ఇరవై రూపాయలు.. నిండు జీవితం | 20 rupees bribe case man fights 30 years for justice | Sakshi
Sakshi News home page

ఇరవై రూపాయలు.. నిండు జీవితం

May 3 2026 9:59 AM | Updated on May 3 2026 9:59 AM

20 rupees bribe case man fights 30 years for justice

ఇరవై రూపాయలు... మనం చేసే రోజువారీ ఖర్చులో తెలియకుండానే ఖర్చయిపోతుంది. కానీ, అదే ఇరవై రూపాయలు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. అవినీతిపరుడని ముద్ర వేసింది. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసింది. అయినా తట్టుకున్నాడు. న్యాయం కోసం కళ్లు కాయలు కాసేలా చూశాడు. ఏడాదో, రెండేళ్లో కాదు– ఏకంగా 30 ఏళ్లు. చివరికి ఫలితం వచ్చింది. ‘నేను ఏ తప్పు చేయలేదు’ అని  మొదటి నుంచి అతడు చెబుతున్నదే నిజమైంది. నిర్దోషిగా బయటపడాలనే అతని కోరిక తీరింది. కానీ∙ఆ సంతోషం, సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. తీర్పు వచ్చిన తెల్లారే అతని గుండె ఆగిపోయింది. అదే అతడికి చివరి రోజు అయింది. ఓ కానిస్టేబుల్‌ న్యాయపోరాటం కన్నీటి గాథగా మిగిలింది. 

బాబూభాయ్‌ ప్రజాపతి అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌. రూ.20 లంచం తీసుకున్నాడని అతనిపై ఆరోపణ. సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రజాపతి హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. సుమారు 22 ఏళ్ల పాటు అక్కడ కేసు నడిచింది. చివరికి తీర్పు వెలువడింది. హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 

అసలేం జరిగింది?
1996లో ఓ ట్రక్కు డ్రైవర్‌ ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్నారు. ట్రక్కు డ్రైవర్‌కు ఫినాల్ఫ్‌తేలీన్‌ పౌడర్‌ పూసిన నోట్లను ఇచ్చారు. ఆ నోట్లు ప్రజాపతి చేతిలో ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకున్నాడని కేసు నమోదు చేశారు. 

నాలుగేళ్లు జైలు శిక్ష
అహ్మదాబాద్‌ సెషన్స్‌ కోర్టులో 1997లో చార్జిషీట్‌ దాఖలైంది. కోర్టులో కేసు విచారణ జరిగింది. తనకేమీ తెలియదని, కేసులో అన్యాయంగా ఇరికించారని, బలవంతంగా తన చేతులో డబ్బులు పెట్టారని ప్రజాపతి వాపోయాడు. తనను నిర్దోషిగా ప్రకటించాలని కోర్టుకు విన్నవించాడు. వాదోపవాదాల తర్వాత ప్రజాపతిని కోర్టు దోషిగా నిర్ధారించింది. నాలుగేళ్లు కఠిన కారాగార శిక్ష, మూడువేలు జరిమానా విధించింది. 

హైకోర్టుకు అప్పీలు
సెషన్స్‌ కోర్టు తీర్పుపై ప్రజాపతి హైకోర్టులో అదే ఏడాది అప్పీలు చేశాడు. ఏళ్ల తరబడి పెండింగ్‌ తర్వాత కేసు విచారణ మొదలైంది. అప్పీలుదారు తరపు న్యాయవాది నితిన్‌ గాం«ధీ కేసు విశ్వసనీయత, సాక్షుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలపై పలు ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. 

నిర్దోషిగా తీర్పు
విచారణ సందర్భంగా కేసులోని పలు లోపాలను హైకోర్టు గుర్తించింది. డబ్బులు డిమాండ్‌ చేశారనే దానికి ఆధారాలు చూపలేదని పేర్కొంది. అభి యోగాలను ప్రాసిక్యూషన్‌ నిరూపించ లేదని ప్రజాపతిని నిర్దోషిగా ప్రకటిస్తూ కేసు కొట్టేసింది. 

సంతోషం..విషాదం
కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రజాపతి తన న్యాయవాది నితిన్‌ గాంధీని ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. నిర్దోషిగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై పడిన మచ్చ తొలగింది. ఇక ఆ దేవుడు పిలిచినా సంతోషంగా వెళతాను’ అన్నాడు. ఆ రోజు గడిచింది. కానీ ప్రజాపతికి అదే ఆఖరి రోజైంది. నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని, అది సహజ మరణ మని అతని న్యాయవాది వెల్లడించాడు. న్యాయం కోసం జీవితమంతా పోరాడాడు. గెలిచిన సంతోషం ఒక్కరోజే మిగిలింది. మరికొన్ని  రోజులైనా జీవిస్తే బాగుండేది. లేదా న్యాయం అయినా ముందే దక్కి ఉండాల్సిందని బంధువులు వ్యాఖ్యానించారు.

-దిలీప్‌ మాదిరెడ్డి 

Advertisement
 
Advertisement
Advertisement