దెందులూరు: ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో నకిలీ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ల పంపిణీ తీవ్ర దుమారం రేపింది. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమార్‌రాజు విచారణలో నకిలీ ఎంజాయిమెంట్ సర్టిఫికెట్లుగా నిర్ధారించారు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి.. మాదేపల్లిలో 41 ప్లాట్లు ఖాళీగా ఉండగా 2024 జూలైలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎస్.నాగమణి నకిలీ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ చేశారు. అధికారిక ఉత్తర్వులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు మంజూరు చేశారు. నాగమణి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చింది వాస్తవమని మాదేపల్లితో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న 21 మందికి ఇచ్చారని, వారిలో 12 మందిని గుర్తించామని తహసీల్దార్ విజయ్‌కుమార్‌రాజు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతుందని, పూర్తి నివేదిక కలెక్టర్‌కు అందిస్తామన్నారు. నాగమణి ఇచ్చిన మాన్యువల్ నకిలీ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు చెల్లవని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆన్‌లైన్‌లో ధ్రువీకరించిన బుక్‌లెట్ మాత్రమే చెల్లు తుందన్నారు. ఆ సమయంలో తహసీల్దార్‌గా నరసింహరావు విధుల్లో ఉన్నారని, తహసీల్దార్ ఉన్నప్పుడు డిప్యూటీ తహసీల్దార్ ఎంజాయ్‌మెంట్ సర్టి ఫికెట్లు ఇవ్వకూడదని జేసీ అభిషేక్ గౌడ అన్నారు.


