రూ.360 ధర కల్పించాలి
ధరలతో ఆందోళన
బుట్టాయగూడెం : కోటి ఆశలతో పొగాకు పంట సా గు చేసిన రైతులకు ఈ ఏడాదీ నిరాశ తప్పేలా లేదు. గత మూడేళ్లుగా పెరిగిన భూమి కౌలు, పెట్టుబడులను సైతం లెక్కచెయ్యకుండా వర్జీనియా పొగాకు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోయినా చీడాపీడలు, తెగుళ్ల దాడులను తట్టుకుని మరీ సాగు చేశారు. పొగాకు రంగు, దిగుబడులు వచ్చే అవకాశం ఉందంటూ ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలో గతనెల 25న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో వర్జీనీయా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా మొదటిరోజు కిలో రూ.265 ధర పలకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కనీసం రూ.295కు కొనుగోలు చేయాలని రైతులు కోరినా పొగాకు కొనుగోలు కంపెనీలు, పొగాకు బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం దేవరపల్లిలోని ఐదు వేలం కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
49.32 మిలియన్ కిలోలకు అనుమతి
ఈ ఏడాది పొగాకు సీజన్‌కు సంబంధించి ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 49.32 మిలి యన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో సుమారు 80 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అను మతి ఇవ్వగా 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. అలాగే గతేడాది మార్కెట్‌లో కిలో ధర గరిష్టంగా రూ.453 పలికింది. అలాగే కనిష్టంగా రూ.250 పలకగా సగటున రూ.297.50 చొప్పున లభించింది. ఈ ఏడాది అన్ని పరిస్థితులను తట్టుకు ని పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశాభావంతో ఉన్నా ఇటీవల ప్రారంభమైన పొగాకు కొనుగోలులో కేవలం రూ.265 మాత్రమే ధర పలకడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొనుగోలు ప్రారంభమై 10 రోజులు దా టుతున్నా ధరల్లో మార్పు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
పొగాకుకు రూ.360 ధర కల్పి ంచి కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు అప్పుల పాలవ్వడం ఖాయం. ప్రస్తుత ధర రూ.265 ఇస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పొగాకు పంట కొనుగోలుపై ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవాలి. లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తాం.
– కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు
ఈ ఏడాది పంటలకు పెట్టుబడులు, ఖర్చులు బాగా పెరి గాయి. కౌలు ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలులో ధర చూస్తే భయమేస్తుంది. ఇలానే ధరలు కొనసాగితే నష్టాల పాలవుతాం. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం
బె‘ధర’గొడుతోంది
పొగాకు ధరలు చూసి నిరాశ
వేలం ప్రారంభమై పది రోజులు
పుంజుకోని వర్జీనియా ధరలు
బ్రైట్ గ్రేడ్ పొగాకు ధరకిలో రూ.265 మాత్రమే
సగటు ధర రూ.330 తగ్గితే నష్టం తప్పదంటున్న రైతులు
ప్రభుత్వం పట్టించుకోవాలని వినతి


