ఆకివీడు చైర్‌పర్సన్‌కు అవమానం
ఆకివీడు: పట్టణ ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. బీసీ మహిళను అవమానపరిచారంటూ స్థానిక నగర పంచాయతీ చైర్‌పర్సన్ జామి హైమావతి ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక 13వ వార్డులోని శ్రీ నగర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు తనను పిలవగా, నిర్మాణ ప్రాంతానికి వచ్చేసరికి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గంధం ఉమ కొబ్బరికాయ కొట్టారని వాపోయారు. నా వార్డులో మీరు కొబ్బరికాయ కొట్టడమేమిటని ప్రశ్నించగా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ దురుసుగా మాట్లాడారని హైమావతి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, ప్రజాప్రతినిధిని లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించడం కూటమి నాయకుల దౌర్భాగ్యమన్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ మాట్లాడుతూ తన వార్డులో రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టననివ్వకుండా చైర్‌పర్సన్‌ను అవమాన పరచడం దారుణమన్నారు. స్థానికంగా సంబంధం లేని వ్యక్తులు వార్డుల్లోకి వచ్చి ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నగర పంచాయతీ చీప్ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి జగదీష్, గేదెల అప్పారావు, జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులు గుండా సుందర రామనాయుడు తదితరులు ఉన్నారు.


