పిల్లలూ! ఆడవాళ్లు చేతులకు గాజులు వేసుకుంటారని తెలుసు కదా? మరి వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? గాజుల తయారీకి క్వార్ట్‌న్, ఇసుక, సోడా యాష్ వాడతారు. వీటిని గాజు స్వభావాన్ని బట్టి మిశ్రమంగా కలిపి యంత్రాల సాయంతో మెత్తనిపోడిగా చేస్తారు. ఈపోడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన జిగురులా మారుతుంది.
అంటుకునేలా ఉండే ఆ పదార్థాన్ని 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చల్లారుస్తారు. ఆ సమయంలో ‘మాంగనీస్ డై ఆక్సైడ్’ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి. మిశ్రమానికి స్వచ్ఛత వస్తుంది. ఇందులోనే కలరింగ్ ఏజెంట్స్‌ను కలపడం ద్వారా కావాల్సిన రంగులు వస్తాయి. చల్లార్చిన ఆ పదార్థాన్ని అచ్చుయంత్రాల సాయంతో కావాల్సిన మందం కలిగిన గాజులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత వాటికి మెరుగుపెట్టి, చమ్కీలు అద్దుతారు.


