breaking news
Community Gardens
-
కమ్యూనిటీ గార్డెనింగే దివ్యౌషధం! తీసుకునే ఆహారంలో ఒక్క గ్రాము పీచు పెరిగినా..
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నలుగురితో చేయీ చేయీ కలిపి ఉమ్మడిగా సేంద్రియ కూరగాయ పంటలు పండించుకోవటం కన్నా కొత్త సంవత్సరంలో అమలు చేయదగిన ఆరోగ్యదాయక తీర్మానం మరొకటి ఉండబోదు. కమ్యూనిటీ గార్డెనింగ్.. ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ నిర్వహించిన ఓ శాస్త్రీయ అధ్యయనం శాస్త్రీయతను విడమర్చింది. ఈ దిశగా జరిగిన తొట్టతొలి రాండమైజ్డ్, కంట్రోల్డ్ స్టడీ ఇది. దీనికి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిధుల్ని సమకూర్చింది. ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్‌లో జనవరి 4న ప్రచురితమైన ఈ స్టడీ ఆసక్తి రేపుతోంది. తిరుగులేని సాక్ష్యాలు డయాబెటిస్, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులతోపాటు, మానసిక సమస్యలను ప్రభావశీలంగా నివారించే శక్తి కమ్యూనిటీ గార్డెనింగ్‌కు ఉందనడానికి ఈ అధ్యయన ఫలితాలు తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జిల్ లిట్ వ్యాఖ్యానించారు. కొలరాడో యూనివర్సిటీ బౌల్డర్‌లో పర్యావరణ అధ్యయనాల శాఖ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేస్తున్నారు. డెన్వర్ ప్రాంతానికి చెందిన 291 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో ఎవరికీ గతంలో కమ్యూనిటీ గార్డెనింగ్ చేసిన అనుభవం లేదు. సగటు వయసు 41 ఏళ్లు. సగం మంది అల్పాదాయ వర్గాల వారు. 145 మందిని ‘ఎ’ గ్రూప్‌గా, 146 మందిని ‘బి’ గ్రూప్‌గా విడదీశారు. ‘ఎ’ గ్రూప్ వారికి ఒక ఏడాది తర్వాత గార్డెనింగ్ మొదలుపెడుదురు గాని అని చెప్పారు. ‘బి’ గ్రూప్ వారికి స్వచ్ఛంద సంస్థ డెన్వర్ అర్బన్ గార్డెన్స్ ద్వారా శిక్షణ ఇప్పించారు. డెన్వర్ ఏరియాలో ఒక స్థలం కేటాయించి, కూరగాయ విత్తనాలు, మొక్కలు ఇచ్చి, సామూహికంగా ఇంటిపంటలు సాగు చేయించారు. ఈ రెండు గ్రూపుల్లోని వారి శారీరక కొలతలు, ఆరోగ్య వివరాలు, మానసిక ఆరోగ్య స్థితిగతులు, ఎంత సేపు గార్డెనింగ్ చేస్తున్నారు, ఏమేమి తింటున్నారు.. వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారు. ఒక్క గ్రామైనా ప్రభావం ఎక్కువే సగటున అమెరికావాసులు ఆహారం ద్వారా రోజుకు 16 గ్రాముల పీచు తీసుకుంటున్నారు. 25–38 గ్రాములు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొద్ది కాలం గడిచేసరికి.. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్న ‘బి’ గ్రూప్ వారు ‘ఎ’ గ్రూప్ వారి కన్నా 1.4 గ్రాములు (7%) అధికంగా పీచుపదార్థం (కూరగాయలు, పండ్ల రూపంలో) తింటున్నారని తేలింది. ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా శరీరంలో వాపు నివారణ, రోగనిరోధక శక్తి పెంపుదలపైన.. ఆహార శోషణ, పెద్దపేగుల్లోని సూక్ష్మజీవరాశి స్థితిగతులపైన ఎక్కువ ప్రభావం కనిపించిందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలోని క్యాన్సర్ నివారణ–నియంత్రణ కార్యక్రమం సంచాలకుడు జేమ్స్ హెబెర్ట్ అన్నారు. వారానికి కనీసం 150 నిమిషాలైనా శారీరక శ్రమ చేయాలి. పరివర్తన అమోఘం అమెరికన్లలో 25% మంది మాత్రమే చేస్తున్నారు. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్న ‘బి’ గ్రూప్ వారి శారీరక శ్రమ వారానికి 42 నిమిషాలు పెరిగింది. వీరిలో మానసిక ఆందోళన, వ్యాకులత గణనీయంగా తగ్గాయి. కమ్యూనిటీ గార్డెనింగ్ చేసేవారికి ఒనగూరే ప్రయోజనాలు ప్రతి సీజన్‌కూ పెరుగుతాయని ప్రొ. లిట్ భావిస్తున్నారు. ఈ ఫలితాలు డెన్వర్ అర్బన్ గార్డెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిండా అప్పెల్ లిప్సియస్ను ఆశ్చర్యపరచలేదు. 43 ఏళ్లుగా ఏడాదికి 18 వేల మందికి కమ్యూనిటీ గార్డెనింగ్‌లో లిండా శిక్షణ ఇస్తుంటారు. ‘వీరిలో వచ్చిన పరివర్తన అమోఘం. కొందరిలో మార్పు ప్రాణ రక్షణ స్థాయిలోనూ ఉండొచ్చ’ని లిండా అంటున్నారు. ‘కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎవరి ఇంట్లో వారు పెంచుకోవచ్చు. అయితే, ప్రకృతిలో ఆరుబయట నలుగురూ కలసి గార్డెనింగ్ పనిలో నెలల తరబడి భాగస్వాములు కావటం అద్భుత ఫలితాలనిస్తోంది. కూరగాయలు, పండ్ల వినియోగం పెరగడంతో పాటు తోటి వారితో సంబంధ బాంధవ్యాలు వికసించాయి. మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం చాలానే ఉంది. దీని ప్రభావశీలతకు శాస్త్రీయ రుజువులు దొరికాయి’ అన్నారు ప్రొ. లిట్. కమ్యూనిటీ గార్డెన్ల బృహత్ బహుళ ప్రయోజనాలను గుర్తించడంలో వైద్యులు, విధాన నిర్ణేతలు, లాండ్ ప్లానర్లకు ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడతాయని ప్రొ. లిట్ సంతోషపడుతున్నారు. అర్థం ఏమిటంటే.. జీవనశైలి వ్యాధుల చికిత్సలో భాగంగా సామూహిక ఇంటిపంటల సాగును రోగులకు సీరియస్‌గా ప్రిస్క్రైబ్ చేసే రోజులు వచ్చేశాయి! – పంతంగి రాంబాబు -
Omaha City: ఇంటి పంటలకు నెలవు
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది. ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా. తమదైన తాజా ఆహారంపై ఆసక్తి ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్టెన్షన్ ఆఫీస్‌లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్. సిటీ స్ప్రౌట్స్‌లో తొలి అడుగులు.. సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్‌లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్‌ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు. నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్‌గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com