నీటమునిగిన పంటలు
మరో పది రోజుల్లో వరికోతలు జరగనున్న నేపథ్యంలో పొలాల్లోకి నీరు చేరడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. భీమడోలు, దెందులూరు, చింతలపూడి అనేకచోట్ల వరిచేలు నీటమునిగాయి. 2239 ఎకరాల వరిచేలల్లోకి నీరు చేరాయని, మినుము, ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 46 చెట్లు నేలకొరగగా, వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించారు.
కొల్లేరు, ఉప్పుటేరులో ప్రమాదకర స్థాయిలో నీరు చేరింది. 64 ప్రధాన కాల్వల నుంచి కొల్లేరుకు ఉద్ధృతంగా నీరు చేరడంతో నిండుకుండలా మారింది. పెదయడ్లగాడి వంతెన సమీపంలోని పెనమాకలంక రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. కలిదిండి మండలంలో కోరుకొల్లు, ఎస్‌ఆర్‌పీ అగ్రహారం, గుర్వాయిపాలెం, ముదినేపల్లి మండలంలో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మరోవైపు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో తుపాను పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మోంథా తుపాను ప్రభావంతో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బుధవారం సైతం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకూ డిజాస్టర్ సెలవుగా ప్రకటించినట్టు స్పష్టం చేశారు. ఉత్తర్వులు మీరి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


