నేత్రపర్వం.. శోభనాచలుడి చక్రస్నానం
ఆగిరిపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆగిరిపల్లిలోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వరాహ పుష్కరిణిలో శోభనాచలునికి చక్రస్నానం కనుల పండువగా నిర్వహించారు. బుధవారం వరాహ పుష్కరిణి వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి ముందుగా వేద పారాయణం, అవబృదోత్సవం నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య ఉత్సవమూర్తులను వరాహ పుష్కరిణిలో అభిషేకించి చక్రస్నాన ఘట్టాన్ని నయనానందకరంగా నిర్వహించారు. అనంతరం భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. సాయంత్రం ఏడు గంటలకు ఆలయంలో స్వామివారికి మౌనబలి, ధ్వజారోహణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. శోభనగిరి మెట్లమీద కొండపై నుంచి దిగువ వరకు భక్తులు దీపాలు వెలిగించి కృత్తిక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి పర్యవేక్షించారు.


