What Is Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు.. ఫిట్స్‌కి కారణాలివే!

Epilepsy: Causes, Symptoms, Diagnosis and  Treatment - Sakshi

సాక్షి, గుంటూరు: ఫిట్స్‌ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్‌ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్‌ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.   

మూర్చ అంటే (ఫిట్స్‌).. 
మెదడులో ఉన్న న్యూరాన్‌లలో విద్యుత్‌ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్‌  లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్‌ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్‌ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు.  

కారణాలు..  
మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్‌ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్‌ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌ల వల్ల ఫిట్స్‌ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.   

జిల్లాలో బాధితులు..   
గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద  ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్‌ సమస్యతో చికిత్స పొందుతున్నారు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top