మహాయజ్ఞానికి శ్రీకారం
● నేడు రాత్రి సుందరగిరిపై..
● క్రతువుకు పూర్తయిన ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలుగా తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయ యాగశాలలో యజ్ఞ క్రతువుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. ఆ తరువాత కలశ పూజ చేశారు. అలాగే పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో సహస్ర లింగార్చన, మహా లింగార్చన, మృత్తిక లింగాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో ఆదివారం రాత్రి నిర్వహించనున్న మహా యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది.


