13న జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ వివాదాల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,800 కేసులను రాజీయోగ్యమైనవిగా గుర్తించడం జరిగిందని, అలాగే 33 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులపై అదనపు పని భారం తగ్గించడానికి రెండో శనివారం ఈ నెల 13వ తేదీన పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం 220 పనిదినాలకు మించి పనిచేసిన పాఠశాలలకు మాత్రమే ఈ సెలవును అనుమతించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, ఫ్యాప్టో చైర్మన్ జీ.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–చైర్మన్ జీ. వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్.రవికుమార్, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి జే.రవీంద్ర, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): పట్టణ ఎస్‌హెచ్‌జీ కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.మాధవి గురువారం ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ రెడ్డి అటానమస్ కాలేజ్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, ఏలూరు మునిసిపాలిటీల నుంచి యువత హాజరుకానున్నారని, 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రెండవ రోజు గురువారం 327 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం జరిగిన పరీక్షకు 176 మందికి గాను 166 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నుంచి జరిగిన పరీక్షకు 174 మందికి గాను 161 మంది హాజరయ్యారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
‘పశ్చిమ’లో 91.98 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో అయిదు పరీక్షా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షకు 91.98 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ తెలిపారు. ఉదయం పరీక్షకు 506 మందికిగాను 466 మంది హాజరుకాగా, మధ్యాహ్నం పరీక్షకు 541 మందికి 497 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని డీఈవో తెలిపారు.
కై కలూరు: కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాయకులు బుసనబోయిన వెంకటేశ్వరరావు(బీవీ రావు), దాసరి అబ్రహం లింకన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురు నేతలను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.


