అంతరంగచిత్రం

Asha Radhika Interview with Sakshi Family

హంస ముఖంలో ముఖం పెట్టి మురిపెంగా చూస్తున్న అమ్మాయి.నెమలి పింఛాన్ని ఆసక్తిగా చూస్తున్న బుట్టగౌను పాపాయి.ఏనుగు తొండాన్ని ఆత్మీయంగా నిమురుతున్న యువతి.ప్రకృతి... పక్షులు... సరస్సులు... పువ్వులు కళ్ల ముందే.థీమ్‌ ఏదయినా సరే... ఓ అమ్మాయి రూపం తప్పనిసరి.ఆర్టిస్ట్‌ ఆషా రాధిక బొమ్మల్లో కనిపించే ఆర్ద్రత ఇది.

ఆషా రాధిక పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం అంతా హైదరాబాద్‌లోనే. ఆమె బొమ్మల్లో హైదరాబాద్‌ సంస్కృతితోపాటు హైదరాబాద్‌లో కనిపించని జీవనశైలి కూడా ద్యోతకమవుతుంటుంది. ఆమె 24 సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లు పెట్టారు. హైదరాబాద్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియంలో హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్‌ ఫోరమ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్ట్‌ ఆఫ్‌ ద హార్ట్‌’ చిత్రలేఖన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిత్రకళా ప్రస్థానాన్ని ‘సాక్షిఫ్యామిలీ’తో పంచుకున్నారు.

కుంచె నేర్పింది!
‘‘నాకు పెయింటింగ్‌ హాబీగా మారడానికి కారణం మా అమ్మనాన్న. అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది. దారంతో వస్త్రం మీద ఒక రూపం తీసుకురావాలంటే గంటల సేపు పని చేయాలి. బ్రష్‌తో అయితే నిమిషంలో వచ్చేస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టాను. స్కూల్‌లో కాంపిటీషన్‌లలో ప్రైజులు వస్తుంటే ఆ ఉత్సాహంతో మరికొన్ని బొమ్మలు వేసేదాన్ని. ఇక నాన్నగారు మహాసంప్రదాయవాది. ఆడపిల్లలు స్కూలుకి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇక దేనికీ బయటకు వెళ్లరాదన్నంత నియమం ఆయనది.

ఖాళీ సమయం అంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో పెయింటింగ్స్‌లో ప్రయోగాలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. అలా కుంచే నాకు గురువైంది. సెవెన్త్‌ క్లాస్‌లో సమ్మర్‌ కోచింగ్‌ తప్ప పెయింటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ ఏదీ లేకనే చాలా బొమ్మలు వేశాను. పెద్దయిన తర్వాత టెంపూరా ఆన్‌ పేపర్‌ కళను తెలుగు యూనివర్సిటీ, పెయింటింగ్‌ అండ్‌ స్కల్ప్చర్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ శ్రీనివాసాచారి గారి దగ్గర నేర్చుకున్నాను.

కాన్వాస్‌లాగానే మైండ్‌ కూడా
నా కుంచె గర్ల్‌ చైల్డ్‌ ప్రధానంగా జాలువారుతుంది. నేచర్, పక్షులు, పూలు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలను చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభావితమవుతాం. అయితే అది అనుకరణ కోసం కాదు. ఒక గమనింపు మనలో ఉంటుంది. ఆ చిత్రకారుల గీతను నిశితంగా గమనిస్తుంది మన మేధ. జగదీశ్‌ మిట్టల్‌ గారి కలెక్షన్స్‌లో 14వ శతాబ్దం నాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మీనియేచర్‌ ఆర్ట్‌ నా మెదడు మీద అలా ముద్రించుకుపోయింది.

రామ్‌కుమార్, ప్రభాకర్‌ కోల్టే వేసే ఆబ్‌స్ట్రాక్ట్‌లు చాలా ఇష్టం. ఎన్ని చిత్రాలను చూసి, ఎన్నింటి నుంచి స్ఫూర్తి పొందినా మన మెదడు కాన్వాస్‌ మీద తనకు తానుగా ఓ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నేను బొమ్మ వేయడానికి కాన్వాస్‌ ముందు కూర్చునేటప్పుడు ఫలానా రూపం రావాలనే ఆలోచన ఉండదు. కాన్వాస్‌లాగానే మెదడు కూడా క్లియర్‌గా ఉంటుంది. రంగులు ఒక్కొక్క లేయర్‌ వేస్తూ ఉంటే కొంత సేపటికి రూపం వస్తుంది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి తప్పనిసరిగా ఉంటుంది. ఇక థీమ్‌ అంటే ‘హర్‌ అబ్జర్వేషన్‌’ అని చెప్పవచ్చు.

ఒక అమ్మాయి ప్రకృతిని, తన పరిసరాలను గమనించడంతోపాటు మమేకం కావడం నా బొమ్మల్లో ఉంటుంది. ఒక అమ్మాయిగా బాల్యంలో నేను చూసినవి, ఊహించినవి, పెద్దయిన తర్వాత నా గమనింపుకు వచ్చినవి, ఒక అమ్మాయికి తల్లిగా ప్రేమానుబంధం నా బొమ్మల్లో ఆవిష్కారమవుతుంటుంది. ఇంట్లోనే ఆర్ట్‌ స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నాలుగు వేల బొమ్మలు వేసి ఉంటాను. సోలో ప్రదర్శనలను గుర్తు పెట్టుకుంటాను, కానీ గ్రూప్‌ ప్రదర్శనల లెక్క ప్రత్యేకంగా గణనలోకి తీసుకోలేదు. అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లోనూ నావి సోలో ప్రదర్శనలే. 

చిత్రలేఖనం పట్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ చదువు ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. ఎస్‌బీఐలో 1992లో ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు శంకరపల్లి బ్రాంచ్‌ మేనేజర్‌ని. ‘ఆర్ట్‌ ఆఫ్‌ ద హార్ట్‌’లో పాల్గొన్నాను. సోలో ఎగ్జిబిషన్‌లు 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 25వ ఎగ్జిబిషన్‌ నా చిత్రలేఖనం కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవాలనే ఆకాంక్షతో సిద్ధం చేస్తున్నాను’’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఆర్టిస్ట్‌ ఆషా రాధిక.

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top