చండీగఢ్‌ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ

Chandigarh Kare Aashiqui becomes the most-streamed content on OTT - Sakshi

‘నాకు కొడుకువైనా కూతురివైనా నువ్వే’ అని సాధారణంగా అంటూ ఉంటారు. కాని కొడుకు కూతురిగానో కూతురు కొడుకుగానో నిజంగా మారిపోతే? ‘దేవుడు తప్పు చేశాడు... ఆమె సరిదిద్దుకుంది’ అంటుంది ఈ సినిమాలో డాక్టర్‌. బాలీవుడ్‌లో విడుదలైన తాజా సినిమా ‘చండీగఢ్‌ కరే ఆషికీ’ (చండీగఢ్‌ ప్రేమ). ఇది ‘ట్రాన్స్‌ గర్ల్‌’ లవ్‌ స్టోరీ.

అమ్మాయిగా మారిపోయిన అబ్బాయి తన ప్రేమను గట్టి వ్యక్తిత్వంతో సాధించుకున్న కథ. ఇలాంటి కథకు సాహసం కావాలి. దీనిని చర్చకు పెట్టేందుకు మనసు కావాలి. జనవరి 7న ఓటిటిలో విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్‌షిప్‌ పొందిన ఈ సినిమా పరిచయం.

దేవుడు నిజంగానే ఒక్కోసారి తప్పు చేస్తాడు. అమ్మాయిని అబ్బాయిగానూ అబ్బాయిని అమ్మాయిగానూ పుట్టిస్తాడు. కాని లోక ఆచారం ప్రకారం ఒక్కసారి అబ్బాయిగా పుట్టాక చచ్చినట్టు అబ్బాయిగా బతకాల్సిందే. అమ్మాయిగా పుట్టాక అమ్మాయిగా జీవించాల్సిందే. ‘మా శరీరాలు తప్పుగా ఉన్నాయి. లోపల మా భావాలు వేరుగా ఉన్నాయి. మమ్మల్ని మాలాగా మేము కోరుకున్నలాగా మారనివ్వండి’ అనంటే సమాజం ఊరుకోదు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాని ట్రాన్స్‌జెండర్స్‌ ధైర్యంగా ముందుకు వస్తున్నారు.

తాము కోరుకున్న రూపాలను పొందుతున్నారు. తమ హక్కులను కోర్టులకు వెళ్లి సాధించుకుంటున్నారు. ఇప్పుడు తమ కలలను ఆకాంక్షలను కౌటుంబిక జీవనాన్ని కూడా సాధించే ప్రయత్నాల్లో పడుతున్నారు. అందుకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘చండీగఢ్‌ కరే ఆషికీ’ ఈ ప్రస్తావన చేస్తోంది. ఆ అంశంతో సినిమా గా ముందుకు వచ్చింది. నిజానికి సినిమా అంటే వ్యాపారం. ‘సెంటిమెంట్‌’ బెడిసి కొడితే అసలుకే ఎసరు వస్తుంది. కాని ఈ సినిమాలో చాలా సున్నితంగా గౌరవంతో సమస్యను చర్చించారు. అందుకే ప్రేక్షకులు కూడా గౌరవిస్తున్నారు.

ఏంటి కథ?
చండీగఢ్‌లో ఒక దివాలా తీసిన జిమ్‌ను నడుపుతుంటాడు ఆయుష్మాన్‌ ఖురానా. తను స్వయంగా బాడీ బిల్డర్‌ అయినా ప్రతి ఏటా చండీగఢ్‌లో జరిగే ‘బలసంపన్నుల పోటీ’లో ఛాంపియన్‌గా నిలువలేక నంబర్‌ 2లో వస్తున్నా అతని జిమ్‌కు గిరాకీ ఉండదు. ఆ సమయంలో వాణి కపూర్‌ ఆ జిమ్‌కు జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా వస్తుంది. ఆమె రాకతో జిమ్‌కు కళ వస్తుంది. అమ్మాయిలు చేరడంతో అబ్బాయిలూ రావడం మొదలెడతారు.

క్రమంగా ఆయుష్మాన్‌ ఖురానా, వాణి కపూర్‌ ప్రేమలోనూ ఆ తర్వాత శారీరక సంబంధంలోనూ వెళతారు. ‘ఇక మనం పెళ్లి చేసుకుందాం’ అంటాడు ఆయుష్మాన్‌. అప్పుడు వాణి కపూర్‌ అతి కష్టం మీద తానెవరో చెబుతుంది. ‘నేను అబ్బాయిగా పుట్టాను. అమ్మాయిగా మారాను. నేనొక ట్రాన్స్‌గర్ల్‌ని’ అంటుంది. ఆయుష్మాన్‌కు చాలా పెద్ద దెబ్బగా ఇది అనిపిస్తుంది. తనను వాణికపూర్‌ వంచించినట్టుగా భావిస్తాడు.

పైగా ‘సంప్రదాయ ఆలోచన’ ల ప్రకారం తాను సృష్టి విరుద్ధ శృంగారంలో పాల్గొన్నట్టుగా భావించి తనను తాను అసహ్యించుకుంటాడు. వాణికపూర్‌ను అవమానిస్తాడు. అతడిని మిత్రులు అవమానిస్తారు. ఊరు అవమానిస్తుంది. కాని ఆయుష్మాన్‌లో ఆమె పట్ల ప్రేమ పోదు. ఆమెకు అతని పట్ల కూడా. కాని ఇది ఓడిపోయే ప్రేమ కథ. ఇన్నాళ్లు విన్నటువంటి ప్రేమ కథ కూడా కాదు. చివరకు ప్రేమ గెలుస్తుంది.

నిజమైన శౌర్యం ఏమిటి?
సినిమాలో ఆయుష్మాన్‌ వెయిట్‌ లిఫ్టర్‌. తన శౌర్యం నిరూపించుకోవాలనుకుంటాడు. కాని నిజమైన శౌర్యం ఏమిటి? సమాజానికి వెరవకపోవడం... తన ప్రేమలోని నిజాయితీని స్వీకరించడం... వాణికపూర్‌ మారిన అస్తిత్వాన్ని గౌరవించడం. ‘నేను గవర్నమెంట్‌ స్కూల్లో చదివాను. తొందరగా ఇలాంటివి అర్థం కావు. టైమ్‌ పడుతుంది’ అంటాడు పశ్చాత్తాపంతో వాణికపూర్‌తో. అతనే కాదు... ట్రాన్స్‌జెండర్స్‌ విషయంలో కుటుంబాలు ఎంత కఠినంగా ఉంటాయో ఎన్నో ఉదంతాలు ఉంటాయి. 

సినిమాలో అబ్బాయిగా పుట్టిన వాణి కపూర్‌ సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారుతుంది. దీనిని తండ్రి అర్థం చేసుకుని యాక్సెప్ట్‌ చేస్తాడు కాని తల్లి అస్సలు సహించదు. చండీగఢ్‌లో ఆయుష్మాన్‌తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టాక స్నేహితురాలు ‘నువ్వు ఊరు విడిచి నాలుగురోజులు ఎటైనా పోరాదూ’ అంటుంది. దానికి వాణి కపూర్‌ ‘నా ఇంట్లో అవమానిస్తున్నారని ఇల్లు వదిలాను.

ఊళ్లో అవమానిస్తున్నారని నా ఊరైన అంబాలాను విడిచి పెట్టి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ అవమానిస్తున్నారని ఎక్కడకు వెళ్లాలి’ అంటుంది. ‘నా తప్పు ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి నన్ను నేను అమ్మాయిగా భావించాను. నాకిష్టం వచ్చినట్టు మారాను’ అంటుంది వాణి కపూర్‌. కుటుంబం, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఈ మానసిక శారీరక అవస్థనే. అందరూ పుట్టినట్టే ట్రాన్స్‌జెండర్స్‌ కూడా పుడతారు.

కాని వారిని హిజ్రాలంటూ గేలి చేసే దుర్మార్గ సంస్కృతి సమాజంలో ఉంది. వారు తాము కోరుకునే అస్థిత్వంతో ప్రేమ, వివాహం, జీవితం సోకాల్డ్‌ ‘నార్మల్‌’ వ్యక్తులతో పొందడానికి ఎన్నో అడ్డంకులు. భేషజాలు. అపోహలు. వాటన్నింటిని మెల్లగా దాటాలి అని చెబుతుంది ఈ సినిమా. ‘జెండర్‌ ఇన్‌క్లూజివిటీ’... అంటే అన్ని జెండర్‌ల వాళ్లను సమాజం అంతర్భాగం చేసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు.

దర్శకుడిదే ఘనత
ఈ సినిమా ఇంత సున్నితంగా, ఆలోచనాత్మకంగా, ఒప్పుకోలుగా ఉండటానికి కారణం దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ తీసిన పద్ధతి. దానికి హీరో హీరోయిన్లు సపోర్ట్‌ చేసిన పద్ధతి. ఈ సబ్జెక్ట్‌ చేయడం ఆయుష్మాన్‌కు సాహసం కాదు కాని వాణి కపూర్‌కు సాహసమే. తనను తాను ట్రాన్స్‌గర్ల్‌గా బిలీవ్‌ చేసి ఆ పాత్ర ఆత్మాభిమానం తాలూకు డిగ్నిటీని ప్రదర్శించింది ఆమె. మధ్య మధ్య చెణుకులతో ఈ సినిమా నవ్విస్తుంది. కాని ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకోమంటుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top