సంక్షోభంలో ఉప్పు సాగు | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ఉప్పు సాగు

Feb 16 2026 7:31 AM | Updated on Feb 16 2026 7:31 AM

సంక్ష

సంక్షోభంలో ఉప్పు సాగు

సాగుకు వదిలేస్తున్నారు

రేటు పెరగడం లేదు

నిరాశతో సాగుకు సమాయత్తం

తీరంలో కనిపించని ఒకప్పటి జోరు

200 ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం

నరసాపురం: జిల్లాలోని నరసాపురం తీరంలో ఈ ఏడాది ఉప్పు సాగు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఏడాది వరస ప్రకృతి విపత్తులు, అధిక వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది సాగుకు బ్రేక్‌ వేశారు. సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థిఽతి కొనసాగితే భవిష్యత్‌లో తీరంలో ఉప్పుసాగు కనిపించే పరిస్థితి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో ప్రస్తుతం తీర గ్రామాల్లో ఉప్పు సాగు ముమ్మరంగా ప్రారంభమైంది. నరసాపురంలో 19 కిలోమీటర్లు ఉన్న తీరప్రాంతంలో 200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వేములదీవి, తూర్పుతాళ్లు, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, కేపీపాలెం తదితర 8 గ్రామాల్లో ఉప్పుసాగు మొదలైంది.

గిట్టుబాటు ధరలేక..

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఉప్పుకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిల్లాడారు. తుపాన్‌లు, వర్షాల కారణంగా అసలు పంట దిగుబడి రావడమే తగ్గిపోవడంతో సాగు చేపట్టిన రైతులు అప్పులపాలయ్యారు. ప్రస్తుతం తీరంలో పండించే ఉప్పు బస్తా(50కిలోలు) రైతుల వద్ద దళారులు రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. కనీసం బస్తా రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కష్టపడి పంట పండించే రైతుకు ఏళ్ల తరబడి అదే ధర దక్కుతోంది.

ఏటేటా తగ్గుతున్న విస్తీర్ణం..

2022, 2023 సంవత్సరాల్లో తీరంలో 1500 ఎకరాల్లో ఉప్పు సాగు జరిగింది. ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 900 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఈ ఏడాది 200 ఎకరాలకు పడిపోయింది. తీరంలో ఉప్పుమడులు చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే తీరంలో దాదాపు 15 గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరిగేది.

రోజుల తరబడి కష్టం

ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ఒక్కసారి మడి కడితే దాదాపు ఆ మడి నుంచి 6 నెలల వరకూ ఉప్పు దిగుబడి వస్తూనే ఉంటుంది. దీంతో ఉప్పుసాగు లాభాలు తెచ్చిపెడుతుంది. వేసవి ప్రారంభంలో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉప్పుసాగు ప్రారంభం అవుతుంది. మండే ఎండల్లో చిన్న చిన్న మడులను ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది విపరీతంగా శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఎకరానికి పెట్టుబడి రూ.30 వేల వరకు ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రోజుకు 100 కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు.

గిడ్డంగుల సమస్యపై దృష్టి పెట్టని ప్రభుత్వం

ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు సదుపాయం పెద్ద సమస్య. ప్రభుత్వం గిడ్డంగులను నిర్మించాలనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. గిడ్డంగులు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు పండించిన ఉప్పును వాటిలో భద్రపరుచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అకస్మాత్తుగా వర్షాలు పడినా, తుఫాన్‌లు వంటి విపత్తులు వచ్చి పడినా ఉప్పు కుప్పలు ద్వంసమయిపోతాయి. రైతు కష్టం మొత్తం కరిగిపోతుంది.

అధికార పంటగా గుర్తింపు లేదు

ఉప్పు సాగుకు అధికార పంటగా ఇంతవరకూ గుర్తింపు లేదు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం రాదు. బీమా లాంటి సదుపాయాలు ఉండవు. ఉప్పుసాగును అధికార పంటగా గుర్తించాలని, మిగిలిన పంటలకు మాదిరిగా అందించే సదుపాయాలు కల్పించాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

ఎండలు ప్రారంభం కాగానే ఉప్పు సీజన్‌ మొదలవుతుంది. ఈ ఏడాది సాగుపై రైతులకు శ్రద్ధ లేదు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు పంట సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది సాగుకు స్వస్తి చెప్పారు. వరుసగా నష్టాలు రావడమే కారణం. గత ఏడాది తుఫాన్‌లు, వర్షాలతో పెట్టుబడులు కూడా రాలేదు. రైతులు అప్పుల పాలయ్యారు. ఒకప్పుడు తీరం అంతా ఉప్పుమడులతో కళకళలాడేది.

మైలా రాధాకృష్ణ, ఉప్పు రైతు, పీఎం లంక, నరసాపురం మండలం

50 కేజీల బస్తా రూ 200 పలుకుతోంది. దళారుల మా వద్ద కొన్న ధరకు బయట మార్కెట్‌లో ఉప్పు ధరకు సంబంధం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే ధర. గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోతే సాగు కష్టం. గిడ్డంగులు లేకపోవడం వల్ల వర్షాలు పడితే దళారులు అడిగినంతకు అమ్ముకోవాలి. ఉప్పు సాగు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి –మైలా శ్రీనివాస్‌,

పెదమైనవానిలంక, నరసాపురం మండలం

సంక్షోభంలో ఉప్పు సాగు1
1/4

సంక్షోభంలో ఉప్పు సాగు

సంక్షోభంలో ఉప్పు సాగు2
2/4

సంక్షోభంలో ఉప్పు సాగు

సంక్షోభంలో ఉప్పు సాగు3
3/4

సంక్షోభంలో ఉప్పు సాగు

సంక్షోభంలో ఉప్పు సాగు4
4/4

సంక్షోభంలో ఉప్పు సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement