Community Gardening: రోజుకు 16 గ్రాముల పీచు తీసుకుంటున్నారు! ఒక్క గ్రాము పెరిగినా..

Community Gardening Benefits: University Of Colorado Boulder Research - Sakshi

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నలుగురితో చేయీ చేయీ కలిపి ఉమ్మడిగా సేంద్రియ కూరగాయ పంటలు పండించుకోవటం కన్నా కొత్త సంవత్సరంలో అమలు చేయదగిన ఆరోగ్యదాయక తీర్మానం మరొకటి ఉండబోదు.

కమ్యూనిటీ గార్డెనింగ్‌.. ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌ నిర్వహించిన ఓ శాస్త్రీయ అధ్యయనం శాస్త్రీయతను విడమర్చింది. ఈ దిశగా జరిగిన తొట్టతొలి రాండమైజ్డ్, కంట్రోల్డ్‌ స్టడీ ఇది. దీనికి అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ నిధుల్ని సమకూర్చింది. ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ జర్నల్‌లో జనవరి 4న ప్రచురితమైన ఈ స్టడీ ఆసక్తి రేపుతోంది. 

తిరుగులేని సాక్ష్యాలు
డయాబెటిస్, క్యాన్సర్‌ వంటి జీవనశైలి వ్యాధులతోపాటు, మానసిక సమస్యలను ప్రభావశీలంగా నివారించే శక్తి కమ్యూనిటీ గార్డెనింగ్‌కు ఉందనడానికి ఈ అధ్యయన ఫలితాలు తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ జిల్‌ లిట్‌ వ్యాఖ్యానించారు. కొలరాడో యూనివర్సిటీ బౌల్డర్‌లో పర్యావరణ అధ్యయనాల శాఖ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేస్తున్నారు.

డెన్వర్‌ ప్రాంతానికి చెందిన 291 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో ఎవరికీ గతంలో కమ్యూనిటీ గార్డెనింగ్‌ చేసిన అనుభవం లేదు. సగటు వయసు 41 ఏళ్లు. సగం మంది అల్పాదాయ వర్గాల వారు. 145 మందిని ‘ఎ’ గ్రూప్‌గా, 146 మందిని ‘బి’ గ్రూప్‌గా విడదీశారు. ‘ఎ’ గ్రూప్‌ వారికి ఒక ఏడాది తర్వాత గార్డెనింగ్‌ మొదలుపెడుదురు గాని అని చెప్పారు.

‘బి’ గ్రూప్‌ వారికి స్వచ్ఛంద సంస్థ డెన్వర్‌ అర్బన్‌ గార్డెన్స్‌ ద్వారా శిక్షణ ఇప్పించారు. డెన్వర్‌ ఏరియాలో ఒక స్థలం కేటాయించి, కూరగాయ విత్తనాలు, మొక్కలు ఇచ్చి, సామూహికంగా ఇంటిపంటలు సాగు చేయించారు. ఈ రెండు గ్రూపుల్లోని వారి శారీరక కొలతలు, ఆరోగ్య వివరాలు, మానసిక ఆరోగ్య స్థితిగతులు, ఎంత సేపు గార్డెనింగ్‌ చేస్తున్నారు, ఏమేమి తింటున్నారు.. వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారు. 

ఒక్క గ్రామైనా ప్రభావం ఎక్కువే
సగటున అమెరికావాసులు ఆహారం ద్వారా రోజుకు 16 గ్రాముల పీచు తీసుకుంటున్నారు. 25–38 గ్రాములు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొద్ది కాలం గడిచేసరికి.. కమ్యూనిటీ గార్డెనింగ్‌ చేస్తున్న ‘బి’ గ్రూప్‌ వారు ‘ఎ’ గ్రూప్‌ వారి కన్నా 1.4 గ్రాములు (7%) అధికంగా పీచుపదార్థం (కూరగాయలు, పండ్ల రూపంలో) తింటున్నారని తేలింది.

ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా
ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా శరీరంలో వాపు నివారణ, రోగనిరోధక శక్తి పెంపుదలపైన.. ఆహార శోషణ, పెద్దపేగుల్లోని సూక్ష్మజీవరాశి స్థితిగతులపైన ఎక్కువ ప్రభావం కనిపించిందని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినాలోని క్యాన్సర్‌ నివారణ–నియంత్రణ కార్యక్రమం సంచాలకుడు జేమ్స్‌ హెబెర్ట్‌ అన్నారు. వారానికి కనీసం 150 నిమిషాలైనా శారీరక శ్రమ చేయాలి.

పరివర్తన అమోఘం
అమెరికన్లలో 25% మంది మాత్రమే చేస్తున్నారు. కమ్యూనిటీ గార్డెనింగ్‌ చేస్తున్న ‘బి’ గ్రూప్‌ వారి శారీరక శ్రమ వారానికి 42 నిమిషాలు పెరిగింది. వీరిలో మానసిక ఆందోళన, వ్యాకులత గణనీయంగా తగ్గాయి. కమ్యూనిటీ గార్డెనింగ్‌ చేసేవారికి ఒనగూరే ప్రయోజనాలు ప్రతి సీజన్‌కూ పెరుగుతాయని ప్రొ. లిట్‌ భావిస్తున్నారు. 

ఈ ఫలితాలు డెన్వర్‌ అర్బన్‌ గార్డెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లిండా అప్పెల్‌ లిప్సియస్‌ను ఆశ్చర్యపరచలేదు. 43 ఏళ్లుగా ఏడాదికి 18 వేల మందికి కమ్యూనిటీ గార్డెనింగ్‌లో లిండా శిక్షణ ఇస్తుంటారు. ‘వీరిలో వచ్చిన పరివర్తన అమోఘం. కొందరిలో మార్పు ప్రాణ  రక్షణ  స్థాయిలోనూ ఉండొచ్చ’ని లిండా అంటున్నారు. 

‘కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎవరి ఇంట్లో వారు పెంచుకోవచ్చు. అయితే, ప్రకృతిలో ఆరుబయట నలుగురూ కలసి గార్డెనింగ్‌ పనిలో నెలల తరబడి భాగస్వాములు కావటం అద్భుత ఫలితాలనిస్తోంది. కూరగాయలు, పండ్ల వినియోగం పెరగడంతో పాటు తోటి వారితో సంబంధ బాంధవ్యాలు వికసించాయి. మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం చాలానే ఉంది.

దీని ప్రభావశీలతకు శాస్త్రీయ రుజువులు దొరికాయి’ అన్నారు ప్రొ. లిట్‌. కమ్యూనిటీ గార్డెన్ల బృహత్‌ బహుళ ప్రయోజనాలను గుర్తించడంలో వైద్యులు, విధాన నిర్ణేతలు, లాండ్‌ ప్లానర్లకు ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడతాయని ప్రొ. లిట్‌ సంతోషపడుతున్నారు. అర్థం ఏమిటంటే.. జీవనశైలి వ్యాధుల చికిత్సలో భాగంగా సామూహిక ఇంటిపంటల సాగును రోగులకు సీరియస్‌గా ప్రిస్క్రైబ్‌ చేసే రోజులు వచ్చేశాయి!
 – పంతంగి రాంబాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top