ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ రెండవ శనివారం, ఇంటర్మీడియెట్, పదోతరగతి విద్యార్థులకు సెలవులు కావడంతో వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. పలు భజన మండలి సభ్యులు ఆలయ ఆవరణలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరుల మదిని హత్తుకున్నాయి. సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది.
పెనుగొండ: అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంలో శశనివారం వాసవీ శాంతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి 102 అడుగుల రుషీ గోత్ర మందిరంలోని 92 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని దర్శించుకొని, మరకత శిల వాసవీ మాతకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం, యాగ శాలలో వాసవీ శాంతి హోమం వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు.


