అధికారుల వివక్షపై దళిత సర్పంచ్ ధర్నా
ముసునూరు: తనపై పంచాయతీ అధికారులు వివక్ష చూపుతున్నారని, తనకు న్యాయం చేయాలని దళిత సర్పంచ్ గ్రామస్తులతో సహ ఆందోళనకు దిగారు. మండలంలోని చింతలవల్లి గ్రామ సర్పంచ్ పిల్లి సత్యనారాయణపై గతంలో పని చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుత కార్యదర్శి ఇరువురు కూడా వివక్షత చూపడంపై సోమవారం గ్రామస్తులతో కలసి నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పనుల్లోనూ గ్రామ కార్యదర్శులకు ఎంత సహకరించినా, ఇబ్బందులు పెడుతున్నారని, బిల్లులు చెల్లించక పోగా, అధికార కార్యక్రమాలకు కూడా సమాచారం అందించడంలేదని వాపోయారు. గత కార్యదర్శి ఇళ్ల పన్నులు వసూలు చేసి, పంచాయతీ అక్కౌంటుకు నగదు జమ చేయలేదని, దానిని తాను గమనించి, నిలదీయగా రూ.6 లక్షల, 40 వేలు పంచాయతీ ఖాతాకు చెల్లించాడన్నారు. గతంలో తాను చేయించిన పనులకు కార్యదర్శి బిల్లులు పెట్టలేదని వాపోయారు.
అధికారిక కార్యక్రమాలకు సమాచారం లేదు
ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి మరో అడుగు ముందుకేసి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం తనకు సమాచారం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత నిధులు రూ.14 లక్షలతో గ్రామ పంచాయతీలో చేయించిన పనులకు సంబంధించి బిల్లులు సమర్పించినా, నగదు పుస్తకంలో నమోదు చేయకుండా, చెల్లింపులు జరుపకుండా, గ్రామ టీడీపీ నేతలు చెబితేనే బిల్లులు మంజూరు చేయిస్తానంటున్నారని ఆరోపించారు. సర్పంచ్‌నైన తనకు తెలియకుండా కార్యదర్శి సొంతగానూ. ప్రైవేటు వ్యక్తులతోనూ పనులు చేయిస్తూ, వారి బిల్లులు నగదు పుస్తకంలో నమోదు చేసి, చెల్లిస్తున్నారని, కానీ తనకు రావలసిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఎస్సీ సర్పంచ్‌పై జరుగుతున్న వివక్షతను తొలగించి, బకాయిల చెల్లింపు విషయంలో న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసి సుధాకర్, సొసైటీ మాజీ అధ్యక్షుడు సుగసాని శ్రీనివాసరావు, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పల్లెపాము సూర్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాసరావు, సుందరరావు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.


