శ్రీవారి క్షేత్రంలో కొత్త క్యూలైన్ నిర్మాణ పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన క్యూలైన్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా యాగశాల పక్కన కొత్తగా గుమ్మం ఏర్పాటు చేసేందుకు సిబ్బంది యంత్రంతో గోడను కట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం రూ. 200 టికెట్లు తీసుకున్న భక్తులు ఉత్తరం వైపు క్యూలైన్ల ద్వారా పడమర వైపునకు చేరుకుని, అక్కడి నుంచి ఆలయంలోకి వెళుతున్నారు. అలాగే నిత్యార్జిత కల్యాణంలో పాల్గొంటున్న భక్తులు ధ్వజస్తంభం పక్కనున్న క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకుంటున్నారు. ఇక రూ.100 టికెట్లు తీసుకున్న వారు, ఉచిత దర్శనం భక్తులు ఉత్తరం వైపు క్యూలైన్ల ద్వారా తూర్పు వైపునకు చేరుకుని, అక్కడున్న గుమ్మంలోంచి ఆలయంలోకి వెళుతున్నారు. ఇదిలా ఉంటే రూ.200 టికెట్లు తీసుకునే వారిని, నిత్యార్జిత కల్యాణంలో పాల్గొనే భక్తులను తూర్పు వైపు ప్రత్యేకంగా గుమ్మాన్ని ఏర్పాటు చేసి, అందులోంచి ఆలయంలోకి పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తూర్పు వైపు (యాగశాల పక్కన) గుమ్మం ఏర్పాటు చేసేందుకు గోడను యంత్రంతో కట్ చేయిస్తున్నారు. అలాగే పాత క్యూలైన్లలో ర్యాంపు ఏర్పాటు నిమిత్తం గోడను నిర్మిస్తున్నారు. ఈ పనులను ఆలయ ఈఈ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన ఈ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.
యాగశాల పక్కన గోడను కట్ చేస్తున్న సిబ్బంది
అక్కడ గుమ్మం ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు
రూ.200 టికెట్, నిత్య కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లు


