అంగన్‌వాడీల పోరుబాట
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు పోరు బాట పట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో ఏలూరు కలెక్టరేట్, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో మరోసారి తమ గొంతు వినిపించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 12న ఏలూరు కలెక్టరేట్ వద్ద మూడు కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతున్నారు. అంగన్‌వాడీల జీతాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలని, ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్‌లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ఎన్నికల ముందు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా వాటి ఊసే ఎత్తడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్‌వాడీలకు అమ్మకు వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్(ముఖ గుర్తింపు) విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు.
టేక్ హోం రేషన్‌కు రిజిస్ట్రేషన్ మెలిక
కూటమి ప్రభుత్వం టేక్ హోం రేషన్‌కు రిజిస్ట్రేషన్ మెలిక పెట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా టేక్ హోమ్ రేషన్(టీహెచ్‌ఆర్) సేవలు పొందాలటే ఎఫ్‌ఆర్‌ఎస్ ముఖ గుర్తింపు యాప్ తప్పని చేశారు. యాప్‌లో రిజిస్టర్ కాకుంటే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ నెల ఒకటో తేదీనుంచే దీనిని అమలు చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
జీతాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలని డిమాండ్
ఎఫ్‌ఆర్‌సీని రద్దు చేయాలంటూ ఆందోళన
నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా


