పెరిగిన ఉత్తీ ర్ణత శాతం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు మరోసారి నిరాశ తప్పలేదు. గత ఏడాది రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా ఈ ఏడాది సైతం అదే స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఉత్తీర్ణతా శాతం మాత్రం గత ఏడాది కంటే కొద్దిగా మెరుగవడడం ఆశాజనకం. కాగా ఈ ఏడాది ఫలితాల్లో సైతం బాలికలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలురకంటే ఎక్కువ మంది పరీక్షలు రాయగా వారికంటే ఎక్కువ మంది ఉత్తీర్ణులై సత్తా చాటారు. గత మార్చి 16 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకూ జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది.
ఈ ఏడాదీ బాలికలే టాప్..
ప్రతి ఏటా లానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలురకంటే అధిక ఉత్తీర్ణత శాతం సాధించి తమదే పైచేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది 85.62 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మొత్తం 22,585 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో బాలురు 10,884 మంది, బాలికలు 11701 మంది ఉన్నారు. బాలురలో 77.53 శాతంతో 8,438 మంది ఉత్తీర్ణులు కాగా బాలికల్లో 85.62 శాతంతో 10,017 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద జిల్లాలో 18455 మంది 81.72 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థినుల్లో పెదనిండ్రకొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సరెళ్ళ కీర్తన 591 మార్కులతో అగ్రస్థానంలో నిలువగా, ఏలూరు కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలకు చెందిన పోలరోతు కావ్య 587 మార్కులతో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం, గుండుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పర్వతం దుర్గా వెంకట హైమావతి 586 మార్కులతో జిల్లా స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది.
బెటర్‌మెంట్‌కు దరఖాస్తులు
ఈ పరీక్షల్లో ఆశించిన మార్కులు కంటే తక్కువ వచ్చిన వారు బెటర్‌మెంట్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. రీ కౌంటింగ్‌కు సబ్జెక్టు ఒక్కింటికి రూ.500,, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆయా ఫీజులు మే 1 నుంచి 7వ తేదీ లోగా చెల్లించాలన్నారు. కాగా అనుత్తీర్ణులైన విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకూ రూ.110, నాలుగు సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ అయితే రూ.125 చెల్లించాలన్నారు. అలాగే అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం మే 25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణతా శాతం గణనీయంగానే పెరిగింది. గడిచిన నాలుగు సంవత్సరాల ఫలితాలు గమనిస్తే 2022–23 సంవత్సరంలో 22259 మంది పరీక్షలు రాయగా 64.35 శాతంతో 14,323 మంది ఉత్తీర్ణులయ్యారు. 2023–24లో 23,163 మంది పరీక్షలు రాయగా 80.08 శాతంతో 18,549 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 2024–25 సంవత్సరంలో 22,365 మంది పరీక్షలు రాయగా 77.24 శాతంతో కేవలం 17,274 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది 4.47 శాతం మంది అదనంగా ఉత్తీర్ణులు కావడం ఆశాజనక ఫలితమనే చెప్పాలి.
టెన్త్ ఫలితాల్లో మరోసారి నిరాశే..
మొత్తం 18,455 మంది ఉత్తీర్ణత
81.72 శాతం ఉత్తీర్ణత శాతం
జిల్లాకు గతేడాదీ ఇదే స్థానం
25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు


