కుక్కునూరు: రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాగుల నుంచి ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. అంతరాష్ట్ర సరిహద్దులను ఆసరా చేసుకుని తెలంగాణకు చెందిన ఇసుక మాఫియా ఆంధ్ర ప్రాంత ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు సరిహద్దు ప్రాంతంలోని సీతారాం నగరం గ్రామానికి ఆనుకుని ఉన్న కిన్నెరసాని వాగు పరిధి కొంతమేర ఆంధ్ర, కొంతమేర తెలంగాణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాగా తెలంగాణ పరిధిలోని సోంపల్లి గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్రం రెండు అధికారిక ర్యాంపులను కేటాయించింది. ఈ ర్యాంపుల మీదుగా ఇసుక తరలింపు జరుగుతుండగా దీన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కిన్నెరసాని వాగులోని పాసిరేవు వద్ద నుంచి ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నారు. కాగా పాసిరేవుకు ఇవతల ప్రాంతం ఆంధ్ర ప్రాంత పరిధిలో ఉంటుంది. అయితే ఆంధ్ర ప్రాంతం పరిధిలోకి వచ్చే ప్రాంతం నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
సరిహద్దులపై స్పష్టత కరువు
మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సరిహద్దులపై స్పష్టత లేకపోవడం, స్పష్టత వచ్చే దిశగా చర్యలు చేపట్టకపోవడం ఇసుక మాఫియాకు వరంలా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జీపీఎస్ యాప్ ఆధారంగా సీతారామ నగరం గ్రామం సరిహద్దులను బూర్గంపాడు పరిధిలో చూపిస్తుండడంతో ఇసుక మాఫియా అది తెలంగాణ ప్రాంతం అని చెప్పుకుంటూ మన ప్రాంత పరిధిలోని ఇసుకను తరలించుకుని సొమ్ము చేసుకుంటుంది.
కూటమి నాయకుల విమర్శలు
తమ మండలంలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని కూటమికి చెందిన నాయకులే ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి చూస్తే మండలంలో జరిగే ఇసుక అక్రమ దందా ఏ విధంగా ఉందనేది స్పష్టం అవుతుంది. అంతేకాక సీతారామ నగరం పరిధిలోని కిన్నెరసాని వాగులో ఆంధ్ర ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. దీంతో ఇసుక తరలింపులో అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


