడం ద్వారా అనామిక హక్సర్‌ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విదేశీ పత్రికలు ఈ సినిమాపై గొప్ప రివ్యూలు రాశాయి.
రెండు దారులు
ఈ సినిమాలో టూరిస్ట్‌ గైడ్‌ రోజూ విదేశీ టూరిస్ట్‌లను పాత ఢిల్లీలో ‘హెరిటేజ్‌ వాక్‌’ చేయిస్తుంటాడు. అంటే మొఘల్‌ కట్టడాల గొప్పదనం చూపిస్తుంటాడు. కాని ఒకరోజు కథలోని పిక్‌పాకెటర్‌ తాను ‘రియల్‌ వాక్‌’ చేద్దామనుకుంటాడు. అంటే టూరిస్ట్‌ గైడ్‌ హెరిటేజ్‌ వాక్‌ చేస్తుంటే పిక్‌ పాకెటర్‌ అసలైన పాతఢిల్లీలోని పాత్రల మధ్య తన వాక్‌ కొనసాగిస్తాడు.

అంటే ఏకకాలంలో ‘మా తాతలు నేతులు తాగారు’ భావన, అదే సమయంలో ‘పట్టెడు మెతుకులు లేని స్థితి’ని పక్కపక్కనే చూస్తారు ప్రేక్షకులు.
‘మనుషులంతా తాము బాగుండాలని అనుకుంటారు. కొద్దోగొప్పో బాగుండాలని. చిన్న చిన్న కలలు కంటారు. కాని అవేవీ తీరని వారు ఎలాగోలా తమ బతుకును అలంకరించుకోవడానికి పెనుగులాడతారు. ఆ విషయాన్నే ఈ సినిమా చెబుతుంది’ అంటుంది అనామిక హక్సర్‌.
అతి తక్కువ చోట్ల ఈ సినిమా ఆడుతోంది. కాని త్వరలో ఓటిటిలో వస్తేనే అందరూ చూడగలరు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top