లోక కల్యాణార్థం.. అతిరుద్ర మహాయజ్ఞం
నిడమర్రు: మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయితన క్షేత్రం నేటి నుంచి సుగంధ ద్రవ్య సువాసనలతో.. వేద మంత్రోచ్ఛారణతో మార్మోగనుంది. లోక కల్యాణార్థం హైదరాబాదుకు చెందిన ప్రవాస భారతీయుడు, వైదిక జ్యోతిష్య పరిశోధకుడు అక్కినప్రగడ శ్రీరాఘవేంద్రసాయి (ఇంగ్లాండ్) యజ్ఞ కర్తగా అతిరుద్ర మహాయజ్ఞం సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మందలపర్రు గ్రామ పెద్దలు తెలిపారు. అమెరికాలో స్థిరపడి, హిందూ ధార్మిక ప్రచారకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకట చాగంటి ఆశీస్సులతో ఈ యజ్ఞ, హోమాలు ఈనెల 28వ తేదీ వరకూ ప్రతి రోజూ 10 గంటల పాటు నిర్వహించనున్నారు. దీని కోసం పంచాయితన క్షేత్రం ప్రాంగణంలో ప్రత్యేక యాగ శాల నిర్మాణం చేశారు. తొలిరోజు సోమవారం 66 మంది వేదపండితులు ముందస్తు యజ్ఞ పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం ఉంటుందన్నారు. అనంతరం గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, ఋత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షణ, గో, ఆశ్వం, మేషం పూజలు నిర్వహిస్తామన్నారు. సూర్యోదయం మొదలుకొని.. సూర్యాస్తమయం వరకూ ప్రతి రోజు 10 గంటల పాటు ఈ యజ్ఞ క్రతువులు జరుగనున్నాయి. ఇంగ్లాండ్‌లో స్థిరపడినా స్వదేశమైన నా భారత దేశం సుభిక్షం ఆశించి మాత్రమే మందలపర్రు గ్రామస్తుల సహకారంతో ఈ అతిరుద్ర మహా యజ్ఞం సంకల్పించినట్లు యజ్ఞ కర్త రాఘవేంద్రశర్మ తెలిపారు.
108 రకాల సుంగధ ద్రవ్యాలతో..
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 108 రకాల సుంగధ ద్రవ్యాలు, వివిధ చెట్ల వేర్లు, మూలికలు ఆవు నెయ్యితో 250 కిలోల చూర్ణం గుళికలుగా చేసి ఈ యజ్ఞ పూజల్లో వినియోగించనున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన 750 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 350 కిలోల రావి సమిదలు (పుల్లలు) ఈ 7 రోజుల పాటు ఈ హోమంలో వేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 6 మంది ఋత్విజులు ఈ పూజల్లో పాల్గొననున్నారు.
హోమ వాయువు గాల్లో కలిసేలా..
అతిరుద్ర మహాయజ్ఞం పూజల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన యాగశాలను నిర్మించారు. ఈ హోమం నుంచి వచ్చే వాయువు గాల్లో కలసేలా యాగశాల నిర్మించారు. దీంతోపాటు ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ యాగశాల ప్రవేశ ద్వారాలుగా నాలుగు వేదాల పేర్లను నామకరణం చేశారు. ఈ యాగశాల లోపల వివిధ రకాలుగా 9 హోమకుండీలు నిర్మించి 66 మంది వేదపండితులు హోమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ముగింపు రోజున అన్ని కుండీల్లో ఏకకాలంలో పూర్ణాహుతి ఉంటుందని, ఆ వాయువుతో మనం పీల్చేగాలిలో కలసి స్వచ్ఛత ఏర్పడుతుందని యజ్ఞ కర్త రాఘవేంద్రశర్మ తెలిపారు.
మందలపర్రు పంచాయితన క్షేత్రంలో నేటి నుంచి యజ్ఞ హోమాలు
ఈనెల 28 వరకూ ప్రతి రోజూ 10 గంటల పాటు నిర్వహణ
వచ్చే భక్తులకు అన్న సమారాధన ఏర్పాట్లు
లోక కల్యాణార్థం.. అతిరుద్ర మహాయజ్ఞం
లోక కల్యాణార్థం.. అతిరుద్ర మహాయజ్ఞం


