Bangalore: టచ్‌ చేసి చూడు.. సజీవమైన నాటకం.. భిన్నమైన భావోద్వేగాలకు అద్దం పడుతూ..

Bangalore: Maraa Media And Arts Inspirational Plays Of Real Life - Sakshi

సామూహిక సమర స్వరం

ఇది కాలక్షేపమో... కామెడీ నాటకమో కాదు. వాస్తవజీవిత దృశ్యాలను కళ్లకు కట్టే నాటకం. ‘నాటక రంగంపై దృశ్య, అదృశ్య ప్రపంచాలు ఒకే దగ్గర కనిపిస్తాయి’ అంటారు. ఈ నాటకం చూస్తే అదెంత నిజమో అర్థమవుతుంది.... బెంగళూరులో ‘మరా’ అనే మీడియా అండ్‌ ఆర్ట్స్‌ సంస్థ ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ సంస్థ సభ్యులు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొద్దిమంది మహిళలను కలుసుకున్నారు.  ఈ మహిళలు లైంగిక హింస నుంచి కుల హింస వరకు రకరకాల హింస బాధితులు. వారి బాధలకు చూ కర్‌ దేఖో (టచ్‌ చేసి చూడు) పేరుతో నాటక రూపం ఇచ్చారు.

ఆ తరువాత...
‘బాధితుల స్వరాన్ని బాధితులే వినిపిస్తే ఎలా ఉంటుంది!’ అనే ఆలోచన చేశారు ‘మరా’ సభ్యులు.
 ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారి స్పందన ఎలా ఉంటుందో తెలియందేమీ కాదు.

‘రోజువారి కూలిపనులు చేసుకునేవాళ్లం. ఎప్పుడూ నటించింది లేదు’ అన్నారు వాళ్లలో చాలామంది. ‘ఎవరిలాగో కనిపించనక్కర్లేదు. నటించనక్కర్లేదు. మీరు మీరుగా కనిపిస్తే చాలు’ అని వారికి ధైర్యం చెప్పారు. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించారు.
అలా ‘మై యహా హు’ (నేను ఇక్కడ ఉన్నాను) నాటకానికి రూపకల్పన జరిగింది.

‘ఫ్రీదా థియేటర్‌ గ్రూప్‌’ బ్యానర్‌పై ఈ నాటకాన్ని తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో ప్రదర్శించారు. నాటకంలో సందర్భానికి అనుగుణంగా రకరకాల ప్రతీకలు వాడుకున్నారు. హృదయాన్ని కదిలించే సంగీతాన్ని వినిపించారు. అద్భుతమైన స్పందన వచ్చింది.

సజీవమైన నాటకంలో నటించడం అంటే మామూలు విషయం కాదు. ‘నాకు ఇలా అన్యాయం జరిగింది’ అని చెప్పుకునే సందర్భంలో మనసులోని దుఃఖనదులు కట్టలు తెంచుకోవచ్చు. కన్నీళ్లతో కళ్లు మసకబారవచ్చు. అందుకే ఇలాంటి నాటకంలో మనసును, శరీరాన్ని ఏకీకృతం చేసుకోవడం ముఖ్యం. ఈ విద్యలో పట్టు సాధించారు నాటకరంగ సభ్యులు.

నటబృందంలో పద్దెనిమిది నుంచి నలభైరెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఉన్నారు. వీరు రకరకాల హింస బాధితులు మాత్రమే కాదు పోలీస్‌ నుంచి వైద్యం వరకు రకరకాల వ్యవస్థ బాధితులు. కష్టకాలంలో స్నేహితులు, సొంత కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోని అభాగ్యులు.
కిందపడిన చోటు నుంచి తమకు తాముగా పైకి లేచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన శక్తిమంతులు.

‘మరా’ సభ్యురాలు అనుషీ అగర్వాల్‌ మాటల్లో చెప్పాలంటే ‘బాల్యం నుంచి యవ్వనం వరకు వివిధ దశలలోని భిన్నమైన భావోద్వేగాలకు ఈ నాటకం అద్దం పడుతుంది. ఇది బాధితుల ఉమ్మడి గొంతుక’

‘మరా’ ప్రతి సంవత్సరం ‘అక్టోబర్‌ జామ్‌’ పేరుతో ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో ‘మై యహా హూ’ నాటకాన్ని ప్రదర్శించారు.  ఈ నాటకం వల్ల ప్రేక్షకులకు బాధిత జీవితాలను కళ్లముందు చూసే అవకాశం దొరికింది. మరి ఇందులోని ఎనిమిది మంది కళాకారులకు?
వారి మాటల్లోనే చెప్పాలంటే... ‘నాటకం మాకు తిరుగులేని శక్తిని ఇచ్చింది’

‘ఇంతకు ముందు బాధితురాలిగా ఎంతోమంది ముందు కన్నీళ్లతో నిల్చున్నాను. ఎక్కడా న్యాయం జరగలేదు. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ఇప్పుడు మాత్రం బాధితురాలు, సర్వైవర్‌గా జనం ముందు నిల్చోలేదు. ఆత్మవిశ్వాసం ఉన్న కళాకారిణిగా నిలబడ్డాను. నా కోసం నాటకరంగం ఒక ద్వారాన్ని తెరిచే ఉంచింది. ధైర్యంగా మాట్లాడే గొంతును ఇచ్చింది’ అంటుంది నాటక బృందంలో ఒకరైన కషి. 

చదవండి: Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top