మానవత నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్: అనేక మందికి సేవలు అందించిన ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఈ నెల 9న ఏలూరు నగరంలోని వసంతమహాల్ సెంటర్‌లోని ఆయన నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కార్యాలయం నుంచి ఒంటరిగా బైక్‌పై బయటకు వెళ్ళారు. ఆరు రోజుల అనంతరం ఆగిరిపల్లి ప్రాంతంలో పెద్ద చెరువులో విగతజీవిగా కనిపించారు. మానవత స్వచ్చంద సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తుండగా... ఆకస్మికంగా మృతిచెందటం ఏలూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శనివారపుపేట శాతవాహన నగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలపాటి నాగేశ్వరరావు ఉంటున్నారు. ఈనెల 9న ఉదయం 11గంటల సమయంలో వసంతమహాల్ సెంటర్‌లోని తాను నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం నుంచి బైక్‌పై బయటకు వచ్చారు. ఆ తరువాత ఆచూకీ దొరకలేదు. ఆయన భార్య టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టగా... నూజివీడు వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ఆచూకీ కనిపెట్టటం క్లిష్టంగా మారింది. గన్నవరం, ఆగిరిపల్లి మద్య ప్రాంతంలో బ్రహ్మలింగయ్య చెరువు వద్ద డ్రోన్లతో పరిశీలించగా ఆయన మోటారు సైకిల్‌ను గుర్తించారు. శనివారం చెరువు ప్రాంతం అంతా విస్తృతంగా గాలించగా తుప్పల వద్ద నాగేశ్వరరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


