పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
వైఎస్ జగన్ వల్లే మెడికల్ సీటు
చింతలపూడి: పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ధ్వజమెత్తారు. మండలంలోని దేశవరంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఎన్.రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని డీఎన్నార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని, వాటిలో ఏడు మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తయిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను 66 ఏళ్ల లీజుకు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేలా టెండర్లు పిలవడం దారుణమన్నారు. కూట మి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యం రాజ్యమేలుతోందని, కల్తీ మద్యం రాకెట్ నడిపించేది కూటమి నాయకులే అన్నారు.
కూటమి దుర్మార్గాలను ఎండగట్టాలి
కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. కోట్లు దండుకోవడానికి వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్‌పరం చేయడానికి చేస్తున్న కుట్రలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడంతో వైద్య విద్య పూర్తిగా పేదలకు దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ముందుగా గ్రామంలో సంతకాలు సేకరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జెడ్పీటీసీ ఎం.నీరజాసుధాకర్, ఎంపీపీ బి.రాంబాబు నాయక్, మండలపరిషత్ ఉపాధ్యక్షుడు గుత్తా కిషోర్, లింగపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అన్నపనేని శాంతారావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
నేను విజయనగరం జిల్లా మహారాజ వైద్య క ళాశాలలో వైద్య విద్య చ దువుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మెడికల్ కళాశాలలను తీసుకురావడంతోనే నిరుపేదనైన నాకు మెడిసిన్‌లో సీటు వచ్చింది. వైఎస్ జగన్‌కి రుణపడి ఉంటాను. వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి.
– కందికొండ లలితశ్రీ, వైద్య విద్యార్థిని, దేశవరం
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర


