బాలికల నెత్తిన బరువు | Documentary No Water Land Directed Soumitra Singh Child-Water Scarcity | Sakshi
Sakshi News home page

Documentary Film: బాలికల నెత్తిన బరువు

Aug 20 2022 10:47 AM | Updated on Aug 20 2022 10:53 AM

Documentary No Water Land Directed Soumitra Singh Child-Water Scarcity - Sakshi

‘నో వాటర్‌ ల్యాండ్‌’ ఇది త్వరలో రాబోతున్న డాక్యుమెంటరీ. మహారాష్ట్రలో నీళ్లు లేని ప్రాంతాలలో బాలికల జీవితం నీళ్లు మోయడంలోనే ఎలా గడిచిపోతున్నదో ఈ డాక్యుమెంటరీ తెలియచేయనుంది. యు.కెలోని స్వచ్ఛంద సంస్థ ‘వెల్స్‌ ఆన్‌ వీల్స్‌’ స్థాపకుడు షాజ్‌ మెమొన్‌ దీనిని నిర్మిస్తుండగా అవార్డ్‌ విన్నింగ్‌ దర్శకుడు సౌమిత్రా సింగ్‌ దర్శకత్వం వహించాడు. నీళ్లు బాలికల బాల్యాన్ని మన దేశంలోని చాలా చోట్లఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది.

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో దందిచి బరి అనే చిన్న గ్రామం ఉంది. దానికి ‘భార్యలు పారిపోయే ఊరు’ అనే పేరు ఉంది. ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన వారు రెండో రోజున, మూడో రోజున పుట్టింటికి పారిపోతారు. దానికి కారణం ఆ ఊళ్లో నీళ్లు ఉండవు. దూరం వెళ్లి తేవాలి. మిట్టలు పల్లాలు ఎక్కి దిగాలి. గంటల తరబడి నీరు ఊరే వరకు ఆగాలి. ఆ తర్వాత మోయాలి. ఇవన్నీ చేయడం కంటే భర్త లేకుండా బతకడం మేలు అని ఆ ఊరి భార్యలు పారిపోతుంటారు. ఇప్పుడైతే ఆ ఊరికి పిల్లనిచ్చేవారు లేరు.

నాసిక్‌ జిల్లాలో నీటి సమస్య అంత తీవ్రం
దీని పొరుగునే ఉన్న మరో జిల్లా థానేలో దింగన్‌మల్‌ అనే గ్రామం ఉంది. దీనికి ‘బహు భార్యల ఊరు’ అనే పేరు ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్క మగాడు ఇద్దరు లేక ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. ఒకరు వంట చేసేందుకు, ఒకరు నీళ్లు మోసేందుకు. ఎందుకంటే ఆ ఊరి నుంచి నీరు తెచ్చుకోవడానికి రోజులో ఆరు గంటలు వెచ్చించాలి. అంతసేపు నీళ్లకే పోతే వంటా గింటా జరిగే చాన్సు లేదు. అందుకని ‘నీటి భార్యలు’ ఇక్కడ ప్రతి ఇంటా ఉంటారు. పెద్ద భార్యే వెతికి ‘నీటి భార్య’ను తెస్తుంది. భర్త తనకు పోషించే శక్తి లేకపోయినా ఇద్దరిని కట్టుకోవాల్సిందే. లేకుంటే బతకడం కష్టం.

పెద్దలకే ఇన్ని కష్టాలు ఉంటే మరి ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? మహారాష్ట్రలో నీటి కరువు ఉన్న అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య బాధిస్తున్నది బాలికలనే. భర్త సంపాదించడానికి వెళ్లాలి కాబట్టి కొడుకులు బాగా చదువుకోవాలి కాబట్టి నీటి బాధ్యత వారికి ఉండవు. తల్లి కాని కుమార్తెగాని నీరు మోయాలి. ‘బడికి వెళ్లి చదువుకోవాలనే మా కలలు కల్లలే అవుతున్నాయి’ అని అక్కడి ఆడపిల్లలు అంటారు. స్కూళ్లలో పేర్లు నమోదు చేసుకున్నా వీరు రోజూ స్కూలుకి వెళ్లడం సాధ్యం కాదు. అరగంట దూరంలో ఉండే బావి నుంచి ఒక బిందెను మోసుకు వస్తారు. అలా నాలుగు బిందెలు తేవాలంటే రెండు గంటల సమయం గడిచిపోతుంది. ఆరు బిందెలకు మూడు గంటలు.

నిత్య నరకం
7 సంవత్సరాల బాలికల నుంచి 18 సంవత్సరాల యువతుల వరకు ఈ నీటి మోతకు బానిసలుగా మార్చబడతారు. తల్లిదండ్రులకు వేరే మార్గం కూడా ఉండదు. ముఖ్యంగా వేసవిలో బాలికల కష్టాలు చెప్పనలవి కావు. ‘తల మీద మోయడం వల్ల తల దిమ్ముగా ఉంటుంది. భుజాలు నొప్పి పెడతాయి. ఛాతీలో బరువు. కాళ్లు లాగుతాయి’ అని ఇక్కడి ఆడపిల్లలు చెబుతారు. వేసవిలో ఈ ప్రాంతంలో 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ‘ఆ ఎండలో వెళ్లి నీళ్లు తేవాలంటే చాలాసార్లు ఆడపిల్లలు స్పృహ తప్పి పడిపోతుంటారు. హాస్పిటల్‌లో చేరిస్తే అదో ఖర్చు’ అని తల్లిదండ్రులు వాపోతుంటారు. ఏ సంవత్సరం తీసుకున్నా కనీసం 2000 మంది ఆడపిల్లలు మహారాష్ట్రలో నీళ్లు లేని జిల్లాల్లో స్కూళ్లకు నాగా పెడుతుంటారు. వీరి చదువు ఇలా ఒడిదుడుకుల్లో పడటం వీరి భవిష్యత్తుగా పెద్ద విఘాతంగా మారుతోంది.

డాక్యుమెంటరీ
అయితే తను ఒక్కడే ఈ పని చేస్తే నీటి సమస్య తీరదు. దేశంలో ఎక్కడెక్కడ నీళ్ల వల్ల ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ గుర్తించి తరుణోపాయాలు ఆలోచించాలని పిలుపునిస్తాడు షాజ్‌. అందుకే ‘నో వాటర్‌ ల్యాండ్‌’ అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. దీనికి గతంలో నసీరుద్దీన్‌ షాతో షార్ట్‌ ఫిల్మ్‌ తీసి అవార్డు పొందిన సౌమిత్రా సింగ్‌ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది.   l

వెల్స్‌ ఆన్‌ వీల్స్‌
యు.కెలో డెంటల్‌ రంగంలో పని చేస్తున్న వ్యాపారవేత్త షాజ్‌ మెమెన్‌ మహారాష్ట్రలో బాలికల నీటి కష్టాలను తగ్గించి వారిని చదువుకు దగ్గర చేర్చాలని నిశ్చయించుకున్నాను. ‘నాకు కూతురు పుట్టాక హటాత్తుగా నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. నా కూతురు ఉదయాన్నే లేచి నీళ్లకోసం కష్టపడాల్సిన పని లేదు. నేరుగా స్కూల్‌కి వెళ్లిపోయేంత నీటి సౌకర్యం ఇక్కడ ఉంది. కాని భారత్‌లో అలా కాదు. ఆడపిల్లలు నీటి బరువు కింద నలిగిపోతున్నాడు.

వారి కోసం ‘వెల్స్‌ ఆన్‌ వీల్స్‌’ అనే సంస్థను స్థాపించాను’ అంటాడు షాజ్‌ మెమెన్‌. ఇతను నేల మీద దొర్లించుకుంటూ (లాక్కుంటూ) వచ్చే నీళ్ల డ్రమ్ముల సరఫరా మహారాష్ట్రలో మొదలెట్టాడు. ఒక్కో డ్రమ్ములో 45 లీటర్ల నీళ్లు పడతాయి. హై క్వాలిటీ ప్లాస్టిక్‌ డ్రమ్ములు కనుక (అవి 7000 కిలోమీటర్ల దూరం లాగినా పాడు కావు) వీటిని సులువుగా లాక్కుంటూ రావచ్చు. మూడు బిందెల నీళ్లు ఈ ఒక్క డ్రమ్ములో పడతాయి కనుక మూడు ట్రిప్పుల కాలం మిగిలి ఆడపిల్లలు ఇప్పుడు స్కూళ్లకు వెళుతున్నారు. నాసిక్‌లోని ఐదు ఊళ్లలో వెల్స్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో నీళ్ల డ్రమ్ముల సరఫరా జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement